fisharies
-
చెరువుల్లో సముద్ర చేపలు!
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం రైతుల వినూత్న ఆలోచనతో.. ఆక్వా సాగు కొత్తపుంతలు తొక్కుతూ లాభాల బాటలో పయనిస్తున్నది. సహజంగా చెరువుల్లో సాధారణ రకాల చేపలు, రొయ్యలను సాగుచేస్తుంటారు. అయితే సముద్రంలో లభించే అరుదైన పండుగప్ప(సీబాస్), చందువాపార(సిల్వర్ పాంపనో) రకం చేపలను చెరువుల్లో పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన పెదపులుగువారిపాలెం రైతులకు వచ్చిన నేపథ్యంలో.. పంజరం సాగు ప్రచారంలోకి వచ్చింది. పంజరాల్లో చేపల పెంపకం ఇలా.. సముద్రంలో పెరిగే పండుగప్ప, చందువాపార చేపలు సాధారణంగా వాటి కన్నా పరిమాణంలో చిన్న చేపలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. దీనిని నివారించేందుకు పిల్లలను చెరువుల్లో వలలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంజరాల్లో సాగు చేస్తున్నారు. వారానికొకసారి చేపలను గ్రేడింగ్ చేసి బరువు ఆధారంగా వేర్వేరు పంజరాల్లో పెంచుతున్నారు. పంజరంలో పెరిగే క్రమంలో చిన్న వయసు నుంచే రైతులు వేసే మేతను తినే అలవాటు చేస్తారు. ఇలా 100 గ్రాములు బరువు వచ్చే వరకు పంజరంలో పెంచిన తర్వాత ఒకే పరిమాణంలో ఉన్న చేపలను చెరువుల్లోకి విడుదల చేస్తారు. రొయ్య, చేపల పెంపకంలో తరచూ నష్టాలు వస్తుండడంతో ప్రత్యామ్నాయంగా పంజరాల్లో సాగు ప్రారంభించామని పెదపులువారిపాలెం రైతులు చెబుతున్నారు. ఆర్టీసీఏ సహకారంతో ప్రయోగాత్మకంగా తొలుత మూడెకరాల్లో సాగు చేసిన పంజరం తరహాసాగు లాభదాయకంగా ఉండడంతో.. ప్రస్తుతం 33 ఎకరాల్లో సాగవుతోందని చెబుతున్నారు. చెరువు వద్దే రూ.400 పైగా ధర.. పండుగప్ప, చందువాపార రకాలకు మన దేశంతో పాటు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మలేషియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. చెరువు వద్దే పండుగప్ప చేప కిలో రూ.400 పైగా ధర పలుకుతుంది. వీటిని ఉప్పు చేపగా తయారుచేసి కిలో రూ.800–850 దాకా విక్రయిస్తున్నారు. అలాగే చందువాపార రకం రైతు వద్ద కిలో రూ.350 దాకా లభిస్తోంది. ‘ఆక్వా’ పార్కుతో మరింత ప్రోత్సాహం.. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్(ఆర్జీసీఏ), కొచ్చిన్‌లో ఉన్న సెంటర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ) సముద్ర రకం చేపల సాగుకు పిల్లలను సరఫరా చేస్తున్నాయి. సముద్ర చేపల పెంపకాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిజాంపట్నంలో ఆక్వా పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు 280 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు చేయనున్న పార్కు డీపీఆర్ పూర్తవుతుంది. ప్రోత్సాహంతో పాటు శిక్షణ.. సముద్ర చేపలైన పండుగప్ప, చందువాపార రకం పెంచాలనుకునే రైతులకు అవసరమైన సాంకేతిక శిక్షణను ఆర్బీకేల ద్వారా అందించనున్నాం. చెరువుల తవ్వకానికి 40 శాతం దాకా సబ్సిడీ ఇవ్వనున్నాం. నాణ్యమైన, తక్కువ ధరలో చేప పిల్లలను అందు బాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. – డి. సురేష్, డీడీ, మత్స్యశాఖ, గుంటూరు జిల్లా -
ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలి: మోపిదేవి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలను వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి.. మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.1509 కోట్లతో మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దశలవారీగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
Fish Andhra: ఇంటి ముంగిటకే చేపలు
సాక్షి, అమరావతి: బొమ్మిడాయల పులుసు, కొర్రమీను ఫ్రై, రావల ఇగురు, బొచ్చె, శీలావతి, రాగండి కూరలు.. ఈ పేర్లు చెబితేనే మాంసాహారులకు నోరూరుతుంది కదూ.. అవును ఈ చేపల్లో పోషక విలువలూ ఎక్కువే. అందుకే ప్రభుత్వం తాజా స్వచ్ఛమైన చేపలను ప్రజలకు అందించడంతోపాటు, ఆక్వా రైతులకు మార్కెటింగ్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ–వెహికల్, మినీఫిష్ రిటైల్ అవుట్లెట్ల స్థాపననూ ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తిలో ముందు.. వినియోగంలో వెనుక రాష్ట్రంలో మాంసాహారులకు తాజా స్వచ్ఛమైన చేపలు దొరకడం గగనమే. పైపెచ్చు అన్ని రకాల చేపలూ అందుబాటులో ఉండవు. దీంతో పోషక విలువలు ఉన్న చేపలు తినాలనే ఆసక్తి ఉన్నా.. ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. మత్స్య సంపద ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో (దేశ వ్యాప్తంగా ఉత్పత్తిలో ఏపీ వాటా 75.84 శాతం) ఉంది. అదే సమయంలో వాటి వినియోగంలో మాత్రం బాగా వెనుకబడి ఉంది. 2020లో ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఏడాదికి సరాసరిన ఓ వ్యక్తి చత్తీస్ఘడ్, కేరళ రాష్ట్రాల్లో 19 కేజీలు, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 16 కేజీల చేపలను తింటున్నారని అంచనా. మన రాష్ట్రంలో మాత్రం ఇది కేవలం 8.07 కేజీలుగా ఉంది. మార్కెట్ లేక రైతుల అవస్థలు ప్రజలు చేపల వినియోగంలో వెనుకపడడంతో రైతులు తమ చెంతనే ఉన్న మార్కెట్‌ను కోల్పోతున్నారు. ఫలితంగా కేవలం ఎగుమతులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కోవిడ్ సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఆక్వా హబ్‌ల ఆలోచన చేసింది. హబ్‌ల పనితీరు ఇలా.. ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, వినుకొండ, పిడుగురాళ్లలో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి విడతగా గుంటూరు, తెనాలిలో హబ్‌ల ఏర్పాటుకు లబ్ధిదారులు ముందుకొచ్చారు. వీటి ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నవంబర్ 21న అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ రెండు హబ్‌లను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వా హబ్‌ల పనితీరు ► ఆక్వా హబ్‌లను రైతులు సొసైటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. ► చేపలు, ఆక్వా ఉత్పత్తులను సేకరించి ప్రాసెస్ చేస్తారు. అందుకోసం రూ.2 కోట్లతో శీతల గిడ్డంగిని సమకూర్చుకుంటారు. ► ఇందులో లైవ్ పూల్స్, ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులో ఉంటాయి. ► హబ్‌ల నుంచి మత్స్య సంపదను రిటైల్ వర్తకులకు సరఫరా చేస్తారు. రిటైల్ యూనిట్లు ఇలా.. ► గ్రామ/వార్డుస్థాయిలో ఈ–వెహికల్, మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు కానున్నాయి. ► హబ్‌ల ద్వారా సరుకు తీసుకుని ఆసక్తి ఉన్న వ్యాపారులు వాల్యూ యాడెడ్ యూనిట్లను నెలకొల్పుకోవచ్చు. ► రిటైల్ దుకాణాలు, ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేసుకోవచ్చు. ► ఈ యూనిట్లలో స్నాక్స్, ఆహార ఉత్పత్తులూ అందుబాటులో ఉంచొచ్చు. ► మత్స్య ఉత్పత్తుల విక్రయానికి కియోస్క్ యూనిట్లనూ ఏర్పాటు చేయనున్నారు. ►మొబైల్ ఫిష్ వెండింగ్, ఫుడ్ కోర్టులూ అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ రాయితీ మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్ మినహా అన్ని రకాల యూనిట్లకు ప్రభుత్వం రాయితీ అందించనుంది. బీసీ, జనరల్‌కు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 60 శాతం పెట్టుబడిని రాయితీగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడు తన వాటాగా సమకూర్చుకోవాలి. ఇందుకు బ్యాంకు ద్వారా రుణం సమకూర్చే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. హబ్‌లు, రిటైల్ దుకాణాల ఏర్పాటులో తొలి ప్రాధాన్యం చేపల వేట, మత్స్య వ్యాపారం చేస్తున్న కుటుంబాలకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఔత్సాహికులు సచివాలయాల్లో సంప్రదించాలి ఆక్వా హబ్‌ల వల్ల గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మత్స్య యూనిట్లను నెలకొల్పేవారు సచివాలయాల్లో లేదా వలంటీర్లను సంప్రదించాలి. ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో స్థానికంగా 30 శాతం వినియోగించగలిగితే రైతులకు భరోసా ఉంటుంది. వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల చేపలు ప్రస్తుతం లభించడం లేదు. ఈ హబ్‌ల వల్ల వినియోగదారుడికి కావాల్సిన రకం, ఇంటి ముంగిటకే తాజాగా రానుంది. – ఏవీ రాఘవ రెడ్డి , జేడీ మత్స్య శాఖ(ఎఫ్ఏసీ), గుంటూరు -
గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలి: సీఎం జగన్
-
గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగనన్న అమూల్ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని తెలిపారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని అన్నారు. అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. అమూల్ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. చదవండి: Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని తెలిపారు. వారికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. దానివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుందని, మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని అన్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం- కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. మత్స్యశాఖపై సమీక్ష.. ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాదు, స్థానిక వినియోగాన్ని పెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తీసుకు వస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇది జరక్కపోతే సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారని అన్నారు. ప్రాసెసింగ్ చేసేవాళ్లు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్లు సిండికేట్ అవుతున్నారని పలు దఫాలుగా రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని పేర్కొన్నారు. పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాదు, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని తెలిపారు. రైతులను ఆదిశగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్లో నాణ్యత కోసం, రైతుల్ని దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వారంగ సబ్సిడీలు– రైతులకు మేలు ఆక్వారంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతులకు నేరుగా అందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేయడానికి తగిన ఆలోచనలు చేయాలని అధికారులకు తెలిపారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్ కూడా పెట్టే ఆలోచన చేయాలని అన్నారు. ఫిష్ ఆంధ్రా లోగోను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఆక్వాహబ్‌లు, అనుబంధిత రిటైల్ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌లను, 14వేల రిటైల్ అవుట్లెట్లు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రి ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 10 ప్రాసెసింగ్‌ప్లాంట్లు, 23 ప్రి ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు చెక్ పెట్టగలుగుతామని, రైతులకు మంచి ధరలు వస్తాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పనులు మొదలయ్యాని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్–జులై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధం చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. మిగిలిన 5 ఫిషింగ్ హార్బర్ల పనులు ఈ డిసెంబర్లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్, అమూల్ ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
కాకినాడ మత్స్య ల్యాబ్‌కు ఎన్ఏబీఎల్ గుర్తింపు
సాక్షి, అమరావతి: కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ)లోని ఆక్వా ల్యాబొరేటరీకి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించింది. కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, చెన్నైలోని ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీలతో పాటు నాగపట్నంలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్‌కు మాత్రమే ఇప్పటివరకు ఎన్ఏబీఎల్ గుర్తింపు ఉంది. రాష్ట్ర స్థాయి ఆక్వా ల్యాబ్‌కు ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించడం దేశంలో ఇదే తొలిసారి. కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీలో 2001లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నీటి, మట్టి నాణ్యతల విశ్లేషణ, మైక్రో బయాలజీ, చేపలు, రొయ్యల మేతల నాణ్యత విశ్లేషణ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో 61 రకాల పరీక్షలు చేస్తుంటారు. ల్యాబ్‌లలో మౌలిక వసతులు, సాంకేతిక పరికరాలు, సిబ్బంది నైపుణ్యత, ప్రామాణిక పరీక్షా పద్ధతుల ఆధారంగా ఎన్ఏబీఎల్ గుర్తింపు కోసం ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేశారు. ఈ ల్యాబ్‌లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్ఏబీఎల్ గుర్తింపునిస్తున్నట్టు తన వెబ్సైట్లో ప్రకటించింది. గుర్తింపుతో ప్రయోజనాలు.. ఎన్ఏబీఎల్ గుర్తింపు వల్ల ఆక్వా రైతులకు, హేచరీలకు, మేత తయారీదారులకు మరింత నాణ్యమైన సేవలందించే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా మేతలు, చేప, రొయ్య పిల్లలను పరీక్షించి వాటికి ఎన్ఏబీఎల్ సర్టిఫికేషన్ ఆధారంగా నాణ్యతా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. -
ఏపీ : 4 బిల్లులకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన 4 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలిపిన బిల్లులతో ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్ఆర్బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ ఆమోదంతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. గవర్నర్ పేరిట రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. -
వరద కాలువలో చేపల పెంపకం!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలు సద్వినియోగ పరచటానికి నిర్మించిన వరద కాలువలో చేప పిల్లలను పెంచటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నీటితో నిండుకుండలా ఉండటంతో కాలువలో చేప పిల్లలను వదలడం వల్ల మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నాలుగు రోజుల క్రితం మోటర్ల వెట్‌రన్ ద్వారా భారీగా వరదల కాలువలో కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరాయి. దీంతో మత్స్యకారులు కాలువలో చేపల వేటను కొనసాగిస్తున్నారు. కాలువలో చేపల పెంపకం ద్వారా మరింత ఉపాధి లభిస్తుందని ఉన్నత అధికారులు ఆలోచిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువకు పునరుజ్జీవన పథకం ద్వారా ఏడాదంతా నిండుకుండలా ఉండే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ఇది వరకే చెరువుల్లో, రిజర్వాయర్లలో చేప పిల్లలను నూరు శాతం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. వరద కాలువలో కూడా ఏడాదంతా నీరు నిలిచే అవకాశం ఏర్పడటంతో వరద కాలువలో కూడ చేప పిల్లలను వదిలి చేపలను పెంచాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరద కాలువలో ఎన్ని కిలోమీటర్ల మేర ఎంత స్థాయిలో నీరు నిల్వ ఉంటుందో లెక్కలను వేస్తోంది. విస్తీర్ణం, నీటి నిల్వ ఆధారంగా కాలువలో చేప పిల్లలను వదిలి పెంచుతారు. దీంతో మత్స్యకారులు ఉపాధి లభిస్తుంది. హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు... కాలువలో చేప పిల్లలను వదిలి పెంచడం కోసం ప్రభుత్వం ప్రతిపాదలను సిద్ధం చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చేపలను వేటాడుతూ 5 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ప్రస్తుతం వరద కాలువలో కూడా చేప పిల్లలను వదలడంతో మరింత మందికి ఉపాధి లభిస్తుందని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరద కాలువలో చేప పిల్లలను వదలాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. వరద కాలువలో నీటి నిల్వ దృష్టిలో ఉంచుకుని చేప పిల్లలను వదలటానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. ఉన్నత అధికారులు చేప పిల్లలను వదలడం గురించి చర్చిస్తున్నారు. నివేదికలను సిద్ధం చేసి త్వరలోనే చేపపిల్లలను వదులుతాం. –రాజారాం, ఏడీ, మత్స్యశాఖ, నిజామాబాద్ -
పీతల పెంపకానికి డిమాండ్
నరసాపురం రూరల్: అంతర్జాతీయంగా పీతల పెంపకానికి మంచి డిమాండ్ ఉందని మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫణిప్రకాష్ అన్నారు. మండలంలోని తూర్పుతాళ్లు చామకూరిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద మంగళవారం రెండో అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే బంగ్లాదేశ్, ఇండియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో పీతల సాగు ప్రాచుర్యం పొందిందన్నారు. మండపీత (సిల్లా సెర్రేట్రా) పెరుగుదల రుచి, మార్కెట్ ధర అధికంగా ఉండడం వల్ల పెంపకానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా పీతల సాగుకు తీరప్రాంత గ్రామాలు అనుకూలమన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ శ్రమ లేకుండా లాభాలు ఆర్జించవచ్చని వివరించారు. రాష్ట్రంలో పీతల హేచరీని గుంటూరు జిల్లా సూర్యలంకలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నీటి నాణ్యత, పీతలు సాగు విధానాన్ని రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్మోహనరావు, ఎంపెడా ఏడీ పట్నాయక్ తదితరులు వివరించారు. జిల్లాలో 400 హెక్టార్లలో పీతలు, పండుగప్ప సాగవుతున్నట్టు చెప్పారు. సదస్సులో ఎంపీటీసీ పుచ్చకాయల తిరుపతమ్మ, మత్సశాఖ సహాయ సంచాలకులు ఎ.అప్పలరాజు, రమణకుమార్, అభివృద్ది అధికారులు ఎల్ఎన్ఎన్ రాజు, వి.సత్యనారాయణ, ఏడీ ఏడుకొండలు, ప్రతిభ, ఎంపీఈఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు.