ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఐవైఆర్ బాధ్యతల స్వీకరణ
సమైక్య రాష్ట్రానికి చిట్టచివరి ప్రధాన కార్యదర్శిగా.. కేవలం ఐదుగంటలు మాత్రమే పనిచేసి సరికొత్త రికార్డును స్థాపించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1979 బ్యాచ్‌కి చెందిన ఆయన అంతకుముందు సీసీఎల్ఏ కమిషనర్‌గా పనిచేశారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రసన్న కుమార్ మొహంతి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో కృష్ణారావు సమైక్య రాష్ట్రానికి చిట్టచివరి సీఎస్ అయ్యారు.
కాగా, రాష్ట్ర విభజనకు సంబంధించిన అపాయింటెడ్ డే జూన్ రెండోతేదీ కావడం, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం కూడా చేయడంతో ఆయన పదమూడు రాష్ట్రాల కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. వాస్తవానికి మూడు నెలల క్రితమే మహంతి పదవీకాలం పూర్తి కావడంతో కృష్ణారావు సీఎస్ అవుతారని అంతా భావించారు. కానీ, పాలనాపరమైన సౌలభ్యం కోసం మహంతికి పొడిగింపు ఇచ్చారు. దాంతో ఇప్పుడు కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ సీఎస్ అయ్యారు.
శిక్షణ ముగించుకుని 1981లో కెరీర్ ఆరంభించిన కృష్ణారావు.. 1987లో ఖమ్మం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నల్లగొండ కలెక్టర్‌గా కూడా పనిచేశారు. 1995లో కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ డైరెక్టర్ అయ్యారు. తర్వాత మళ్లీ రాష్ట్రానికి వచ్చి.. ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ శాఖలలో పలు హోదాల్లో పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా కూడా సేవలందించారు.