బాహుబలిని చంపడానికి కారణాలు ఇవేనా?
టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ రెండేళ్ల క్రితం మొదలైంది. బహుబలి మొదటి పార్ట్ స్క్రీన్స్‌పైకి వచ్చిన నాటి నుంచి అభిమానుల మదిని తొలుస్తున్న ఒకే ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?. శుక్రవారం బహుబలి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి సినిమాను క్షుణ్ణంగా పరిశీలిస్తే బహుబలిని కట్టప్ప చంపడానికి ఐదు కారణాలు ఉండొచ్చు. అయితే, అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మాత్రం మూవీ విడుదలయ్యే దాకా అంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.
పొరబాటున:
కట్టప్ప బాహుబలిని వెనుక నుంచి పొడిచి చంపినట్లు బహుబలి 2 ట్రైలర్లో ఉంది. వేరొకరిని చంపుతున్నానని భావించిన కట్టప్ప బాహుబలిని పొడిచేసి ఉండొచ్చు.
భల్లాలదేవ బెదిరిస్తే..
కట్టప్ప బాహుబలి, భల్లాలదేవులకు శిక్షకుడు. చిన్ననాటి నుంచి బాహుబలిపై పగ పెంచుకున్న భల్లాలదేవుడు బాహును చంపాలని కట్టప్పను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.
భల్లాలదేవుడి ఆజ్ఞ కారణంగా..
బాహుబలి మొదటిపార్ట్‌లో తన ప్రాణాలను కాపాడినందుకు ఏదైనా కోరుకోమని కట్టప్పను భల్లాలదేవ అడుగుతాడు. అప్పుడు కట్టప్ప దేవసేనను విడిపించాలని కోరుతాడు. అందుకు స్పందించిన భల్లాలుడు ఆమెను కత్తితో తెగ నరికి విడిపించుకోమంటాడు. అచ్చూ అలానే పరిస్ధితి ఎదురై బాహుబలిని చంపాలని భల్లాలుడు కట్టప్పను ఆజ్ఞాపించి ఉండొచ్చు.
భల్లాలదేవుడు రాజు కావడం వల్ల..
కాలకేయుల మీద యుద్ధం ముగిసిన తర్వాత బాహుబలి మాహిష్మతికి రాజుగా పట్టాభిషేకం తీసుకుంటాడని శివగామి ప్రకటిస్తుంది. బాహుబలి పార్ట్ 2 ట్రైలర్లో బాహుబలి రాజుగా పట్టాభిషేకం పొందుతూ ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే, దేవసేనను కాపాడాలని గిరిజన బృందం మనకు బాహుబలి పార్ట్ 1లో కనిపిస్తుంది. దేవసేనను చూసిన బాహుబలి ఆమెను పెళ్లాడటానికి రాజు కిరీటాన్ని వదులుకోవడానికి సిద్ధపడితే.. భల్లాలుడు రాజుగా పట్టాభిషేకం పొందే అవకాశం కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత మాహిష్మతి రాజ్య సింహాసనానికి కట్టు బానిసైన కట్టప్పను బాహుబలిని చంపాలని భల్లాలుడు ఆదేశించి ఉండొచ్చు.
కట్టప్ప బిజ్జలదేవుడి బానిస కావడం వల్ల..
బాహుబలి టీం ది రైజ్ ఆఫ్ శివగామి పుస్తకాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పుస్తకంలో కట్టప్ప బానిసల కుటుంబంలో జన్మించాడని ఉంది. కట్టప్ప తండ్రి సోమదేవ బిజ్జలదేవుడి తండ్రి మలయప్పకు బానిస అని కూడా అందులో ఉంది. బిజ్జలదేవుడిని రక్షించడానికి కట్టప్ప సొంత సోదరుడిని చంపుతాడని పుస్తకంలో ఉంది. బిజ్జలదేవుడు బాహుబలిని చంపాలని కట్టప్పను ఆదేశించే అవకాశం కూడా ఉంది.