నా గొంతు కోస్తానన్నాడు!
ఫ్లింటాఫ్‌తో 2007 సంవాదంపై యువరాజ్
ముంబై: దాదాపు తొమ్మిదేళ్ల క్రితం టి20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన విషయం అందరి మనసుల్లో నిలిచిపోయింది. దానికి ముందు మరో ఇంగ్లండ్ ఆటగాడు ఫ్లింటాఫ్‌తో గొడవ జరిగిన తర్వాతే తనలో ఆవేశం పెరిగిందని కూడా యువీ ఎన్నో సార్లు అన్నాడు. అయితే వారిద్దరి మధ్య సరిగ్గా ఏం సంభాషణ జరిగిందనేది ఇప్పటి వరకు బయటికి తెలీదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా యువీ ఆ విషయం వెల్లడించాడు.
‘బ్రాడ్ ఓవర్‌కు ముందు ఫ్లింటాఫ్ వేసిన 18వ ఓవర్లో నేను వరుసగా రెండు ఫోర్లు బాదాను. ఆ ఓవర్ తర్వాత బూతులతో ఫ్లింటాఫ్ తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే నేను కూడా అదే తరహాలో బదులిచ్చాను. దాంతో మరింత కోపంతో ఫ్లింటాఫ్ నా గొంతు కోస్తానన్నాడు. నేను కూడా నా బ్యాట్ చూపిస్తూ దీంతో ఎక్కడ కొడతానో తెలుసా అంటూ గట్టిగా బదులిచ్చాను’ అని యువరాజ్ 2007నాటి డర్బన్ మ్యాచ్ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తనలో కోపం అమాంతం పెరిగిపోయిందని, ప్రతీ బంతినీ మైదానం బయట కొట్టాలనే కసితో బ్యాటింగ్ చేయడం వల్లే ఆరు సిక్సర్లు వచ్చాయని యువరాజ్ చెప్పుకొచ్చాడు.