టపాసులు పేలినా అదే భయం
నాలుగు రోజుల క్రితం జరిగిన పేలుళ్లు ఇప్పటికీ వాళ్లను భయపెడుతూనే ఉన్నాయి. ఏ మూల చిన్న టపాసు పేలినా కూడా మళ్లీ బాంబు పేలుళ్లు సంభవించాయంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము సమయంలో ప్యారిస్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 129 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా టపాసులు పేలిన చప్పుళ్లు విన్న కొంతమంది.. మళ్లీ బాంబు దాడులు జరుగుతున్నాయన్న అనుమానంతో పోలీసులకు ఫోన్ల మీద ఫోన్లు చేశారట. కొంతమంది యువకులతో కలిసి తాము పాటలు పాడుకుంటున్నామని, అంతలో చాలామంది పరుగులు పెడుతూ ఉండటంతో తాము కూడా పరిగెత్తామని లారిన్ అనే యువతి తెలిపింది. మృతులకు నివాళి అర్పించేందుకు సెంట్రల్ ప్యారిస్ ప్రాంతానికి వెళ్లిన వందలాది మందిలో ఆమె కూడా ఉంది.
తనకు బాంబు పేలిన శబ్దం లాంటిది వినిపించిందని, దాంతో వెంటనే పరుగులు తీశానని మరో యువకుడు చెప్పాడు. అయితే కేవలం కొంతమంది టపాసులు కాల్చడం వల్లే ఆ శబ్దాలు వచ్చాయి తప్ప బాంబు పేలుళ్లు కావని పోలీసులు నిర్ధారించారు. అక్కడికి కొంత దూరంలో కూడా అలాంటి చప్పుళ్లే వచ్చాయి.. తీరాచూస్తే అక్కడ ఓ మేడ మీద బల్బు పేలింది. అది చూసి అటు వెళ్లేవాళ్లు అందరూ భయపడి.. కొత్తగా దాడులు జరిగాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసేశారు.