Flight Hijack
-
ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారత విమానంలో పది మంది ఒంటరి మైనర్లు
ప్యారిస్: ఫ్రాన్స్ నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఇందులో ఆశ్రయం కోరుతూ ఆరుగురు మైనర్లు ధరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే.. ప్రయాణికుల నిర్బంధాన్ని మరో ఎనిమిది రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ కేసుపై నేడు విచారణ కొనసాగనుంది. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఫ్రాన్స్‌లో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానం నిలిపివేతపై స్పందించిన ఫ్రాన్స్ లోని భారత్ ఎంబసీ.. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సిస్ లభించిందని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 రొమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న A340 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరింది. 303 మంది భారతీయులతో ఉన్న ఈ విమానం నికరాగ్వాకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని వాట్రి విమానాశ్రయానికి చేరుకోగానే ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం వచ్చిన కారణంతో విమానాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. "ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతిక నిలిపివేత సమయంలో దుబాయ్ నుండి నికరాగ్వాకు బయలుదేరిన విమానాన్ని నిలిపివేశారు. ఇందులో దాదాపు 303 మంది భారతీయ మూలాలు కలిగినవారే ఉన్నారు. విమానం నిలిపివేత గురించి ఫ్రెంచ్ అధికారులు మాకు సమాచారం అందించారు. పరిస్థితిని పరిశీస్తున్నాం" అని భారత ఎంబసీ అధికారులు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక వసతి గృహాలకు తరలించారు. ఒక్కొక్కరిని అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల నుంచే నిజానిజాలను కనుక్కునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదీ చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
ఒకే ఒక్కడు.. ఫ్లైట్ హైజాకింగ్.. అమెరికాకు ముచ్చెమటలు పట్టించాడు!
కొన్నిసార్లు నేరస్థుడే కథానాయకుడు. దోపిడీలు, హత్యలు చేసినా సరే.. అతడే గెలవాలని, పోలీసులకు దొరక్కూడదని కోరుకునే ప్రేక్షక హృదయాలు కోకొల్లలు. దృశ్యం, కిక్ , ధూమ్ 2, సూపర్.. వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. విశేషవిజయాలు అందుకున్నవే. ఈ తరహా సినిమాలెన్నింటికో స్ఫూర్తిగా నిలిచిన క్రిమినల్ ‘డేనియల్ కూపర్’ కథే ఈ వారం మిస్టరీ. ఎందరో నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టించిన అమెరికన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సర్వీస్..‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ)’ని సైతం గడగడలాడించిన అతగాడు.. అసలు ఏం నేరం చేశాడు? ఎలా తప్పించుకున్నాడు? సినిమాని తలపించే ఆ కథే ఈ నార్త్‌వెస్ట్ హైజాకింగ్. అది 1971, నవంబర్ 24. అమెరికాలోని ఒరెగాన్‌లో పోర్ట్లాండ్ ఎయిర్ పోర్ట్‌లోకి ఎంటర్ అయ్యాడు అతను. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు నలభై పైనే. వైట్ షర్ట్, బ్లాక్ టై, ఓవర్ కోట్, గోధుమ రంగు షూస్, చేతిలో ఓ సూట్ కేస్.. చూడటానికి అచ్చం ఓ బిజినెస్మేగ్నెట్లానే ఉన్నాడు. ఇరవై డాలర్లు పెట్టి.. వాషింగ్టన్‌లోని సియాటెల్ వెళ్లేందుకు నార్త్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో ఓ టికెట్ కొనుక్కున్నాడు. పేరు డేనియల్ కూపర్ అని నమోదు చేయించుకున్నాడు. అప్పటిదాకా ఆ విమానంలో 305 మంది ప్రయాణికుల్లో అతడూ ఒకడు. తనకు కేటాయించిన సీట్లో తాపీగా కూర్చుని.. విమానం ఇంకా బయలుదేరకముందే.. ఫ్లైట్ అటెండెంట్‌ని పిలిచి... తనకు ఓ బోర్బన్ బిస్కట్, సోడా కావాలన్నాడు. కొన్ని నిమిషాల్లోనే విమానం స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్ అటెండెంట్ అతడు కోరినట్లే.. రెండూ తెచ్చి ఇచ్చింది. వాటిని అందుకున్న కూపర్ ఆమె చేతిలో ఒక స్లిప్ పెట్టాడు. అప్పటికే ఫ్లైట్ గాల్లో ఉంది. ఆ స్లిప్ ఓపెన్ చేసి చదివిన ఆమెకు కాళ్ల కింద విమానం షేక్ అయినట్లు షాక్ అయ్యింది. పక్కనే కూర్చోమన్నట్లు ఆమెకు సైగ చేశాడు కూపర్. తప్పనిస్థితిలో గమ్మున కూర్చుంది. ఆ స్లిప్‌లో ఉన్న మ్యాటర్‌ను నమ్మేందుకు.. ఆమె ముందే సూట్‌కేస్ ఓపెన్ చేసి చూపించాడు కూపర్. అందులో రెండు ఎరుపు రంగు కడ్డీలు.. రకరకాల వైర్లుతో చుట్టి ఉన్నాయి. అవి బాంబులే అని నిర్ధారించుకున్న ఆమె.. మరింత వణికిపోయింది. ‘స్లిప్ తీసుకుని, నేను చెప్పింది రాసుకో’ అని ఆదేశించాడు. ఆమె చేతిలో పెన్ వణుకుతూ కదులుతోంది. ‘నాకు అయిదు గంటల్లోపు రెండు లక్షల డాలర్లు (ప్రస్తుతం దీని విలువ 1.2 మిలియన్లు) కావాలి. ఆ మొత్తం 20 డాలర్ల నోట్ల రూపంలోనే ఉండాలి. అలాగే నాకు రెండు బ్యాక్ పారాష్యూట్లు, రెండు ఫ్రంట్ పారాష్యూట్లు కావాలి. విమానం ల్యాండ్ అవ్వగానే... వెంటనే ఇంధనం నింపేందుకు ఎయిర్‌పోర్టులో ఫ్యూయెల్ ట్యాంకర్ రెడీగా ఉండాలి. తేడా వస్తే... బాంబు పేలుతుంది’ అని కూపర్ చెప్పినట్లే అక్షరం పొల్లుపోకుండా రాసింది ఆ అటెండెంట్. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని.. కూపర్ అడిగినట్లే సియాటెల్ ఏరియా బ్యాంకుల నుంచి డబ్బును, స్థానిక స్కైడైవింగ్ స్కూల్ నుంచి పారాష్యూట్లను రప్పించారు. విమానం సియాటెల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. అడిగినవన్నీ చేతికి అందిన తర్వాత.. కొందరు ప్రయాణికుల్ని, కొంతమంది సిబ్బందినీ విమానం దిగేందుకు ఒప్పుకున్నాడు కూపర్. ఆ ఒప్పందం ప్రకారం 36 మందిని క్షేమంగా విమానం నుంచి దింపేశారు. అనంతరం విమానంలో ఇంధనం నింపాలని ఆదేశించాడు. కూపర్ చెప్పినట్లే చేశారు అధికారులు. మిగిలినవారంతా విమానంలో ఉండగానే.. మళ్లీ విమానం పైకి లేచింది. మెక్సికో సిటీ మీదుగా పదివేల అడుగుల ఎత్తులో విమానాన్ని నడపమన్నాడు. కూపర్‌కి ఎదురుచెప్పలేదు పైలెట్స్. రాత్రి ఎనిమిది దాటింది. ఫ్లైట్ గాల్లో ఎగురుతూనే ఉంది. కూపర్ అధీనంలోనే ఉంది. సియాటెల్, రెనో మధ్యలో ఓ చోట.. విమాన వెనుక డోర్ ఓపెన్ చేయించి, పారాష్యూట్ సాయంతో కిందకు దూకేశాడు. తనతో పాటూ డబ్బు, మిగిలిన పారాష్యూట్లనూ తీసుకెళ్లాడు. ఇక అంతే.. 50 ఏళ్లుగా అతడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియలేదు. చివరికి అతడి పేరు కూడా అబద్ధం అని తేలింది. కూపర్ విమానంలో ఉన్నంత సేపు డార్క్ సన్ గ్లాసెస్ పెట్టుకునే ఉన్నాడనేది ప్రత్యక్ష సాక్షుల సమాచారం. ఎఫ్‌బీఐ చరిత్రలోనే సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ ఈ నార్త్‌వెస్ట్ హైజాకింగ్. మొదట్లో కూపర్‌ను మిలిటరీలో అనుభవజ్ఞుడైన పారాట్రూపర్‌గా భావించారు. నిజానికి అనుభవజ్ఞుడైన స్కైడైవర్ కాదని తేల్చారు. ఘటన జరిగిన ఐదేళ్లలో దాదాపు 800 మంది అనుమానితులను పరిశీలించి, వారిలో కూపర్ లేడని నిర్ధారించేశారు. నిందితుడిగా రిచర్డ్ ఫ్లాయిడ్ మెకాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడూ కూపర్‌కు సరిపోలలేదు. చివరికి కూపర్ చనిపోయి ఉంటాడనే అనుకున్నారు. ఎందుకంటే కూపర్ దూకాడు అని ఊహిస్తున్న ప్రాంతంలో గంటకు 200 మైళ్లు(322 కిమీ)వేగంతో గాలులు వీస్తాయని, ఆ ప్రతికూల పరిస్థితుల్లో పారాష్యూట్తో దిగడం కష్టమని అంచనా వేశారు. 1980లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కొలంబియా నది సమీపంలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన ఏరియల్ నుంచి 20 మైళ్ల (32 కిమీ) దూరంలో ఓ బాలుడికి.. 5,800 డాలర్లున్న శిథిలావస్థలోని ప్యాకెట్ ఒకటి దొరికింది. దాంట్లో అన్నీ 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. కూపర్ డిమాండ్ చేసి తీసుకున్న 20 డాలర్ల నోట్ల మీదున్న సీరియల్ నంబర్లకు శిథిలావస్థలోని ప్యాకెట్లో దొరికిన 20 డాలర్ల నోట్ల మీది సీరియల్ నంబర్లు సరిపోలాయి. విస్తృతశోధన తర్వాత తేలిన విషయం అదొక్కటే. దాంతో 2016లో అధికారికంగా ఈ కేసుని క్లోజ్ చేసింది ఏజెన్సీ. అపరిష్కృతమైన ఈ క్రైమ్ స్టోరీ చాలా మందిని ఆకర్షించింది. చివరికి ఈ కేసులో కీలక సూత్రధారి అయిన డేనియల్ కూపర్.. పేరు మీద పాటలు, పుస్తకాలు, సినిమాలు వగైరా వగైరా చాలానే వచ్చాయి. చివరికి కూపర్ ‘జానపద కథానాయకుడు’గా మారిపోయాడు. అయితే డాన్ కూపర్‌గా గుర్తింపు పొందిన డేనియల్ కూపర్.. ఇన్వెస్టిగేషన్ సమయంలో ఓ రిపోర్టర్ పొరబాటుగా విన్న పేరునే శాశ్వతం చేసుకున్నాడు డి.బి.కూపర్‌గా. చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్ భయ్యా ఎక్కడున్నావు!? -
మసూద్‌ను విడుదల చేసిందెవరు?
న్యూఢిల్లీ: ఉగ్రదాడికి బాధ్యత వహిస్తున్న మసూద్ అజార్‌ను విడుదల చేసిందెవరో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. ప్రస్తుతమున్న జాతీయ భద్రతా సలహాదారే కాందహార్‌కు వెళ్లి అజార్‌ను పాకిస్తాన్‌కు అప్పగించినట్లు రాహుల్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కాందహార్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసీ–814ను ఉగ్రవాదులు హైజాక్ చేసి అందులో ప్రయాణిస్తున్న 150 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వీరిని విడిపించడానికి బదులుగా అప్పటి భారత ప్రభుత్వం 1999, డిసెంబర్లో అజార్‌తో పాటు మరి కొంతమంది ఉగ్రవాదులను విడుదల చేసింది. ‘మోదీ జీ మసూద్‌ను విడుదల చేసిందెవరో 40 మంది జవాన్ల కుటుంబాలకు చెప్పండి. అలాగే కాందహార్ వెళ్లి అజా ర్ను పాకిస్తాన్‌కు అప్పగించింది కూడా జాతీ య భద్రతా సలహాదారేనని చెప్పండి’అని రాహుల్ ట్వీట్ చేశారు. -
ఆ రాక్షసుల ఫోటోలను విడుదల చేశారు
వాషింగ్టన్ : పాన్ అమెరికా ఎయిర్వేస్ విమాన హైజాక్, మారణ హోమానికి సంబంధించి ఉగ్రవాదుల ఫోటోలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మరోసారి విడుదల చేసింది. 1986, సెప్టెంబర్ 5న ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరిన పాన్ యామ్ ఫ్లైట్ 73 విమానాన్ని కరాచీలో హైజాక్ చేసిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే... ఈ విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న నీర్జా భానోత్ టెర్రరిస్టుల బారి నుంచి 359 మందిని తన వంతు ప్రయత్నం చేశారు. ప్రయాణికులు సురక్షితంకోసం ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ, ఈ క్రమంలో నీర్జాతోపాటు 20 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. హైజాకర్లు మహ్మద్ హఫీజ్ అల్ టర్కీ, జమల్ సయ్యిద్ అబ్దుల్ రహిమ్, మహ్మద్ అబ్దుల్లా ఖలీల్ హుస్సేన్, మహ్మద్ అహ్మద్ అల్ మున్వర్ ప్రధాన నిందితులు. 2000 సంవత్సరంలో తొలిసారి వీరి ఫోటోలను విడుదల చేయగా.. ఇప్పుడు ఏజ్-ప్రోగ్రెసన్ టెక్నాలజీ ద్వారా వారు ఇప్పుడు ఎలా ఉంటారన్నది అంచనా వేస్తూ వారి ఫోటోలు రిలీజ్ చేశారు. వీళ్లల్లో ప్రతీ ఒక్కరిపై 5 మిలియన్ల అమెరికన్ డాలర్ల నజరానా ఉంది. వీరంతా అబు నిదల్ ఆర్గనైజేషన్ సంస్థకు చెందిన వారని.. ప్రస్తుతం వీరంతా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారని ఎఫ్‌బీఐ ప్రకటించింది. -
తొలి వారం నీర్జా రికార్డ్
స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ సాధించటంలో మాత్రం వెనకబడిన అందాల భామ సోనమ్ కపూర్. సినిమాల సంగతి ఎలా ఉన్నా తన గ్లామర్ షో తో మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తొలిసారిగా నీర్జా సినిమాతో తన కల నెరవేర్చుకుంది. 1986లో జరిగిన విమానం హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన బయోగ్రఫికల్ థ్రిల్లర్ నీర్జాలోఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ పాత్రలో నటించింది సోనమ్. ఈ సినిమాతో మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న సోనమ్.. ఇన్నాళ్లు తనను ఊరిస్తున్న భారీ కమర్షియల్ హిట్‌ను కూడా సాధించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా వసూలు చేసింది. తొలివారం పూర్తయ్యే సరికి 35 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న నీర్జా లాంగ్ రన్లో 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.