ఢిల్లీ: రాజ్యసభలో సోమవారం జమ్మకశ్మీర్‌కు సంబంధించి రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. అయితే ఆ టైంలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూపై, గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెహ్రూ మనవడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
‘‘పండిట్ నెహ్రూ తన జీవితాన్ని ఈ దేశానికి అంకితమిచ్చారు. దేశ ప్రజల కోసం ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. అమిత్‌షాకు చరిత్ర తెలియదు. తెలుసుకుంటారని కూడా నేను అనుకోను. అందుకే పదే పదే దాన్ని తిరగరాస్తూనే ఉన్నారు’’ అని రాహుల్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే భాజపా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని రాహుల్ అన్నారు. ‘‘కుల గణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరి చేతుల్లో ఉంది.. ఇవన్నీ ప్రధాన అంశాలు. వీటిపై చర్చించేందుకు బీజేపీ భయపడుతోంది. అందుకే వీటి నుంచి పారిపోతోంది’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.
రాజ్యసభలో జమ్ము కశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘కేవలం ఒకేవ్యక్తి పొరపాటు వల్ల భారత్‌లో జమ్ముకశ్మీర్ భాగం కావడం ఆలస్యమైంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సైతం భగ్గుమంది.
ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లులకు కేంద్రం రూపం తెచ్చింది. కశ్మీరీ శరణార్థుల నుంచి ఇద్దరిని, పాక్ ఆక్రమిత కశ్మీర్ నిర్వాసితుల నుంచి ఒకరిని శాసనసభకు నామినేట్ చేసేందుకు, కొన్ని వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయి. లోక్‌సభ కిందటి వారమే ఈ బిల్లుల్ని ఆమోదించగా.. రాజ్యసభలో సోమవారం దాదాపు నాలుగు గంటల చర్చ తర్వాత ఆమోదం లభించింది. తర్వాతి దశలో రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment