First Prime Minister
-
Chandrayaan -3: ఇదంతా నెహ్రూ ఘనతే: చత్తీస్‌గఢ్ సీఎం
రాయ్‌పూర్: మరికొద్ది గంటల్లో చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపనున్న నేపధ్యంలో చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయమని ఈ ఘనత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూదేనని వ్యాఖ్యానించారు. భారతదేశం చంద్రయాన్-3 విజయవంతమవుతున్న వేళ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఇది గొప్ప విజయమని చెబుతూ ఈ ఘనత మొత్తం భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుందని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1962లో నెహ్రూ హయాంలోనే స్థాపించబడిందని అప్పట్లో దీనిని ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(INCOSPAR)గా పిలిచేవారని అన్నారు. ఆయన ముందుచూపుతో వ్యవహరించబట్టే ఈరోజు ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. మరికొద్ది గంటల్లో యావత్ భారతదేశం గర్వించదగ్గ క్షణాలు ఆవిష్కృతం కానున్నాయి. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోనుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిని చేరుకోగా భారతదేశం ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలవనుంది. #WATCH | On Chandrayaan-3, Chhattisgarh CM Bhupesh Baghel says, "It's a big achievement for the country and the hard work of our scientists. 'Jo Aadharshila (foundation stone) Nehru Ji ne rakha, aaj world mein danka baja raha hai'. Best wishes to our scientists." (22.08) pic.twitter.com/KrGMuAJ29U — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 22, 2023 ఇది కూడా చదవండి: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చంద్రయాన్–3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడే -
గ్యాస్ క్వీన్ ఉంటే...యుద్ధమే వచ్చేది కాదు!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకీ తీవ్రంగా మారి అణు ఆయుధాలు వాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యంతోపాటు అక్కడి పౌరులు సైతం రంగంలో దిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతున్నారు. కానీ మరికొద్ది గంటల్లోనో, రోజుల్లోనో ఉక్రెయిన్ రష్యా కబంధ హస్తాల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ‘యులియా టిమోషెంకో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. గ్యాస్ క్వీన్ గా పాపులర్ అయిన యులియా మరెవరో కాదు ఉక్రెయిన్ కు తొలి మహిళా ప్రధాని. రష్యా నిర్ణయాలకు తాము వ్యతిరేకమని బహిరంగంగానే చెప్పే తెగువ ఆమెది. పశ్చిమ దేశాలతో మంచి దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ నాటోలో ఉక్రెయిన్ ను చేర్చేందుకు ప్రయత్నించింది. యులియా ప్రభుత్వం ఉన్నంత కాలం.. ఉక్రెయిన్ కు రష్యా కనీసం యుద్ధ భయాన్ని కూడా కలిగించలేక పోయింది. అందుకే అంతా యులియాను తలచుకుంటున్నారు. ఉక్రెయిన్ తొలి మహిళా ప్రధానిగా పని చేసిన యులియా 1960 నవంబర్ 27న అప్పటి యూఎస్ఎస్ఆర్ ఉక్రెయిన్ లో జన్మించింది. ఎకనామిక్స్– సైబర్నెటిక్స్ డిగ్రీని డిస్టింక్షన్ లో పూర్తిచేసింది. డిగ్రీ అయ్యాక లెనిన్ కంపెనీలో ఇంజినీర్–ఎకనమిస్ట్‌గా చేరింది. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ సెంటర్ టెర్మినల్‌కు కమర్షియల్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఉక్రెయిన్ యునైటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ స్థాపించి దేశంలో అనేక పరిశ్రమలకు గ్యాస్‌ను సరఫరా చేసింది. దీనిద్వారా దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకటిగా నిలిచింది. యునైటెడ్ ఎనర్జీని విజయవంతంగా నడిపించడంతో అంతా యులియాను ‘ద గ్యాస్ ప్రిన్సెస్’ అని, గ్యాస్ క్వీన్ అనీ పిలిచేవారు. ఆరెంజ్ రివల్యూషన్ మహిళా వ్యాపార వేత్తగా నిరూపించుకున్న తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టింది యులియా. రాజకీయాల్లోనూ తన ముద్రవేస్తూ ఒక్కో పదవిని అలంకరిస్తూ దేశానికి తొలి మహిళా ప్రధాని అయ్యింది. 2004లో రష్యాకు అనుకూలుడైన విక్టర్ యుష్నకోవ్ 2004 ఎన్నికలలో గెలిచినప్పుడు ఆయన గెలుపుని యులియా వ్యతిరేకించింది. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తూ ‘ఆరెంజ్ రివల్యూషన్ ’ను తీసుకొచ్చింది. విక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆరెంజ్ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి భారీఎత్తున మద్దతు లభించింది. ఆరెంజ్ రివల్యూషన్ విజయవంతం కావడంతో యులియా దేశానికి ప్రధాని అయింది. 2005లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి మహిళా ప్రధానిగా, 2007 డిసెంబర్ నుంచి 2010 మార్చి వరకు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించింది. అంగుళం కూడా ఆక్రమించలేరు! తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది యులియా. ముఖ్యంగా జీతాలు పెంచడం, యుటిలిటీ టారిఫ్‌లు తగ్గించడం వంటి వినూత్న నిర్ణయాలు ఉక్రేనియన్లను ఎంతగానో ఆకర్షించాయి. అంతేగా ‘మా మాతృభూమిని మీకు అప్పగించడానికి మేము సిద్ధంగా లేము’ అని అనేకసార్లు బహిరంగంగానే స్పష్టం చేసింది. అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని రష్యాకు సవాళ్లు విసిరేది. రెండోసారి ప్రధాని అయినప్పుడు గ్యాస్ ఒప్పందం విషయంలో చర్చలు సఫలం కాకపోవడంతో రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఈ సమయంలో యులియా రష్యాను తెలివిగా ఒప్పించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. అందుకే ఇప్పుడంతా ఆమె నాయకత్వంలో దేశం ఉండి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని వాపోతున్నారు. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎంపికై, రెండుసార్లు ప్రధానిగా తనదైన ముద్ర వేసిన యులియా ఇరవై ఏళ్లకుపైగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ దేశం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. -
బాలల నేస్తం చాచా నెహ్రూ
నవంబరు 14 బాలల దినోత్సవం సందర్భంగా... కాలేజీలో నెహ్రూను జో అని పిలిచేవారు.అత్యధిక కాలంపాటు ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిగా నెహ్రూ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేకపోయారు.బాలలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలన్న ఆదేశసూత్రాలు నెహ్రూ ప్రతిపాదనలే! పంచవర్ష ప్రణాళికల రూపకర్త నెహ్రూనే. ఆ ప్రణాళికలలో విద్యకు అధిక మొత్తాన్ని కేటాయించింది ఆయనే. సాహస బాలల పురస్కారాన్ని బాలల దినోత్సవం రోజునే అందజేయడం ఆనవాయితీ.నవంబర్ 14 చిన్నారులందరూ బాగా గుర్తుంచుకునే రోజు. ఎందుకంటే ఆరోజు బాలల దినోత్సవం కాబట్టి. మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అందరికీ తెలిసిందే. ఇంతకూ నెహ్రూకు, బాలలకు సంబంధం ఏమిటి? నెహ్రూ పుట్టినరోజును మాత్రమే బాలల దినోత్సవంగా జరుపుకోవడానికి కారణమేమిటో చూద్దామా? జవహర్లాల్ నెహ్రూ నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో 1889 నవంబర్ 14న జన్మించారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి. మోతీలాల్ గొప్ప న్యాయవాది, మంచి పేరున్న రాజకీయవేత్త. వీరిది బాగా కలిగిన కుటుంబం కావడం వల్ల నెహ్రూ, ఆయన తోబుట్టువులు చిన్నప్పటి నుంచి మంచి వస్త్రధారణతో, పాశ్చాత్య పోకడలతో ఆధునికంగా కనపడేవారు. వీరికి హిందీ, సంస్కృతం బాగా వచ్చు. పదిహేను సంవత్సరాల వయసులో నెహ్రూ ఉన్నత చదువులకోసం ఇంగ్లండ్ వెళ్లి, అక్కడి ప్రతిష్ఠాత్మకమైన ట్రినిటీ కళాశాలలో, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. కొడుకు కూడా తనలాగే న్యాయవాది కావాలన్న ఆకాంక్షతో మోతీలాల్ నెహ్రూను పట్టుబట్టి మరీ న్యాయశాస్త్రం చదివించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడే నెహ్రూ మానసికంగా ఎంతో వికాసాన్ని పొందారు. ప్రపంచ రాజకీయాలపట్ల అవగాహన పెంచుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం కోసం స్వదేశానికి తిరిగి వచ్చిన నెహ్రూను గాంధీజీ నాయకత్వంలోని స్వాతంత్య్రోద్యమం అమితంగా ఆకట్టుకుంది. దాంతో ధనార్జన కోసం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి బదులు సాటి ఉద్యమకారులతో కలసి స్వాతంత్య్ర సముపార్జన కోసం పోరాడేందుకే ఆయన మనసు మొగ్గు చూపింది. ఆంగ్లేయులపై పోరాటానికి నడుంకట్టారు. కొడుకు రాజకీయప్రవేశాన్ని మోతీలాల్ మొదట కొంత వ్యతిరేకించారు. పెళ్లి చేస్తేనయినా మారతాడేమోననే ఆశతో కమలా కౌల్ అనే యువతితో వివాహం జరిపించారు. అయితే తండ్రి ఆశను అడియాసలు చేస్తూ, వివాహానంతరం కూడా నెహ్రూ స్వాతంత్య్రపోరాటంలోనే కాలం గడుపుతుండటంతో ఆయనలోని నిబద్ధతను గుర్తించి ప్రోత్సహించారు. అంతేకాదు, కుమారునితోబాటు తాను కూడా స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మోతీలాల్. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అడుగుజాడలలో నడిచారు జవహర్లాల్. తనతోబాటు ఎంతోమంది యువకులను జాతీయోద్యమం వైపు మళ్లేలా చేశారు. ఫలితంగా ఆంగ్లేయులు నెహ్రూను తొమ్మిదేళ్లపాటు జైలులో ఉంచారు. జైలుకు వెళ్లేటప్పటికి నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చాలా చిన్నది. జైలు జీవితం గడిపేటప్పుడు కూడా నెహ్రూ ఊరికే కూచోలేదు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథ రచన చేశారు. ఆయనలోని పోరాటపటిమ, కార్యదక్షత, సహనశీలత, అభ్యుదయ దృక్పథం, అద్భుతమైన ఆలోచనా సరళి, వీటన్నింటితోబాటు నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కలిపి నెహ్రూను స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిని చేశాయి. 1964లో జబ్బుతో చనిపోయేవరకు ఆయన ప్రధాని పదవిలో కొనసాగారు. నెహ్రూ కోటుకు గులాబీ పువ్వు చిన్నారి ప్రియదర్శినికి సుద్దులు చెబుతూ జైలు నుంచే నెహ్రూ ఎన్నో ఉత్తరాలు రాశారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆ ఉత్తరాలు ఆ తర్వాతి కాలంలో లేఖాసాహిత్యంలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి. చిన్న వయసులోనే భార్య చనిపోయినా, నెహ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని లోటు తెలియకుండా కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. తన కుమార్తెనే కాదు, చుట్టుపక్కల పిల్లలను కూడా చేరదీసేవారు. ప్రేమగా లాలించేవారు. అందుకే అందరూ ఆయన్ను చాచా (బాబాయ్) అని పిలిచేవారు. ఓసారి నెహ్రూకు ఓ పాఠశాల వార్షికోత్సవంలో ఓ చిన్నారి గులాబీపువ్వును ఇచ్చింది. ఆ పువ్వును తీసుకుని ఆయన తన కోటుకు అలంకరించుకున్నారు. దాంతో ఆ చిన్నారి మొహం ఆనందంతో వెలిగిపోయింది. అప్పటినుంచి ఆయన కోటుకు గులాబీని అలంకరించుకోవడం మొదలు పెట్టారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమను చూసి, 1964లో ఆయన మరణానంతరం నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. - బాచి