తొలి ముద్దాయి కేసీఆరే
రైతుల బలవన్మరణాలకు ఆయనే కారణం: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు తొలి ముద్దాయి సీఎం కేసీఆరేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కేసీఆర్ అసమర్థత, ముందు చూపులేని తనమే ప్రధాన కారణమంటూ విరుచుకుపడ్డారు. 318 మంది రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రే తొలి ముద్దాయి అవుతాడని ఊహించలేదని వ్యాఖ్యానించారు. శనివారం పొన్నాల గాంధీభవన్లో పార్టీ నేతలు కోదండరెడ్డి, మల్లు రవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సమస్యపై సీఎం కేసీఆర్ తొలిసారిగా స్పందించారని... కానీ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని పొన్నాల పేర్కొన్నారు. విభజన చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని, విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నాడని తెలిసినప్పుడు.. ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేదాకా కేసీఆర్ ఏం చేశారని మండిపడ్డారు. విద్యుత్ సమస్యకు పక్క రాష్ట్ర సీఎంను నిందించి చేతులు దులిపేసుకోవద్దన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, అసమర్థ పాలన వారిదని పొన్నాల విమర్శించారు.
బాబు పాలనలో ఒక్క పవర్ప్రాజెక్టూ రాలేదు: షబ్బీర్ అలీ
చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేసిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క విద్యుదుత్పాదన కేంద్రం రాలేదని, ఈ విషయంలో చంద్రబాబుపై సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని శాసన మండలిలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణ విషయంలో మొదటి నుంచీ దొంగవైఖరి ప్రదర్శించారని షబ్బీర్అలీ విమర్శించారు. చంద్రబాబు అన్యాయాలపై కేసీఆర్ జాప్యం చేయడం వల్లే తెలంగాణలో 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.