సాక్షి, అమరావతి: బొమ్మిడాయల పులుసు, కొర్రమీను ఫ్రై, రావల ఇగురు, బొచ్చె, శీలావతి, రాగండి కూరలు.. ఈ పేర్లు చెబితేనే మాంసాహారులకు నోరూరుతుంది కదూ.. అవును ఈ చేపల్లో పోషక విలువలూ ఎక్కువే. అందుకే ప్రభుత్వం తాజా స్వచ్ఛమైన చేపలను ప్రజలకు అందించడంతోపాటు, ఆక్వా రైతులకు మార్కెటింగ్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ–వెహికల్, మినీఫిష్ రిటైల్ అవుట్‌లెట్ల స్థాపననూ ప్రోత్సహిస్తోంది.
ఉత్పత్తిలో ముందు.. వినియోగంలో వెనుక
రాష్ట్రంలో మాంసాహారులకు తాజా స్వచ్ఛమైన చేపలు దొరకడం గగనమే. పైపెచ్చు అన్ని రకాల చేపలూ అందుబాటులో ఉండవు. దీంతో పోషక విలువలు ఉన్న చేపలు తినాలనే ఆసక్తి ఉన్నా.. ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. మత్స్య సంపద ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో (దేశ వ్యాప్తంగా ఉత్పత్తిలో ఏపీ వాటా 75.84 శాతం) ఉంది. అదే సమయంలో వాటి వినియోగంలో మాత్రం బాగా వెనుకబడి ఉంది. 2020లో ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం ఏడాదికి సరాసరిన ఓ వ్యక్తి చత్తీస్‌ఘడ్, కేరళ రాష్ట్రాల్లో 19 కేజీలు, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 16 కేజీల చేపలను తింటున్నారని అంచనా. మన రాష్ట్రంలో మాత్రం ఇది కేవలం 8.07 కేజీలుగా ఉంది.
మార్కెట్ లేక రైతుల అవస్థలు
ప్రజలు చేపల వినియోగంలో వెనుకపడడంతో రైతులు తమ చెంతనే ఉన్న మార్కెట్‌ను కోల్పోతున్నారు. ఫలితంగా కేవలం ఎగుమతులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కోవిడ్ సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఆక్వా హబ్‌ల ఆలోచన చేసింది.
హబ్‌ల పనితీరు ఇలా..
ఫిష్ ఆంధ్రా పేరిట ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, వినుకొండ, పిడుగురాళ్లలో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తొలి విడతగా గుంటూరు, తెనాలిలో హబ్‌ల ఏర్పాటుకు లబ్ధిదారులు ముందుకొచ్చారు. వీటి ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నవంబర్ 21న అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ రెండు హబ్‌లను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఆక్వా హబ్‌ల పనితీరు
► ఆక్వా హబ్‌లను రైతులు సొసైటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు.
► చేపలు, ఆక్వా ఉత్పత్తులను సేకరించి ప్రాసెస్ చేస్తారు. అందుకోసం రూ.2 కోట్లతో శీతల గిడ్డంగిని సమకూర్చుకుంటారు.
► ఇందులో లైవ్ పూల్స్, ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులో ఉంటాయి.
► హబ్‌ల నుంచి మత్స్య సంపదను రిటైల్ వర్తకులకు సరఫరా చేస్తారు.
రిటైల్ యూనిట్లు ఇలా..
► గ్రామ/వార్డుస్థాయిలో ఈ–వెహికల్, మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లు ఏర్పాటు కానున్నాయి.
► హబ్‌ల ద్వారా సరుకు తీసుకుని ఆసక్తి ఉన్న వ్యాపారులు వాల్యూ యాడెడ్ యూనిట్లను నెలకొల్పుకోవచ్చు.
► రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు చేసుకోవచ్చు.
► ఈ యూనిట్లలో స్నాక్స్, ఆహార ఉత్పత్తులూ
అందుబాటులో ఉంచొచ్చు.
► మత్స్య ఉత్పత్తుల విక్రయానికి కియోస్క్
యూనిట్లనూ ఏర్పాటు చేయనున్నారు.
►మొబైల్ ఫిష్ వెండింగ్, ఫుడ్ కోర్టులూ అందుబాటులోకి రానున్నాయి.
ప్రభుత్వ రాయితీ
మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ మినహా అన్ని రకాల యూనిట్లకు ప్రభుత్వం రాయితీ అందించనుంది. బీసీ, జనరల్‌కు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 60 శాతం పెట్టుబడిని రాయితీగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడు తన వాటాగా సమకూర్చుకోవాలి. ఇందుకు బ్యాంకు ద్వారా రుణం సమకూర్చే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. హబ్‌లు, రిటైల్ దుకాణాల ఏర్పాటులో తొలి ప్రాధాన్యం చేపల వేట, మత్స్య వ్యాపారం చేస్తున్న కుటుంబాలకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.
ఔత్సాహికులు సచివాలయాల్లో సంప్రదించాలి
ఆక్వా హబ్‌ల వల్ల గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మత్స్య యూనిట్లను నెలకొల్పేవారు సచివాలయాల్లో లేదా వలంటీర్లను సంప్రదించాలి. ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో స్థానికంగా 30 శాతం వినియోగించగలిగితే రైతులకు భరోసా ఉంటుంది. వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల చేపలు ప్రస్తుతం లభించడం లేదు. ఈ హబ్‌ల వల్ల వినియోగదారుడికి కావాల్సిన రకం, ఇంటి ముంగిటకే తాజాగా రానుంది. – ఏవీ రాఘవ రెడ్డి , జేడీ మత్స్య శాఖ(ఎఫ్‌ఏసీ), గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment