Football World Cup -2018
-
ఈ యేటి మేటి మోడ్రిచ్
పారిస్: తన అద్వితీయ ఆటతీరుతో ఈ ఏడాది క్రొయేషియాను ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన లుకా మోడ్రిచ్... 2018 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ బాల్’ (వరల్డ్ బెస్ట్ ప్లేయర్) అవార్డును అందుకున్నాడు. మోడ్రిచ్‌కు మొత్తం 753 ఓట్లు లభించగా... 476 ఓట్లతో రొనాల్డో రెండో స్థానంలో... 414 ఓట్లతో ఫ్రాన్స్ స్ట్రయికర్ గ్రీజ్మన్ మూడో స్థానంలో నిలిచారు. రొనాల్డో (పోర్చుగల్), మెస్సీ (అర్జెంటీనా) కాకుండా గత పదేళ్లలో ఈ అవార్డు నెగ్గిన తొలి ప్లేయర్ మోడ్రిచ్ కావడం విశేషం. ఈ ఏడాది కొత్తగా మహిళా ఫుట్‌బాల్ స్టార్‌కు గోల్డెన్ బాల్ పురస్కారాన్ని అందజేశారు. నార్వే స్ట్రయికర్ అడా హెగెర్బెర్గ్ ఈ అవార్డును అందుకుంది. -
మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా
ముంబై: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచినట్లు ప్రధాని మోదీ అవిశ్వాస పరీక్షలో నెగ్గినా, రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియాలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నారని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచినప్పటికీ, గొప్ప ఆటతీరు, పోరాటపటిమను ప్రదర్శిం చిన జట్టుగా క్రొయేషియాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్‌ను అందరూ ఇదే తరహాలో చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా అతను మిగతా వారి కంటే నాలుగైదు అడుగులు ముందుంటాడు’ అని వ్యాఖ్యానించారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారనీ, ప్రధానికి షాకివ్వాలన్న లక్ష్యంతో రాహుల్ ఆ పని చేసుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్లేనని రౌత్ అభిప్రాయపడ్డారు. -
జపాన్ విలాపం...
90+4 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 47 నిమిషాలు స్కోరే లేదు! తుది ఫలితం మాత్రం 3–2. అంటే మిగతా 47 నిమిషాల్లో ఐదు గోల్స్! బెల్జియం, జపాన్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ పోరు తీవ్రతకు నిదర్శనమిది! ఓ వైపు రెండు జట్ల దూకుడైన ఆట... మరోవైపు గోల్‌పోస్ట్ వద్ద కీపర్ల అసమాన ప్రతిఘటన...! నిర్ణీత సమయంలో 2–2తో స్కోరు సమం. ఇంజ్యూరీలో పుంజుకున్న బెల్జియం ఔరా అనిపించేలా గెలవగా... ఆఖరి క్షణంలో గోల్ సమర్పించుకున్న జపాన్ కుదేలైంది! ఓ దశలో 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం దిశగా సాగుతున్న ‘బ్లూ సమురాయ్’ బృందం ఆ తర్వాత ఏకంగా మూడు గోల్స్ ఇచ్చుకొని ఓటమిని మూటగట్టుకుంది. రొస్తావ్ ఆన్ డాన్: ఈ ప్రపంచ కప్‌లో అందరూ తమ జట్టును ప్రమాదకరమైనదిగా ఎందుకు పేర్కొంటున్నారో చాటుతూ బెల్జియం అద్భుతం చేసింది. నాలుగు నిమిషాల వ్యవధిలో జపాన్‌కు రెండు గోల్స్ ఇచ్చి చేజారిందనుకున్న మ్యాచ్‌ను... ఐదు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేసి నిలబెట్టుకుంది. స్కోరు సమమైన వేళ, ఇంజ్యూరీ సమయంలో మెరుపు ఆటతో ఫలితాన్ని తమవైపు తిప్పుకొంది. ఓడినా జపాన్ చక్కటి పోరాటంతో ఆకట్టుకుంది. సంచలనం సృష్టించేలా కనిపించిన ఆసియా జట్టు... ఆధిక్యం కోల్పోయి, ఆఖర్లో అనూహ్యంగా పరాజయం పాలైంది. రెండు జట్ల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3–2తో గెలుపొందింది. జెన్కి హరగూచి (48వ నిమిషం), తకాషి ఇనుయ్ (52వ ని.)లు జపాన్ తరఫున గోల్స్ చేశారు. జాన్ వెర్టన్గెన్ (69వ ని.), మరౌనె ఫెల్లాయిని (74వ ని.), నేసర్ చాడ్లీ (90+4వ ని.)లు బెల్జియంకు స్కోరు అందించారు. ఆధిపత్యం అటు... ఇటు పోటాపోటీ ఆటతో మ్యాచ్ రసవత్తరంగా ప్రారంభమైంది. బెల్జియం మిడ్ ఫీల్డర్లు ఈడెన్ హజార్డ్, డ్రీస్ మెర్టెన్స్‌లు వీలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రత్యర్థి లొంగలేదు. మొదటి నిమి షంలోనే జపాన్ ఆటగాడు కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ పక్కనుంచి వెళ్లింది. కొద్దిసేపటికే మెర్టెన్స్ అందించిన క్రాస్‌ను రొమేలు లుకాకు వృథా చేశాడు. హజార్డ్, లుకాకులకు సహచరుల నుంచిఅండ కరవై బెల్జియం ప్రభావవంతంగా కనిపించలేదు. జపాన్ సైతం ఓ గోల్ చాన్స్ చేజార్చుకుంది. మొదటి భాగంలో 55 శాతం బంతి బెల్జియం ఆధీనంలోనే ఉంది. ధనాధన్... రెండోభాగం మొదలవుతూనే జపాన్ దడదడలాడించింది. ఆటగాళ్ల మధ్య నుంచి వచ్చిన బంతిని వెంటాడిన హరగూచి... డి బాక్స్ లోపల ప్రత్యర్థిని ఏమారుస్తూ గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. మరుసటి నిమిషంలో బెల్జియం దాడికి దిగినా బంతి గోల్బార్ను తాకి వెనక్కు వచ్చింది. ఇక 52 వ నిమిషంలో ఇనుయ్ డి బాక్స్ ముందు నుంచి కొట్టిన షాట్ నెట్లోకి చేరింది. జపాన్ ఒక్కసారిగా 2–0 ఆధిక్యంలోకి వెళ్లడంతో బెల్జియం దాడులు పెంచింది. ఫెల్లాయిని, చాడ్లీలను సబ్స్టిట్యూట్లుగా దింపింది. దీనికి ప్రతిఫలమే 69వ నిమిషంలో వెర్టన్గెన్ గోల్. కార్నర్లో ఉన్న అతడు హెడర్ ద్వారా కొట్టిన షాట్ ఎత్తులో వెళ్లి గోల్‌పోస్ట్‌లో పండింది. కొద్దిసేపటికే క్రాస్ షాట్‌ను ఫెల్లాయిని... తలతో గోల్‌గా మలిచాడు. సమయం దగ్గరపడటంతో బెల్జియం దూకుడు చూపినా కీపర్ కవాషియా రెండుసార్లు అద్భుతంగా అడ్డుకున్నాడు. స్కోర్లు సమమై... ఇంజ్యూరీ సమయం కూడా ముగుస్తుండటంతో మరో షూటౌట్ తప్పదని అనిపించింది. అయితే... ఆఖరి నిమిషంలో కుడివైపు నుంచి అందిన బంతిని చాడ్లీ నేర్పుగా గోల్ కొట్టి బెల్జియంకు విజయం కట్టబెట్టాడు. ‘థ్యాంక్యూ రష్యా’ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్లు అసహనంతో డ్రెస్సింగ్ రూమ్‌లో అద్దాలు పగలగొట్టడం, వస్తువులను చిందరవందర చేయడం ఎన్నో సార్లు చూశాం. కానీ ఈ తరహాలో అతి శుభ్రంగా, అసలు అక్కడ అప్పటి వరకు ఎవరూ లేనట్లుగా ఉంచడం ఎప్పుడైనా చూశామా? కానీ జపాన్ మాత్రం అలాగే చేసింది. బెల్జియం చేతిలో పరాజయం బాధిస్తున్నా...తమ క్రమశిక్షణలో మాత్రం కట్టుతప్పలేదు. అక్కడినుంచి వెళ్లిపోయే ముందు అన్నీ క్రమపద్ధతిలో, కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా సర్దిపెట్టింది. పైగా వెళుతూ వెళుతూ రష్యన్ భాషలో కృతజ్ఞతలు చెబుతూ ఒక కార్డును అక్కడ ఉంచింది. హ్యాట్సాఫ్ టు జపాన్! -
రొనాల్డో, మెస్సీ, నెమార్ల ఊచకోత..!
వెబ్ డెస్క్ : ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐసిస్) ఉగ్రవాదులు సోమవారం ఆన్లైన్ విడుదల చేసిన ఫొటోలు సంచలనం రేపుతున్నాయి. 2018 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌పై ఉగ్రదాడి చేసి ప్రముఖ ఫుట్‌బాలర్లు రొనాల్డో, మెస్సీ, నెమార్ జేఆర్లను హత్య చేస్తామని ఐసిస్ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఊహాజనిత(ఎలా హత్య చేస్తామనే) ఫొటోలను కూడా విడుదల చేసింది ఐసిస్. ఓ ఫొటోలో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌బాల్ క్రీడాకారుడు నెమార్ జేఆర్ను మోకాళ్లపై నిలబెట్టి గొంతుకోసి చంపుతున్నట్లు ఉంది. మరో చిత్రంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డోను చంపుతున్నట్లు ఉంది. అర్జెంటీనా ఆటగాడు మెస్సీని ఊచల వెనుక చూపుతూ ఇంకో ఫొటోలో ఉంది. ‘ఇప్పుడు మేం రాస్తున్నాం. మీరు చదువుతున్నారు. త్వరలో ఇదే వార్తను మీరు వింటారు’ అనే హెచ్చరికను విడుదల చేసిన ఫొటోలపై ఐసిస్ ముద్రించింది. -
పరాజయంతో ముగింపు
కొచ్చి: ఫుట్‌బాల్ ప్రపంచకప్-2018 ఆసియా జోన్ క్వాలిఫయింగ్ పోటీలను భారత జట్టు పరాజయంతో ముగించింది. మంగళవారం తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో తుర్క్మెనిస్తాన్ చేతిలో ఓడింది. దీంతో తమ ‘డి’ గ్రూపులో 3 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. 27వ నిమిషంలో సందేశ్ జింగాన్ హెడర్ గోల్‌తో భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే ద్వితీయార్ధంలో పుంజుకున్న తుర్క్మెనిస్తాన్కు అమనోవ్ అర్స్లాన్ (49), సెర్డారలీ అటయూ (70) గోల్స్‌తో విజయాన్ని అందించారు. -
ఇరాన్ చేతిలో భారత్ ఓటమి
బెంగళూరు : ఫుట్‌బాల్ ప్రపంచకప్-2018 క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్‌కు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. ఇరాన్ జట్టుతో మంగళవారం స్థానిక కంఠీరవ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో భారత్ 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అంతర్జాతీయస్థాయిలో తగినంత అనుభవం లేకపోవడం, ఆటతీరు పరంగా ప్రత్యర్థికంటే మెరుగ్గా లేకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. రక్షణ పంక్తిలో ఆర్నబ్ మోండల్, సందేశ్‌లు రాణించడంతో తొలి అర్ధభాగంలో భారత్ ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుంది. అయితే రెండో అర్ధభాగంలో ఇరాన్ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించింది. 29వ నిమిషంలో సర్దార్ అజ్మౌన్ గోల్‌తో ఖాతా తెరిచిన ఇరాన్‌కు అంద్రానిక్ (47వ నిమిషంలో), మెహదీ తరోమి (51వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంతకుముందు ఒమన్, గ్వామ్ జట్ల చేతిలో భారత్ ఓడింది.