ప్రవాహం పెరిగి.. భూమి కుంగుతోంది
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా): భారీ వర్షాల వల్ల భూగర్భంలోని నీటి ప్రవాహం అధికమవడం వల్లే భూమి కుంగిపోతోందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా కడప నగర సమీపంలోని నాయినోరిపల్లె, పెద్దముసల్‌రెడ్డిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఇటీవల భూమి కుంగిపోయిన ప్రాంతాలను సూపరింటెండెంట్ ఆఫ్ జియాలజిస్ట్ బీ అజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం పరిశీలించింది.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ భూగర్భంలో నీటి ప్రవాహం అధికమవడం.. పై నుంచి కూడా నీటి ఒత్తిడి పెరగడం వల్ల ఇలా జరుగుతోందన్నారు. నాయనోరిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో భూమి నెర్రెలు చీలిందని, దీనిపై కూడా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. అయితే వచ్చే నాలుగైదు రోజుల్లో మళ్లీ వర్షం వస్తే మరిన్ని చోట్ల భూమి కుంగే ప్రమాదం ఉందన్నారు. కొద్ది కొద్దిగా భూమి కుంగిపోతుందని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తమ పరిశోధన ముగిసి నివేదిక సమర్పించే వరకు గ్రామస్తులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని వారు సూచించారు.