ఆంధ్రప్రదేశ్ సీఎస్గా ఐవైఆర్.. బాబు సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును నియమించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం నాడు గవర్నర్ నరసింహన్ను కలిసిన చంద్రబాబు, దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, ఉద్యోగుల పంపకాలు, అలిపిరిలో తనపై జరిగిన దాడి కేసులో తప్పించుకుని తిరుగుతున్న గంగిరెడ్డి వ్యవహారం తదితర అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.
అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలని, అంతేతప్ప రెచ్చగొట్టే విధానం సరికాదని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని, అన్నదమ్ముల మధ్య విభేదాలు తేవడం సరికాదని నచ్చజెప్పారు. తాను జూన్ రెండో తేదీ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు.