తకరారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పారిశ్రామిక విధానం ఖరారు కావడంతో భూముల అన్వేషణపై సర్కారు దృష్టి సారించింది. ఈ క్రమంలో జిల్లాలో భూముల లెక్కలు తిరగేస్తూ.. కొత్త కేటాయింపులపై యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ శాఖలు/ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల లెక్కలు తేల్చడంలో తలమునకలైంది. పెట్టుబడులకు రెడ్‌కార్పెట్ పరచాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు.. ఖాళీ భూములపై ఆరా తీస్తోంది. వీలైనంత మేరకు వివాదరహిత భూములను కేటాయించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. భూ కేటాయింపులేగాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, వాటిలో వెలసిన ఆక్రమణలను కూడా గణిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లాలో 39వేల ఎకరాల మేర ల్యాండ్ బ్యాంక్ ఉందని జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇవి తక్షణ కేటాయింపులు అనువుగా ఉన్నాయని గుర్తించింది. ఇదిలావుండగా, ఖాళీ స్థలాల గుర్తింపు అధికారగణానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. రోజుకో లెక్క తేలుతుండడంతో స్పష్టమైన వివరాలను రాబట్టడం యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. హెచ్ఎండీఏ, టీఐఐసీలు ప్రభుత్వ భూములను నేరుగా ఆయా కంపెనీలకు బదలాయించడం, ఎవరెవరికి, ఎంత మేర కట్టబెట్టారనే సమాచారం జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడం ఈ గందరగోళానికి కారణమవుతోంది.
39,443 ఎకరాలు కేటాయింపు!
జిల్లాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు గత ప్రభుత్వాలు 39,443 ఎకరాలను కేటాయించాయి. దీంట్లో ప్రభుత్వ శాఖలకే 18,700 ఎకరాలను బదలాయించారు. వీటిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), రాజీవ్ స్వగృహ, దిల్, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ), తెలంగాణ హౌసింగ్ బోర్డు (టీహెచ్బీ) తదితర సంస్థలకు కట్టబెట్టారు. దీంట్లో సుమారు సగం విస్తీర్ణం ఇంకా వినియోగంలోకి రాలేదని రెవెన్యూ యంత్రాంగం సర్వేలో తేల్చింది.
పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి స్వాధీనం చేసుకోవడమేగాకుండా.. పారిశ్రామిక అవసరాలు పోను అట్టిపెట్టుకున్న మిగతా స్థలాలను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ద క్కన్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్(దిల్) సంస్థ అయితే ఏకంగా భూమిని తనఖా పెట్టి రుణాలు తీసుకుంది. భూ యాజమాన్య హక్కులు రానప్పటికీ, భూమిని కుదువపెట్టి రుణం తీసుకోవడంతో ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. కొన్ని సంస్థలు అత్యాశకు పోయి.. భూ సేకరణాస్త్రంతో అడ్డగోలుగా భూములను తీసుకున్నాయి.
ఈ భూములను అట్టిపెట్టుకోవడమో... అవసరాలకు మించి సంస్థలకు కట్టబెట్టడమో చేశాయి. దీంతో విలువైన భూములు ఆయా సంస్థల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇలా ఆయా సంస్థలు నిరుపయోగంగా ఉంచుకున్న భూములు, వినియోగంలోకి రాని భూముల వివరాలను రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ తరహా స్థలాల పై కూడా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అంచనాలను రూపొం దించింది.
ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన భూమిలో కేవలం 8,304.03 విస్తీర్ణం మాత్రమే వినియోగంలోకి రాగా, 10,396.11 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు లెక్క తేల్చింది. ఈ భూములను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కేటాయించేందుకు వీలు గా వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రానికి తరలిరానుండడం, ఫిలింసిటీ, ఫార్మాసిటీ, ఐటీఐఆర్, కెమికల్ సిటీ పేర పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడమే కాకుండా.. దానికి అనుగుణంగా ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఖాళీ భూములపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.
పరిశ్రమలకు భూముల నోటిఫై!
పరిశ్రమలకు కేటాయించే భూములను ప్రత్యేకంగా నోటిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆయా సంస్థలకు నిర్ధేశించిన భూములను మాత్రమే కేటాయించేందుకు ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల లెక్క తీస్తు న్న సర్కారు... పరిశ్రమల స్థాపనకు అనువైన భూముల జాబితా రూపొం దించింది.
జిల్లాలో బల్క్‌డ్రగ్, ఫార్మాసిటీ తదితర పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ల్యాండ్ బ్యాం కును సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడలకు గుర్తించిన భూములను నోటిఫై చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఫార్మాసిటీ, ఏరోస్పేస్ సిటీ, పరిశ్రమల స్థాపనకు రంగారెడ్డి జిల్లా అనువైన ప్రాంతమని సీఎం చెప్పారు. ఇందుకోసం 30 వేల ఎకరాల మేర రిజర్వ చేయాలని ఆయన ఆదేశించారు.