Food Adulteration control officials
-
కల్తీలపై కొనసాగుతున్న దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గత సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న ఆహార కల్తీ వ్యాపారాలపై కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మూడోరోజు వరుసగా గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్, ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, కార్పొరేషన్, మునిసిపల్, లీగల్ మెట్రాలజీ అధికారులు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేశారు. పలు రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి, సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. పలు షాపులు సీజ్.. జరిమానాల విధింపు జిల్లా వ్యాప్తంగా కారం మిల్లులు, హోటళ్లు, పచ్చళ్ల తయారీ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లు, సూపర్ బజార్లు, ఆయిల్ మిల్లులు, కిరాణా మాన్యుఫ్యాక్చరింగ్ షాపులు, పెట్రోలు బంకులు, చికెన్ సెంటర్లు, బిర్యాని పాయింట్లు, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, బేకరీలు, రైస్ మిల్లులు, స్వీట్, కూల్‌డ్రింక్ షాపులు, హోల్‌సేల్ మార్కెట్లు, మెస్‌లు మొత్తం 124 వ్యాపార సంస్థలపైన దాడులు చేశారు. తెనాలి సబ్ కలెక్టర్, డీఎస్వో పద్మశ్రీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్‌మొహిద్దీన్, తూనికలు, కొలతలశాఖ అధికారి షాలెంరాజు, నగరపాలకసంస్థ సిబ్బంది, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేశాయి. మిర్చియార్డు రోడ్డులో ఐదు కారం మిల్లులు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ఉల్లఘించి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి ఆ మిల్లులను, రూ.1,47,90,000 విలువైన కారంపొడిని సీజ్ చేశారు. వేగస్ ట్రేడర్స్‌లో రూ.44,80,000 విలువైన 28,400 కిలోల కారంపొడి, వీరాంజనేయ ట్రేడర్స్‌లో రూ.14 లక్షల విలువైన 7 వేల కిలోలు, సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.27,80,000 విలువైన 13,900 కిలోలు, తులసి స్పైసెస్‌లో రూ.61,30,000 విలువైన 30,650 కిలోల కారాన్ని సీజ్ చేశారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న సత్యసాయి ఎంటర్ప్రైజెస్, మహాలక్ష్మి, వీరాంజనేయ ట్రేడర్స్ వ్యాపార సంస్థలను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాపారసంస్థల్లో కొలతల్లో తేడాలు, ఆహార పదార్థాల నాణ్యతలో తేడాలు, ఆయిల్లో కల్తీ, రెస్టారెంట్లో పాడై కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కల్తీకి పాల్పడిన వ్యాపారసంస్థలను సీజ్ చేయడంతో పాటు ఆహారభద్రత చట్టం, తూనికలు కొలతలశాఖ యాక్ట్, సివిల్ సప్లయిస్ యాక్ట్, ట్రేడ్ లైసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వారి సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1902కి ఫోన్ చేసి చెబితే వెంటనే దాడులు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఘుమ ఘుమల వెనుక.. ఘాటైన నిజాలు..!
నోరూరించే రుచులు.. ఘుమ ఘుమలాడే సువానలు.. పెద్దపెద్ద హోటళ్లు.. ఫుట్‌పాత్‌లపై ఉండే హోటళ్లు.. భోజనశాలల్లో వంటకాలను చూస్తే ఆగలేని పరిస్థితి. ఈ జిహ్వాచాపల్యాన్ని కాస్త అదుపుచేసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. తింటున్న మాంసం మంచిదేనా.. అంటే..? ఏమో అని దిక్కులు చూడాల్సిన పరిస్థితి జిల్లాలో పలుచోట్ల ఎదురవుతోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా మాంసాహారాన్ని నిల్వ ఉంచుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిల్వ మాంసానికే రంగులద్ది మళ్లీమళ్లీ నూనెలో వేయించి.. వేడివేడిగా పొగలు కక్కిస్తూ వడ్డిస్తున్నారు. వాటిని ఎక్కువగా తినేవారిపై ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. సాక్షి, సూర్యాపేట : మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జిల్లాలో అధిక శాతం బయటి తిళ్లకు మక్కువ చూపుతున్నారు. అన్ని రోజుల్లోనూ మాంసాహారానికి గిరాకీ ఉంటుంది. ఇదే అదునుగా రోగాలభారిన పడిన జంతువుల మాంసాన్ని సైతం వంటకాల్లో కలిపేస్తున్నారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ పట్టణాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అడ్డగోలు వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. నిల్వ మాంసంతో పాటు నాసిరకం నూనెలు, అనుమతిలేని రంగులు మితిమీరి వాడకం ఎక్కువైపోయింది. నాణ్యత ప్రశ్నార్థకం.. నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, పంచాయతీల్లో జంతువధ శాలల నిర్వహణ సమర్థంగా సాగాలి. మూగజీవాలను వధించే ముందురోజు వాటి ఆరోగ్య పరిస్థితి పరీక్షించి, అంతా సవ్యంగా ఉంటేనే వధించాలి. జిల్లాలో చూస్తే జంతువధ శాలల్లో ఒకటిరెండు ముద్రలు వేయించుకుని, తెరవెనుక మిగిలినవి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్నవీ విక్రయించేస్తున్నారు. కోడి మాంసం విక్రయించే దుకాణాల్లో కనీస శుభ్రత ఉండడం లేదు. అదే నీటిలో పదేపదే కోళ్లను కడగడం.. చర్మం తీసి అందులోనే ఎ క్కువ సేపు ఉంచడంతో బ్యాక్టీరియా సోకే ఆస్కా రం ఉంటోంది. దుకాణాల్లో కనీస రక్షణగా అద్దాలు.. జాలీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వేలాడదీసిన మాంసంపై ఈగలు వాలుతున్నాయి. ధుమ్ము దూళి తాకి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. వండిన వంటకాలదీ అదే పరిస్థితి జాడలేని అధికారుల తనిఖీలు జిల్లాలో పలు హోటళ్లలో మాంసం నిల్వలో ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు.. కొన్ని చోట్ల మాంసం బూజుపట్టడం.. నిషేధిక రంగుల వాడకాన్ని వినియోగిస్తున్న హోటళ్లపై నిఘా ఉంచాల్సిన సంబంధిత శాఖ అధికారులే జాడ లేకుండా పోయింది. కేవలం నెలకోమారు వారికి అవసరమున్నప్పుడే మాత్రమే పెద్దపెద్ద హోటళ్లతో కుమ్మకై వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. కొన్ని హోటళ్ల నుంచి ఏకంగా మామూళ్లు వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలోని హోటళ్లతో పాటు జాతీయ రహదారిపై ఉన్న దాబా హోటళ్లను తనిఖీ చేయాలని ఆహారప్రియులు వేడుకుంటున్నారు. -
శనగనూనె మిల్లులపై దాడులు
రూ.3 లక్షల విలువైన నూనె సీజ్ నరసరావుపేట: పట్టణంలోని శనగనూనె ఆయిల్ మిల్లులపై మంగళవారం ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 3 లక్షల విలువైన శనగనూనెను సీజ్ చేశారు. తొలుత కోటప్పకొండరోడ్డులోని పంతులుమిల్లుగా పేరొందిన వెంకటఉషా ఎడిబుల్ ఆయిల్‌మిల్లుపై దాడులు చేయగా 5 డ్రమ్ముల లూట్ శనగనూనెను కొనుగొని శాంపిల్స్ సేకరించిన ఆ డ్రమ్ములను సీజ్ చేశారు. దీంతోపాటు ఐదు బాక్స్‌ల శనగనూనె పాకెట్లతో మొత్తం 1000 కేజీల శనగనూనెను సీజ్‌చేశారు. అనంతరం సత్తెనపల్లిరోడ్డులోని కనకరదుర్గ ఆయిల్ ట్రేడ్స్ మిల్లుపై దాడిచేసి సూపర్ కర్నూలు గ్రౌండ్నట్ ఆయిల్ పాకెట్లను 60 బాక్స్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక్కొక్క బాక్స్‌కు 16 పాకెట్లు చొప్పున 960 పాకెట్లు ఉంటాయి. అదేరోడ్డులోని ధనలక్ష్మి నీమ్ అండ్ ఆయిల్ మిల్లుపై దాడిచేసి డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ (శనగనూనె) 320 పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిపై శాంపిళ్లను సేకరించి ల్యాబొరేటరీకి పంపిన అనంతరం తేడాలు ఏమన్నా ఉంటే మిల్లు నిర్వాహకులపై కేసు నమోదుచేస్తామని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేటలో చేసినన్ని దాడులు జిల్లాలో మరెక్కడా చేయలేదని చెప్పారు. కల్తీలకు పాల్పడుతూ తాము తీసుకోన లెసైన్స్ బ్రాండ్ల పేరుపై వ్యాపారం చేయటం చట్టరీత్తా నేరమని హెచ్చరించారు. దాడుల్లో గజిటెడ్ ఫుడ్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు, ఫుడ్ ఇనస్పెక్టర్లు బి.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.