sinking land
-
జమ్మూ కశ్మీర్లో జోషిమఠ్ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జోషిమఠ్ వంటి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ధాత్రి పట్టణంలోని నాయి బస్తీలో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా బస్తీలోని 20కి పైగా ఇళ్లతోపాటు ఓ మసీదుకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు మరోవైపు భూమి కుంగిపోవడంపై స్పందించిన జిల్లా అధికారులు బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తునట్లు వెల్లడించారు. భవంతులకు పగుళ్లు ఏర్పడటంపై గల కారణాలను విశ్లేషించేందుకు నిపుణుల బృందాన్ని సదరు గ్రామాలకు పంపినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ తెలిపారు. కాగా ధాత్రి మున్సిపల్ పరిధిలోని నాయి బస్తీ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉన్నాయి. అయితే భూమి కుంగిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ధాత్రి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ తెలిపారు. దోడా జిల్లాలో డిసెంబర్లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చాయని.. ఇప్పటి వరకు 20 భవనాలకు బీటల వారగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. దీని కారణంగా బస్తీ ప్రాంతం క్రమంగా కుంగిపోతుందని పేర్కొన్నారు. అయితే స్థానికంగా రోడ్ల నిర్మాణం, చుట్టుపక్కలా ప్రాంతాల్లో నది నీరు ప్రవహించడం వంటి అనేక కారణాలు కొండ పక్కనే ఉన్న గ్రామంలో భూమి కుంగిపోవడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా భూమి కుంగిపోవడంతో ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది జవవరి 8 మధ్య 12 రోజుల్లో సుమారు 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగింది. ఇస్రో శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో జోషిమఠ్‌లో నివసిస్తున్న169 కుటుంబాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. అలాగే ఎక్కువగా పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, భవనాలను కూల్చివేస్తున్నారు. చదవండి: విమానం టేకాఫ్ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ -
జోషిమఠ్ తరహాలో ఆ గ్రామంలోనూ పగుళ్లు.. ఆందోళనలో ప్రజలు
దెహ్రాదూన్: పౌరాణిక, చారిత్రక పర్యాటక ప్రదేశమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జోషిమఠ్‌లో ఉన్నట్టుండి నివాస గృహాలు బీటలువారుతుండటం, నేల నెర్రెలుబారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. జోషిమఠ్ నుంచి సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ప్రభుత్వం. అలాగే ప్రమాదకరంగా మారిన భవనాలు, హోటళ్లను కూల్చేసేందుకు సిద్ధమైంది. అయితే, జోషిమఠ్ మాత్రమే కాదు మరో గ్రామంలోనూ ఇళ్లకు పగుళ్లు, నేల నెర్రెలుబారడం గుర్తించడం కలకలం సృష్టిస్తోంది. అది కూడా జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణప్రయాగ్లోనే. జోషిమఠ్‌కు ఈ గ్రామం 80కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో ఉంటుంది. కర్ణప్రయాగ్లోని బహుగున నగర్లో సుమారు 50 ఇళ్లకు పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో బిక్కు బిక్కు మంటు కాలం వెళ్లదిస్తూన్నారు ప్రజలు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సింతర్గాంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ సోమవారం మాట్లాడుతూ జోషిమఠ్ తరహాలోనే ఇతర గ్రామాల్లోనూ ఈ సమస్య ఉందని పేర్కొన్నారు. ‘జోషిమఠ్‌లో ప్రభావితమైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. జోషిమఠ్ ప్రజల భద్రతకు భరోసా ఇస్తున్నాం. జోషిమఠ్ తరహాలోని పరిస్థితులు కనిపిస్తున్నట్లు సమీప గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి వివరాలు వెల్లడిస్తారు.’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే. మరోవైపు.. జోషిమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇతర భవనాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. హోటళ్లు మలారి ఇన్, మౌంట్ వ్యూకు భారీగా పగుళ్లు ఏర్పడిన క్రమంలో మంగళవారం సాయంత్రానికి వాటిని కూల్చేయనున్నారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ బిల్డింగ్ రీసర్ట్ ఇన్స్టిట్యూ(సీబీఆర్ఐ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)ల పర్యవేక్షణలో కూల్చివేతలు సాగుతాయని తెలిపారు. #WATCH | Chamoli, Uttarakhand: Amid the issue of land subsidence in Joshimath, cracks also seen on some houses in Bahuguna Nagar of Karnaprayag Municipality. pic.twitter.com/hwRfFcwhJy — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023 ఇదీ చదవండి: Joshimath: ఎవరి పాపం ఇది?! -
‘జోషిమఠ్’పగుళ్లపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమఠ్( చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లకు బీటలువారాయి. సుమారు 600 కుటుంబాలను ఖాళీ చేసేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జోషిమఠ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది ప్రధానమంత్రి కార్యాలయం. కేబినెట్ సెక్రెటరీ సహా కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ విభాగం అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులతో పాటు జోషిమఠ్ జిల్లా అధికారులు సైతం హాజరుకానున్నారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు బీటలు వస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. శనివారం జోషిమఠ్‌లో పర్యటించారు. ప్రభావితమైన 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జోషిమఠ్ ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: Joshimath Sinking: జోషీ మఠ్‌లో వందలాది ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ! ఏమిటీ జోషీమఠ్ ? -
జకార్తా జలవిలయం!
జకార్తా: ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ..‘దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కలిమంతన్కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను. రాజధాని అంటే కేవలం ఓ జాతికున్న గుర్తింపు మాత్రమే కాదు. అది దేశం సాధించిన ప్రగతికి చిహ్నం కూడా’ అని విడోడో తెలిపారు. ఏకంగా అధ్యక్షుడే ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి చాలా ముఖ్యమైన కారణముంది. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలకుల వైఫల్యమే శాపం.. కోటి మందికిపైగా ప్రజలు నివసిస్తున్న జకార్తా భూకంపాలు అధికంగా సంభవించే జోన్లో ఉంది. చిత్తడినేలపై నిర్మితమైన ఈ నగరానికి సమీపంలో 13 నదులు కలుస్తున్నాయి. పాలకులు జకార్తా నిర్మాణం సమయంలో తాగునీటి సరఫరాపై దృష్టి సారించకపోవడం ఈ నగరం పాలిట శాపంగా మారింది. నీటి సరఫరా జరగకపోవడంతో పరిశ్రమలు, ప్రజలు తమ అవసరాల కోసం బోర్లు వేసి భూగర్భ జలాన్ని విచ్చలవిడిగా తోడేశారు. స్థానిక జలాశయాల్లోని నీటిని కోలుకోలేని రీతిలో వాడేశారు. దీంతో చాలాచోట్ల భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీనికితోడు రాజధాని కావడంతో పెద్దఎత్తున ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. ఈ చర్యల కారణంగా జకార్తాలో భూమి క్రమంగా కుంగడం ప్రారంభమైంది. ప్రస్తుతం జకార్తాలో ఏటా 25 సెం.మీ. మేర భూమి కుంగిపోతోంది. కొన్నిచోట్లయితే నేల సముద్రమట్టానికి 4 మీటర్ల దిగువకు చేరుకుంది. భూతాపం కారణంగా సముద్రమట్టం పెరుగుతోంది. ఫలించని ప్రయత్నాలు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జకార్తాను కాపాడుకునేందుకు ఇండోనేసియా ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. జవా సముద్రం ఆటుపోట్లను అడ్డుకునేలా ఓ పొడవైన గోడతో పాటు కృత్రిమ దీవులను నిర్మించాలని అధ్యక్షుడు జోకో విడోడో ప్రతిపాదించారు. ఇందుకు రూ.2.84 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ 32 కిలోమీటర్ల మేర భారీ సముద్రపు గోడను, 17 కృత్రిమ దీవులను నిర్మించారు. అయితే ఇది సమస్యకు అనుకున్న పరిష్కారం చూపలేకపోయింది. ఈ భారీ సముద్రపు గోడ నుంచి చాలాచోట్ల నీరు ఊరటం ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఈ గోడే నేలలోకి కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో రాజధానిని తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసింది. అయితే జకార్తాలోని మూడోవంతు ప్రాంతం మునిగిపోతే లక్షలాది మంది ఇండోనేసియా ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. వీరందరికీ ఆశ్రయం కల్పించడం ఇండోనేసియా ప్రభుత్వానికి నిజంగానే సవాలుగా మారనుంది. -
మరోసారి కుంగిన భూమి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. వరుసగా భూమి కుంగుతుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆదివారం మరోసారి భూమి భారీగా కుంగింది. చింతకొమ్మదిన్నె మండలం పెద్దముసలిరెడ్డిపల్లిలోని ఓ పసుపుతోటలో 20 అడుగుల వెడల్పు, 45 అడుగుల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. జిల్లాలో వరుసగా పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో గ్రామస్తులతో పాటు ప్రజలు భయందళోనలు గురవుతున్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో గత పదిహేను రోజుల్లో రెండు సార్లు భూమి కుంగడం జరిగింది. -
నాలుగు చోట్ల కుంగిన భూమి
వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. మొన్నటి దాకా.. భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేయగా.. తాజాగా.. భూమి అకస్మాత్తుగా కుంగుతుండటం.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మండలం లోని బుగ్గలేటిపల్లి, బుగ్గలపల్లి గ్రామాల్లో ఆదివారం నాలుగు చోట్ల భూమి కుంగింది. 15 అడుగుల వెడల్పు, 7 అడుగుల లోతుతో భూమి లోపలికి వెళ్లి పోయింది. దీంతో జనం భయంతో పరుగు తీశారు. పొరుగు గ్రామాల ప్రజలు సైతం ఎక్కడ తమ ఇళ్లు కూలిపోతాయో అని భయపడుతున్నారు. కాగా.. భారీ వర్షాల కారణంగా భూగర్భంలో నీటి ప్రవాహ ఉదృతి కారణంగానే భూమి కుంగి పోతోందని భూగర్భ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా.. చింత కొమ్మ దిన్నె మండలంలోని పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. శాస్త్ర వేత్తలు సూచించారు. -
మరో చోట కుంగిన భూమి
చింతకొమ్మదిన్నె: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చింతకొమ్మ దిన్నె మండలం నాయనోవారిపల్లె, ముసల్ రెడ్డిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంతాల్లో భారీ పరిమాణంలో భూమి కుంగిపోయి కలకలం సృష్ణిస్తున్న నేపథ్యంలో ఇదే మండలంలో మరో చోట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మండలంలోని గూడవాండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే రైతు పొలంలో శుక్రవారం భూమి కుంగింది. సుమారు 20 అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యిలాగా ఏర్పడింది. భూమి క్రమేపి కుంగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని సమీక్షిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి వేంపల్లి మండలంలోని బుగ్గకొట్టాల పరిసరాల్లో రైతు వెంకటశివ పొలంలా రెండు చోట్ల భూమి కుంగిపోయింది. అయితే గురువాంర ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా భూమి యధాతథంగా ఉంది. దీంతో భూగర్భ జల శాస్ర్తవేత్తలు భూమి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రస్తతం ఇబ్బంది లేదని స్ధానికులకు ధైర్యం చెప్పారు. -
ప్రవాహం పెరిగి.. భూమి కుంగుతోంది
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా): భారీ వర్షాల వల్ల భూగర్భంలోని నీటి ప్రవాహం అధికమవడం వల్లే భూమి కుంగిపోతోందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగర సమీపంలోని నాయినోరిపల్లె, పెద్దముసల్‌రెడ్డిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఇటీవల భూమి కుంగిపోయిన ప్రాంతాలను సూపరింటెండెంట్ ఆఫ్ జియాలజిస్ట్ బీ అజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ భూగర్భంలో నీటి ప్రవాహం అధికమవడం.. పై నుంచి కూడా నీటి ఒత్తిడి పెరగడం వల్ల ఇలా జరుగుతోందన్నారు. నాయనోరిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో భూమి నెర్రెలు చీలిందని, దీనిపై కూడా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. అయితే వచ్చే నాలుగైదు రోజుల్లో మళ్లీ వర్షం వస్తే మరిన్ని చోట్ల భూమి కుంగే ప్రమాదం ఉందన్నారు. కొద్ది కొద్దిగా భూమి కుంగిపోతుందని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తమ పరిశోధన ముగిసి నివేదిక సమర్పించే వరకు గ్రామస్తులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని వారు సూచించారు.