వీడియోలోని దృశ్యాల ఆధారంగా... నల్ల టీషర్ట్‌లో ఫెలిక్స్
వాషింగ్టన్: బీర్ కోసం విమానంలో రచ్చ చేసిన తాగుబోతు.. దెబ్బలు తినటమే కాకుండా జైలు పాలయ్యాడు. అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా, అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... వర్జిన్ ఐలాండ్స్ నుంచి మియామి వెళ్తున్న విమానంలో జాసన్ ఫెలిక్స్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు.
అప్పటికే పీకలదాకా తాగిన ఫెలిక్స్ ఇంకా బీర్ కావాలంటూ ఫ్లైట్ సిబ్బందిని కోరాడు. అయితే వారు నిరాకరించారు. ‘నేను అసలు ఫ్లైట్ ఎక్కిందే మందు కోసం. మీరు బార్‌టెండర్‌లు. నాకు బీర్ కావాల్సిందే’ అని అతను అనటం, అవును మేం బార్‌టెండర్‌లమే కానీ, మీకు ఇంకా అదనంగా బీర్ ఇవ్వలేం’ అంటూ సిబ్బంది చెప్పటం వీడియోలో ఉంది. వాగ్వాదం ముదురుతున్న క్రమంలో వెనకాలే నిల్చున్న ఓ వ్యక్తి ఫెలిక్స్‌కు నచ్చజెప్పే యత్నం చేశాడు. చివరకు ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరి ఘర్షణకు దారితీసింది. గొడవలో ఫెలిక్స్ మూతి పగిలి రక్తం కారింది. చివరకు తోటి ప్రయాణికులు వారిద్దరినీ నిలువరించారు.
మియామీ చేరుకున్న తర్వాత ఫెలిక్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విమాన సిబ్బందితో గొడవకు దిగాడంటూ అతనిపై ఆరోపణలు నమోదు చేశారు. ఫెలిక్స్‌ను చితక్కొట్టింది ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ పోలీసాఫీసర్ అని తేలింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. నేరం రుజువైతే కోర్టు ఫెలిక్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 2,50,000 డాలర్ల జరిమానాను విధించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment