యులియా టిమోషెంకో
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకీ తీవ్రంగా మారి అణు ఆయుధాలు వాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యంతోపాటు అక్కడి పౌరులు సైతం రంగంలో దిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతున్నారు. కానీ మరికొద్ది గంటల్లోనో, రోజుల్లోనో ఉక్రెయిన్ రష్యా కబంధ హస్తాల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ సమయంలో ‘యులియా టిమోషెంకో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. గ్యాస్ క్వీన్ గా పాపులర్ అయిన యులియా మరెవరో కాదు ఉక్రెయిన్ కు తొలి మహిళా ప్రధాని. రష్యా నిర్ణయాలకు తాము వ్యతిరేకమని బహిరంగంగానే చెప్పే తెగువ ఆమెది. పశ్చిమ దేశాలతో మంచి దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ నాటోలో ఉక్రెయిన్ ను చేర్చేందుకు ప్రయత్నించింది. యులియా ప్రభుత్వం ఉన్నంత కాలం.. ఉక్రెయిన్ కు రష్యా కనీసం యుద్ధ భయాన్ని కూడా కలిగించలేక పోయింది. అందుకే అంతా యులియాను తలచుకుంటున్నారు.
ఉక్రెయిన్ తొలి మహిళా ప్రధానిగా పని చేసిన యులియా 1960 నవంబర్ 27న అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్ ఉక్రెయిన్ లో జన్మించింది. ఎకనామిక్స్– సైబర్‌నెటిక్స్ డిగ్రీని డిస్టింక్షన్ లో పూర్తిచేసింది. డిగ్రీ అయ్యాక లెనిన్ కంపెనీలో ఇంజినీర్–ఎకనమిస్ట్‌గా చేరింది. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ సెంటర్ టెర్మినల్‌కు కమర్షియల్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఉక్రెయిన్ యునైటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ స్థాపించి దేశంలో అనేక పరిశ్రమలకు గ్యాస్‌ను సరఫరా చేసింది. దీనిద్వారా దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకటిగా నిలిచింది. యునైటెడ్ ఎనర్జీని విజయవంతంగా నడిపించడంతో అంతా యులియాను ‘ద గ్యాస్ ప్రిన్సెస్’ అని, గ్యాస్ క్వీన్ అనీ పిలిచేవారు.
ఆరెంజ్ రివల్యూషన్
మహిళా వ్యాపార వేత్తగా నిరూపించుకున్న తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టింది యులియా. రాజకీయాల్లోనూ తన ముద్రవేస్తూ ఒక్కో పదవిని అలంకరిస్తూ దేశానికి తొలి మహిళా ప్రధాని అయ్యింది. 2004లో రష్యాకు అనుకూలుడైన విక్టర్ యుష్నకోవ్ 2004 ఎన్నికలలో గెలిచినప్పుడు ఆయన గెలుపుని యులియా వ్యతిరేకించింది. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తూ ‘ఆరెంజ్ రివల్యూషన్ ’ను తీసుకొచ్చింది. విక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆరెంజ్ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి భారీఎత్తున మద్దతు లభించింది. ఆరెంజ్ రివల్యూషన్ విజయవంతం కావడంతో యులియా దేశానికి ప్రధాని అయింది. 2005లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి మహిళా ప్రధానిగా, 2007 డిసెంబర్ నుంచి 2010 మార్చి వరకు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించింది.
అంగుళం కూడా ఆక్రమించలేరు!
తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది యులియా. ముఖ్యంగా జీతాలు పెంచడం, యుటిలిటీ టారిఫ్‌లు తగ్గించడం వంటి వినూత్న నిర్ణయాలు ఉక్రేనియన్లను ఎంతగానో ఆకర్షించాయి. అంతేగా ‘మా మాతృభూమిని మీకు అప్పగించడానికి మేము సిద్ధంగా లేము’ అని అనేకసార్లు బహిరంగంగానే స్పష్టం చేసింది. అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని రష్యాకు సవాళ్లు విసిరేది. రెండోసారి ప్రధాని అయినప్పుడు గ్యాస్ ఒప్పందం విషయంలో చర్చలు సఫలం కాకపోవడంతో రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఈ సమయంలో యులియా రష్యాను తెలివిగా ఒప్పించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. అందుకే ఇప్పుడంతా ఆమె నాయకత్వంలో దేశం ఉండి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని వాపోతున్నారు. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎంపికై, రెండుసార్లు ప్రధానిగా తనదైన ముద్ర వేసిన యులియా ఇరవై ఏళ్లకుపైగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ దేశం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment