flow of ground water
-
మరోసారి కుంగిన భూమి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. వరుసగా భూమి కుంగుతుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆదివారం మరోసారి భూమి భారీగా కుంగింది. చింతకొమ్మదిన్నె మండలం పెద్దముసలిరెడ్డిపల్లిలోని ఓ పసుపుతోటలో 20 అడుగుల వెడల్పు, 45 అడుగుల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. జిల్లాలో వరుసగా పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో గ్రామస్తులతో పాటు ప్రజలు భయందళోనలు గురవుతున్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో గత పదిహేను రోజుల్లో రెండు సార్లు భూమి కుంగడం జరిగింది. -
నాలుగు చోట్ల కుంగిన భూమి
వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. మొన్నటి దాకా.. భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేయగా.. తాజాగా.. భూమి అకస్మాత్తుగా కుంగుతుండటం.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మండలం లోని బుగ్గలేటిపల్లి, బుగ్గలపల్లి గ్రామాల్లో ఆదివారం నాలుగు చోట్ల భూమి కుంగింది. 15 అడుగుల వెడల్పు, 7 అడుగుల లోతుతో భూమి లోపలికి వెళ్లి పోయింది. దీంతో జనం భయంతో పరుగు తీశారు. పొరుగు గ్రామాల ప్రజలు సైతం ఎక్కడ తమ ఇళ్లు కూలిపోతాయో అని భయపడుతున్నారు. కాగా.. భారీ వర్షాల కారణంగా భూగర్భంలో నీటి ప్రవాహ ఉదృతి కారణంగానే భూమి కుంగి పోతోందని భూగర్భ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా.. చింత కొమ్మ దిన్నె మండలంలోని పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. శాస్త్ర వేత్తలు సూచించారు. -
మరో చోట కుంగిన భూమి
చింతకొమ్మదిన్నె: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చింతకొమ్మ దిన్నె మండలం నాయనోవారిపల్లె, ముసల్ రెడ్డిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంతాల్లో భారీ పరిమాణంలో భూమి కుంగిపోయి కలకలం సృష్ణిస్తున్న నేపథ్యంలో ఇదే మండలంలో మరో చోట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మండలంలోని గూడవాండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే రైతు పొలంలో శుక్రవారం భూమి కుంగింది. సుమారు 20 అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యిలాగా ఏర్పడింది. భూమి క్రమేపి కుంగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని సమీక్షిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి వేంపల్లి మండలంలోని బుగ్గకొట్టాల పరిసరాల్లో రైతు వెంకటశివ పొలంలా రెండు చోట్ల భూమి కుంగిపోయింది. అయితే గురువాంర ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా భూమి యధాతథంగా ఉంది. దీంతో భూగర్భ జల శాస్ర్తవేత్తలు భూమి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రస్తతం ఇబ్బంది లేదని స్ధానికులకు ధైర్యం చెప్పారు. -
ప్రవాహం పెరిగి.. భూమి కుంగుతోంది
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా): భారీ వర్షాల వల్ల భూగర్భంలోని నీటి ప్రవాహం అధికమవడం వల్లే భూమి కుంగిపోతోందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగర సమీపంలోని నాయినోరిపల్లె, పెద్దముసల్‌రెడ్డిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఇటీవల భూమి కుంగిపోయిన ప్రాంతాలను సూపరింటెండెంట్ ఆఫ్ జియాలజిస్ట్ బీ అజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ భూగర్భంలో నీటి ప్రవాహం అధికమవడం.. పై నుంచి కూడా నీటి ఒత్తిడి పెరగడం వల్ల ఇలా జరుగుతోందన్నారు. నాయనోరిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో భూమి నెర్రెలు చీలిందని, దీనిపై కూడా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. అయితే వచ్చే నాలుగైదు రోజుల్లో మళ్లీ వర్షం వస్తే మరిన్ని చోట్ల భూమి కుంగే ప్రమాదం ఉందన్నారు. కొద్ది కొద్దిగా భూమి కుంగిపోతుందని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తమ పరిశోధన ముగిసి నివేదిక సమర్పించే వరకు గ్రామస్తులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని వారు సూచించారు.