పొదల్లో పడిన బంతిని తెచ్చుకుందామంటే కమాండో అడ్డుకున్నాడు. బయటికెళ్లి ఆడుకుందామంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వద్దన్నాడు. తాజ్‌మహల్ చూద్దామంటే.. కుదరదని కేర్ టేకర్ తేల్చేశాడు. ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను తినబోతే.. ఆయా అడ్డుకుంది. స్కూలుకైనా వెళ్దామనుకుంటే.. టీచర్లే ఇంటికి వస్తున్నారు. బయట స్వేచ్ఛగా ఆడుకుంటున్న చిన్నారులను చూసి.. తాము బంగారు పంజరాల్లో చిలకలమని ఆ అన్నా చెల్లెళ్లు ఎన్నోసార్లు బాధపడ్డారు.- సాక్షి, బాలల దినోత్సవ ప్రత్యేకం
నవంబరు 14.. జాతీయ బాలల దినోత్సవం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకే, ఆయన జయంతిని దేశమంతా బాలల దినోత్సవంగా జరుపుకొంటాం. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. చిన్నారులను ఎంతో ప్రేమించే నెహ్రూ ఇంట్లో వారసులు మాత్రం వారి బాల్యాన్ని అందరిలా ఆస్వాదించలేకపోయారు. ఇందిరాగాంధీ, రాహుల్, ప్రియాంకా బాల్యం భారంగా, దయనీయంగా గడిచింది. నెహ్రూ కుటుంబ వారసులైన కారణంగా తమ ప్రమేయం లేకుండానే వీరు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారిపోయారు. వీరి జీవితాలకు సంబంధించిన పలు విషాదకర సంఘటనలను బాలల దినోత్సవం సందర్భంగా మీకోసం అందిస్తున్నాం.
ఇందిరా, రాహుల్, ప్రియాంకాగాంధీల గురించి మునుపెన్నడూ వినని విషయాల గురించిన సమాచారం ఇది. స్వాతంత్య్ర సంగ్రామం కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. ఈ సమయంలో ఆయన తన గారాలపట్టి ఇందిరాగాంధీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే, ఆ దూరం తెలియనివ్వకుండా తన కూతురుకు తరచుగా ఉత్తరాలు రాస్తుండేవారు. నెహ్రూ జైలుకు వెళ్లిన ప్రతీసారి.. నాన్న ఆరోజు ఇంటికి రారని చిన్నారి ఇందిర చాలా బాధపడేవారు. ముఖ్యంగా నెహ్రూ అరెస్ట వార్త తెలుసుకున్న రోజు ఎంత బాధపడేవారో.. ఆయన జైలు నుంచి విడుదలవుతున్నారని తెలిసి అంతే సంతోషపడేవారు. కానీ, మిగిలిన కుటుంబ సభ్యులు తోడుగా ఉండటం ఆమెకు కాస్త ఉపశమనంగా ఉండేది. ఈ విషయంలో ఇందిర మనవలు, మనవరాళ్ల పరిస్థితి మరీ దిగజారిందనే చెప్పాలి.
భారంగా రాహుల్, ప్రియాంకల బాల్యం..!
ఘనమైన రాజకీయ వారసత్వం, రాజకుటుంబం. వారికేం? నోట్లో బంగారు చెంచాలు పెట్టుకుని పుట్టారు అని అనుకుంటుంది దేశమంతా. కానీ, వారి గురించి ఈ లోకానికి తెలియని కొన్ని నిజాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి వారి బాల్యం మనమనుకున్నంత స్వేచ్ఛగా గడిచిపోలేదు. స్థితిమంతుల కుటుంబం, వారసత్వంగా ప్రధాని పగ్గాలు చేపడుతుండటంతో వీరికి శత్రువులూ అదేస్థాయిలో పెరుగుతూ వచ్చారు. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ తరువాత వీరి కుటుంబ సభ్యులంతా ఉగ్రవాదులకు లక్ష్యంగా మారారు. ఇందిరాగాంధీ హత్య జరిగినపుడు రాహుల్ వయసు 14 ఏళ్లు, ప్రియాంకాకు 12 సంవత్సరాలు. వీరు కూడా ఉగ్రవాదులకు లక్ష్యంగా మారడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంతగా అంటే.. వీరికి సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తేగానీ, అనుమతించేవారుకాదు అధికారులు. ఇద్దరినీ స్కూలు మాన్పించారు. టీచర్లే ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. సినిమాలు, షికార్లు, ఆటపాటలు అన్నీ బంద్. అందరి పిల్లల్లా మైదానంలో కాకుండా ఇంటిలో వీరిద్దరే ఆడుకునేవారు. మొత్తానికి పంజరంలో చిలకల్లా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థలో వీరి బాల్యం గడిచిపోయింది.
రాహుల్ గాంధీ అలియాస్ రౌల్ విన్సీ!
రాజీవ్ గాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక. రాహుల్ డిగ్రీలో చేరాడు. అది మధ్యలో ఉండగానే.. రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు. దీంతో రాహుల్ చదువును విదేశాల్లో కొనసాగించాడు. తమిళపులులు లండన్‌లోనూ హాని తలపెట్టవచ్చన్న అనుమానంతో రాహుల్‌ను అమెరికా పంపారు. ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. అక్కడ రాహుల్‌గాంధీ అంటే ఎవరో అతని క్లాస్‌మేట్స్‌కి తెలియదు. ఎందుకంటే.. భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం రాహుల్‌గాంధీ పేరును రౌల్ విన్సీగా మార్చింది. ఈ విషయం ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు. నెహ్రూ సేవలకు గుర్తుగా బాలల దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకొంటున్నా.. ఆయన ఇంట బాలలు ఎదుర్కొన్న పరిస్థితులు నిజంగా దురదృష్టకరం.
Comments
Please login to add a commentAdd a comment