50 years later, the mystery of DB Cooper still intrigues - Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు.. ఫ్లైట్‌ హైజాకింగ్‌.. అమెరికాకు ముచ్చెమటలు పట్టించాడు!

Published Sun, Dec 19 2021 10:38 AM | Last Updated on Sun, Dec 19 2021 12:10 PM

50 years later, the mystery of DB Cooper still intrigues - Sakshi

కొన్నిసార్లు నేరస్థుడే కథానాయకుడు. దోపిడీలు, హత్యలు చేసినా సరే.. అతడే గెలవాలని, పోలీసులకు దొరక్కూడదని కోరుకునే ప్రేక్షక హృదయాలు కోకొల్లలు. దృశ్యం, కిక్‌ , ధూమ్‌ 2, సూపర్‌.. వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. విశేషవిజయాలు అందుకున్నవే. ఈ తరహా సినిమాలెన్నింటికో స్ఫూర్తిగా నిలిచిన క్రిమినల్‌ ‘డేనియల్‌ కూపర్‌’ కథే ఈ వారం మిస్టరీ. ఎందరో నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టించిన అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ సర్వీస్‌..‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌  (ఎఫ్‌.బి.ఐ)’ని సైతం గడగడలాడించిన అతగాడు.. అసలు ఏం నేరం చేశాడు? ఎలా తప్పించుకున్నాడు? సినిమాని తలపించే ఆ కథే ఈ నార్త్‌వెస్ట్‌ హైజాకింగ్‌.

అది 1971, నవంబర్‌ 24. అమెరికాలోని ఒరెగాన్‌లో పోర్ట్‌లాండ్‌ ఎయిర్‌ పోర్ట్‌లోకి ఎంటర్‌ అయ్యాడు అతను. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు నలభై పైనే. వైట్‌ షర్ట్, బ్లాక్‌ టై, ఓవర్‌ కోట్, గోధుమ రంగు షూస్, చేతిలో ఓ సూట్‌ కేస్‌.. చూడటానికి అచ్చం ఓ బిజినెస్‌మేగ్నెట్‌లానే ఉన్నాడు. ఇరవై డాలర్లు పెట్టి.. వాషింగ్టన్‌లోని సియాటెల్‌ వెళ్లేందుకు నార్త్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో ఓ టికెట్‌ కొనుక్కున్నాడు. పేరు డేనియల్‌ కూపర్‌ అని నమోదు చేయించుకున్నాడు. అప్పటిదాకా ఆ విమానంలో 305 మంది ప్రయాణికుల్లో అతడూ ఒకడు. తనకు కేటాయించిన సీట్‌లో తాపీగా కూర్చుని.. విమానం ఇంకా బయలుదేరకముందే.. ఫ్లైట్‌ అటెండెంట్‌ని పిలిచి... తనకు ఓ బోర్బన్‌ బిస్కట్, సోడా కావాలన్నాడు. కొన్ని నిమిషాల్లోనే విమానం స్టార్ట్‌ అయ్యింది.

ఫ్లైట్‌ అటెండెంట్‌ అతడు కోరినట్లే.. రెండూ తెచ్చి ఇచ్చింది. వాటిని అందుకున్న కూపర్‌ ఆమె చేతిలో ఒక స్లిప్‌ పెట్టాడు. అప్పటికే ఫ్లైట్‌ గాల్లో ఉంది. ఆ స్లిప్‌ ఓపెన్‌ చేసి చదివిన ఆమెకు కాళ్ల కింద విమానం షేక్‌ అయినట్లు షాక్‌ అయ్యింది. పక్కనే కూర్చోమన్నట్లు ఆమెకు సైగ చేశాడు కూపర్‌. తప్పనిస్థితిలో గమ్మున కూర్చుంది. ఆ స్లిప్‌లో ఉన్న మ్యాటర్‌ను నమ్మేందుకు.. ఆమె ముందే సూట్‌కేస్‌ ఓపెన్‌ చేసి చూపించాడు కూపర్‌. అందులో రెండు ఎరుపు రంగు కడ్డీలు.. రకరకాల వైర్లుతో చుట్టి ఉన్నాయి. అవి బాంబులే అని నిర్ధారించుకున్న ఆమె.. మరింత వణికిపోయింది.

‘స్లిప్‌ తీసుకుని, నేను చెప్పింది రాసుకో’ అని ఆదేశించాడు. ఆమె చేతిలో పెన్‌ వణుకుతూ కదులుతోంది. ‘నాకు అయిదు గంటల్లోపు రెండు లక్షల డాలర్లు (ప్రస్తుతం దీని విలువ 1.2 మిలియన్లు) కావాలి. ఆ మొత్తం 20 డాలర్ల నోట్ల రూపంలోనే ఉండాలి. అలాగే నాకు రెండు బ్యాక్‌ పారాష్యూట్‌లు, రెండు ఫ్రంట్‌ పారాష్యూట్‌లు కావాలి. విమానం ల్యాండ్‌ అవ్వగానే... వెంటనే ఇంధనం నింపేందుకు ఎయిర్‌పోర్టులో ఫ్యూయెల్‌ ట్యాంకర్‌ రెడీగా ఉండాలి. తేడా వస్తే... బాంబు పేలుతుంది’ అని కూపర్‌ చెప్పినట్లే అక్షరం పొల్లుపోకుండా రాసింది ఆ అటెండెంట్‌. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని.. కూపర్‌ అడిగినట్లే  సియాటెల్‌ ఏరియా బ్యాంకుల నుంచి డబ్బును, స్థానిక స్కైడైవింగ్‌ స్కూల్‌ నుంచి పారాష్యూట్‌లను రప్పించారు. 

విమానం సియాటెల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. అడిగినవన్నీ చేతికి అందిన తర్వాత.. కొందరు ప్రయాణికుల్ని, కొంతమంది సిబ్బందినీ విమానం దిగేందుకు ఒప్పుకున్నాడు కూపర్‌. ఆ ఒప్పందం ప్రకారం 36 మందిని క్షేమంగా విమానం నుంచి దింపేశారు. అనంతరం విమానంలో ఇంధనం నింపాలని ఆదేశించాడు. కూపర్‌ చెప్పినట్లే చేశారు అధికారులు. మిగిలినవారంతా విమానంలో ఉండగానే.. మళ్లీ విమానం పైకి లేచింది. మెక్సికో సిటీ మీదుగా పదివేల అడుగుల ఎత్తులో విమానాన్ని నడపమన్నాడు. కూపర్‌కి ఎదురుచెప్పలేదు పైలెట్స్‌. రాత్రి ఎనిమిది దాటింది. ఫ్లైట్‌ గాల్లో ఎగురుతూనే ఉంది. కూపర్‌ అధీనంలోనే ఉంది. సియాటెల్, రెనో మధ్యలో ఓ చోట.. విమాన వెనుక డోర్‌ ఓపెన్‌ చేయించి, పారాష్యూట్‌ సాయంతో కిందకు దూకేశాడు. తనతో పాటూ డబ్బు, మిగిలిన పారాష్యూట్‌లనూ తీసుకెళ్లాడు. ఇక అంతే.. 50 ఏళ్లుగా అతడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియలేదు. చివరికి అతడి పేరు కూడా అబద్ధం అని తేలింది. కూపర్‌ విమానంలో ఉన్నంత సేపు డార్క్‌ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకునే ఉన్నాడనేది ప్రత్యక్ష సాక్షుల సమాచారం. 

ఎఫ్‌బీఐ చరిత్రలోనే సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్‌ ఈ నార్త్‌వెస్ట్‌ హైజాకింగ్‌. మొదట్లో కూపర్‌ను మిలిటరీలో అనుభవజ్ఞుడైన పారాట్రూపర్‌గా భావించారు. నిజానికి అనుభవజ్ఞుడైన స్కైడైవర్‌ కాదని తేల్చారు. ఘటన జరిగిన ఐదేళ్లలో దాదాపు 800 మంది అనుమానితులను పరిశీలించి, వారిలో కూపర్‌ లేడని నిర్ధారించేశారు. నిందితుడిగా రిచర్డ్‌ ఫ్లాయిడ్‌ మెకాయ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడూ కూపర్‌కు సరిపోలలేదు. చివరికి కూపర్‌ చనిపోయి ఉంటాడనే అనుకున్నారు. ఎందుకంటే కూపర్‌ దూకాడు అని ఊహిస్తున్న ప్రాంతంలో గంటకు 200 మైళ్లు(322 కిమీ)వేగంతో గాలులు వీస్తాయని, ఆ ప్రతికూల పరిస్థితుల్లో పారాష్యూట్‌తో దిగడం కష్టమని అంచనా వేశారు. 1980లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కొలంబియా నది సమీపంలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన ఏరియల్‌ నుంచి 20 మైళ్ల (32 కిమీ) దూరంలో ఓ బాలుడికి.. 5,800 డాలర్లున్న శిథిలావస్థలోని ప్యాకెట్‌ ఒకటి దొరికింది.

దాంట్లో అన్నీ 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. కూపర్‌ డిమాండ్‌ చేసి తీసుకున్న 20 డాలర్ల నోట్ల మీదున్న సీరియల్‌ నంబర్లకు శిథిలావస్థలోని ప్యాకెట్‌లో దొరికిన 20 డాలర్ల నోట్ల మీది సీరియల్‌ నంబర్లు సరిపోలాయి. విస్తృతశోధన తర్వాత తేలిన విషయం అదొక్కటే. దాంతో 2016లో అధికారికంగా ఈ కేసుని క్లోజ్‌ చేసింది ఏజెన్సీ. అపరిష్కృతమైన ఈ క్రైమ్‌ స్టోరీ చాలా మందిని ఆకర్షించింది. చివరికి ఈ కేసులో కీలక సూత్రధారి అయిన డేనియల్‌ కూపర్‌.. పేరు మీద పాటలు, పుస్తకాలు, సినిమాలు వగైరా వగైరా  చాలానే వచ్చాయి. చివరికి కూపర్‌ ‘జానపద కథానాయకుడు’గా మారిపోయాడు. అయితే డాన్‌ కూపర్‌గా గుర్తింపు పొందిన డేనియల్‌ కూపర్‌.. ఇన్వెస్టిగేషన్‌ సమయంలో ఓ రిపోర్టర్‌ పొరబాటుగా విన్న పేరునే శాశ్వతం చేసుకున్నాడు డి.బి.కూపర్‌గా.

చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్‌ భయ్యా ఎక్కడున్నావు!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement