Foreign deposits
-
నల్లడబ్బు, విదేశీ సొమ్ము వేరు: పొంగులేటి
విదేశాల్లో డిపాజిట్ చేసిన డబ్బుకు, నల్లధనానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలని ఖమ్మం వైఎస్ఆర్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్లధనం వ్యవహారంపై లోక్సభలో రెండోరోజు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం, వివిధ దేశాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. 1998-2008 సంవత్సరాల మధ్య గల పదేళ్ల కాలంలో దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల ధనం ఇతర దేశాలకు వెళ్లిపోయిందని అన్నారు. పన్నుల వ్యవస్థ సరళంగా ఉన్న సైప్రస్, స్విట్జర్లండ్ దేశాలకు ఈ ధనం వెళ్లందని ఆయన చెప్పారు. మనం మన విధానాలను సరళీకరించుకుంటే.. ఆ ధనం ఇక్కడ ఉండేలా చూసుకోవచ్చని, అది మన దేశ సమగ్రాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
25 లక్షల కోట్ల మళ్లింపు
ఆరేళ్లలో స్విస్ బ్యాంకుల నుంచి భారీగా తరలిన విదేశీ నిధులు జ్యూరిక్/న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతపై భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో స్విస్ బ్యాంకుల్లో సొమ్ము రానురానూ కరిగిపోతోంది. గత ఆరేళ్లలోనే దాదాపు రూ. 25 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు స్విట్జర్లాండ్ బయటకు తరలిపోయాయట! ప్రముఖ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ ప్రైస్వాటర్హౌజ్కూపర్స్(పీడబ్ల్యూసీ) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఇందులో భారతీయులకు సంబంధించిన డబ్బు ఎంతన్న సమాచారం మాత్రం లభించలేదు. స్విట్జర్లాండ్లోని 90 ప్రైవేట్ బ్యాంకుల్లో విదేశీ ప్రైవేట్ క్లయింట్ల లావాదేవీలను ఈ సంస్థ విశ్లేషించింది. మొత్తంగా దాదాపు రూ. 25 లక్షల కోట్ల నిధులను స్విస్ బ్యాంకుల నుంచి స్వదేశాలకు గానీ, ఇతర దేశాలకు గానీ మళ్లించుకునిపోయినట్లు తేలింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్ల మేరకు స్విట్జర్లాండ్ ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి బ్యాంకుల్లో విదేశీ డిపాజిట్లు వేగంగా తగ్గిపోతున్నట్లు తేలింది. ఇక్కడ భారతీయులు దాచుకుంటున్న సొత్తు కూడా క్రమంగా తగ్గిపోతోందని గతంలోనే పలు నివేదికల ద్వారా వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితి వల్ల స్విస్ బ్యాంకులకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చునని, నిధులను తరలించిన క్లయింట్లు భవిష్యత్తులో పన్ను ఒప్పందాలు పూర్తయిన తర్వాత మళ్లీ వాటిని వెనక్కి మళ్లించే అవకాశముందని పీడబ్ల్యూసీ అభిప్రాయపడింది.