శనగనూనె మిల్లులపై దాడులు
రూ.3 లక్షల విలువైన నూనె సీజ్
నరసరావుపేట: పట్టణంలోని శనగనూనె ఆయిల్ మిల్లులపై మంగళవారం ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 3 లక్షల విలువైన శనగనూనెను సీజ్ చేశారు. తొలుత కోటప్పకొండరోడ్డులోని పంతులుమిల్లుగా పేరొందిన వెంకటఉషా ఎడిబుల్ ఆయిల్‌మిల్లుపై దాడులు చేయగా 5 డ్రమ్ముల లూట్ శనగనూనెను కొనుగొని శాంపిల్స్ సేకరించిన ఆ డ్రమ్ములను సీజ్ చేశారు.
దీంతోపాటు ఐదు బాక్స్‌ల శనగనూనె పాకెట్లతో మొత్తం 1000 కేజీల శనగనూనెను సీజ్‌చేశారు. అనంతరం సత్తెనపల్లిరోడ్డులోని కనకరదుర్గ ఆయిల్ ట్రేడ్స్ మిల్లుపై దాడిచేసి సూపర్ కర్నూలు గ్రౌండ్‌నట్ ఆయిల్ పాకెట్లను 60 బాక్స్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక్కొక్క బాక్స్‌కు 16 పాకెట్లు చొప్పున 960 పాకెట్లు ఉంటాయి.
అదేరోడ్డులోని ధనలక్ష్మి నీమ్ అండ్ ఆయిల్ మిల్లుపై దాడిచేసి డబుల్ ఫిల్టర్‌డ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ (శనగనూనె) 320 పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిపై శాంపిళ్లను సేకరించి ల్యాబొరేటరీకి పంపిన అనంతరం తేడాలు ఏమన్నా ఉంటే మిల్లు నిర్వాహకులపై కేసు నమోదుచేస్తామని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేటలో చేసినన్ని దాడులు జిల్లాలో మరెక్కడా చేయలేదని చెప్పారు. కల్తీలకు పాల్పడుతూ తాము తీసుకోన లెసైన్స్ బ్రాండ్ల పేరుపై వ్యాపారం చేయటం చట్టరీత్తా నేరమని హెచ్చరించారు. దాడుల్లో గజిటెడ్ ఫుడ్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు, ఫుడ్ ఇనస్పెక్టర్లు బి.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.