తాగు నీటి సమస్యకే తొలి ప్రాధాన్యం
కౌతాళం: జిల్లాలో తాగు నీటి సమస్యకు తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఒక వేళ ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సోమవారం రాజనగర్ క్యాంపు వద్ద ఉన్న కౌతాళం ఎస్ఎస్ ట్యాంకును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు కరకట్ట పనులు వేగవంతం చేసి తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 33.65 లక్షల క్యూబిక్ మీటర్లు సామర్థం ఉంటే అదనంగా 40 వేల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ చేయడం వల్ల కరకట్ట కుంగిందని అన్నారు. నాణ్యత లోపం కూడా విచారణ చేస్తామని అన్నారు. నాణ్యత లోపం వల్ల కరకట్ట కుంగిపోయిందని నివేదిక వస్తే ఈ ఖర్చు అంత కాంట్రాక్టర్ ద్వారా వసూలు చేయాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతానికి మరమ్మతులు చేస్తామన్నారు.
కౌతాళం ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానన్నారు. రాయలసీమలోని ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో నీటి సమస్య చాల తక్కువగా ఉందన్నారు. జిల్లాలో ఎల్ఎల్సి, హెచ్ఎల్సీ, కెసీకెనాల్ ద్వారా ఆయా గ్రామాల్లో ఉన్న ట్యాంకులను నింపి ఈ వేసవికాలంలో తాగునీటిని అందిస్తామన్నారు. తాగునీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్డీవోలకు పూర్తి అధికారం ఇచ్చామన్నారు.