బాలల నేస్తం చాచా నెహ్రూ
నవంబరు 14 బాలల దినోత్సవం సందర్భంగా...
కాలేజీలో నెహ్రూను జో అని పిలిచేవారు.అత్యధిక కాలంపాటు ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిగా నెహ్రూ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేకపోయారు.బాలలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలన్న ఆదేశసూత్రాలు నెహ్రూ ప్రతిపాదనలే! పంచవర్ష ప్రణాళికల రూపకర్త నెహ్రూనే. ఆ ప్రణాళికలలో విద్యకు అధిక మొత్తాన్ని కేటాయించింది ఆయనే. సాహస బాలల పురస్కారాన్ని బాలల దినోత్సవం రోజునే అందజేయడం ఆనవాయితీ.నవంబర్ 14 చిన్నారులందరూ బాగా గుర్తుంచుకునే రోజు. ఎందుకంటే ఆరోజు బాలల దినోత్సవం కాబట్టి. మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అందరికీ తెలిసిందే. ఇంతకూ నెహ్రూకు, బాలలకు సంబంధం ఏమిటి? నెహ్రూ పుట్టినరోజును మాత్రమే బాలల దినోత్సవంగా జరుపుకోవడానికి కారణమేమిటో చూద్దామా?
జవహర్‌లాల్ నెహ్రూ నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో 1889 నవంబర్ 14న జన్మించారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి. మోతీలాల్ గొప్ప న్యాయవాది, మంచి పేరున్న రాజకీయవేత్త. వీరిది బాగా కలిగిన కుటుంబం కావడం వల్ల నెహ్రూ, ఆయన తోబుట్టువులు చిన్నప్పటి నుంచి మంచి వస్త్రధారణతో, పాశ్చాత్య పోకడలతో ఆధునికంగా కనపడేవారు. వీరికి హిందీ, సంస్కృతం బాగా వచ్చు. పదిహేను సంవత్సరాల వయసులో నెహ్రూ ఉన్నత చదువులకోసం ఇంగ్లండ్ వెళ్లి, అక్కడి ప్రతిష్ఠాత్మకమైన ట్రినిటీ కళాశాలలో, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. కొడుకు కూడా తనలాగే న్యాయవాది కావాలన్న ఆకాంక్షతో మోతీలాల్ నెహ్రూను పట్టుబట్టి మరీ న్యాయశాస్త్రం చదివించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడే నెహ్రూ మానసికంగా ఎంతో వికాసాన్ని పొందారు. ప్రపంచ రాజకీయాలపట్ల అవగాహన పెంచుకున్నారు.
న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం కోసం స్వదేశానికి తిరిగి వచ్చిన నెహ్రూను గాంధీజీ నాయకత్వంలోని స్వాతంత్య్రోద్యమం అమితంగా ఆకట్టుకుంది. దాంతో ధనార్జన కోసం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి బదులు సాటి ఉద్యమకారులతో కలసి స్వాతంత్య్ర సముపార్జన కోసం పోరాడేందుకే ఆయన మనసు మొగ్గు చూపింది. ఆంగ్లేయులపై పోరాటానికి నడుంకట్టారు. కొడుకు రాజకీయప్రవేశాన్ని మోతీలాల్ మొదట కొంత వ్యతిరేకించారు. పెళ్లి చేస్తేనయినా మారతాడేమోననే ఆశతో కమలా కౌల్ అనే యువతితో వివాహం జరిపించారు. అయితే తండ్రి ఆశను అడియాసలు చేస్తూ, వివాహానంతరం కూడా నెహ్రూ స్వాతంత్య్రపోరాటంలోనే కాలం గడుపుతుండటంతో ఆయనలోని నిబద్ధతను గుర్తించి ప్రోత్సహించారు. అంతేకాదు, కుమారునితోబాటు తాను కూడా స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మోతీలాల్. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అడుగుజాడలలో నడిచారు జవహర్‌లాల్.
తనతోబాటు ఎంతోమంది యువకులను జాతీయోద్యమం వైపు మళ్లేలా చేశారు. ఫలితంగా ఆంగ్లేయులు నెహ్రూను తొమ్మిదేళ్లపాటు జైలులో ఉంచారు. జైలుకు వెళ్లేటప్పటికి నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని చాలా చిన్నది. జైలు జీవితం గడిపేటప్పుడు కూడా నెహ్రూ ఊరికే కూచోలేదు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథ రచన చేశారు. ఆయనలోని పోరాటపటిమ, కార్యదక్షత, సహనశీలత, అభ్యుదయ దృక్పథం, అద్భుతమైన ఆలోచనా సరళి, వీటన్నింటితోబాటు నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కలిపి నెహ్రూను స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిని చేశాయి. 1964లో జబ్బుతో చనిపోయేవరకు ఆయన ప్రధాని పదవిలో కొనసాగారు.
నెహ్రూ కోటుకు గులాబీ పువ్వు
చిన్నారి ప్రియదర్శినికి సుద్దులు చెబుతూ జైలు నుంచే నెహ్రూ ఎన్నో ఉత్తరాలు రాశారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆ ఉత్తరాలు ఆ తర్వాతి కాలంలో లేఖాసాహిత్యంలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి. చిన్న వయసులోనే భార్య చనిపోయినా, నెహ్రూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని లోటు తెలియకుండా కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు.
తన కుమార్తెనే కాదు, చుట్టుపక్కల పిల్లలను కూడా చేరదీసేవారు. ప్రేమగా లాలించేవారు. అందుకే అందరూ ఆయన్ను చాచా (బాబాయ్) అని పిలిచేవారు. ఓసారి నెహ్రూకు ఓ పాఠశాల వార్షికోత్సవంలో ఓ చిన్నారి గులాబీపువ్వును ఇచ్చింది. ఆ పువ్వును తీసుకుని ఆయన తన కోటుకు అలంకరించుకున్నారు. దాంతో ఆ చిన్నారి మొహం ఆనందంతో వెలిగిపోయింది. అప్పటినుంచి ఆయన కోటుకు గులాబీని అలంకరించుకోవడం మొదలు పెట్టారు. బాలల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమను చూసి, 1964లో ఆయన మరణానంతరం నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం మొదలు పెట్టారు.
- బాచి