కారెక్కుతున్న క్యాడర్
- జిల్లాలో కనుమరుగవుతున్న ‘దేశం’
- కాంగ్రెస్ నేతలు సైతం వలసబాట..
- టీఆర్ఎస్ బలోపేతంపై మంత్రుల దృష్టి
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అక్కడక్కడ మిగిలి న ద్వితీయశ్రేణి నేతలూ ఇప్పుడు కారెక్కేస్తున్నారు.
కనుచూపు మేరలో రాజకీయ భవిష్యత్ కనిపించకపోవడంతో ఉన్న ఒకరిద్దరూ టీడీపీని వీడుతున్నారు. తాజాగా ఆ పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు ‘దేశం’కు గుడ్‌బై చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ మండల అధ్యక్షులు, మండల స్థాయి నేతలు కూడా టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడులో లం శ్యాంసుందర్ కూడా ఆ పా ర్టీని వీడనున్నట్లు ప్రచా రం జరుగుతోంది. కొద్ది రోజు ల్లో ఆ ముహూర్తం కూడా ఖరారవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాం గ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడడం గమనార్హం.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్ శుక్రవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కుమారుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జుల్ఫేఖార్ అహ్మద్, తన అనుచరులు గులాబీ కండువా కప్పుకున్నారు. గత వరుస ఎన్నికల్లో జిల్లాలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ దూకుడుగా వెళ్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలను సైతం తమ పార్టీలో చేర్చుకుని జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే వారే లేకుండా పావులు కదిపింది. తాజాగా టీడీపీ, కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనా టీఆర్ఎస్ దృష్టి సారించింది.
జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అరిగెల టీడీపీని వీడడంతో జిల్లా పరిషత్‌లో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకంగా తయారైంది. ప్రాదేశిక ఎన్నికల్లో కేవలం రెండు జెడ్పీటీసీ స్థానాలకే పరిమితమైన ‘దేశం’ ఇప్పుడు అరిగెల పార్టీని వీడడంతో ఒకే ఒక జెడ్పీటీసీ సభ్యుడు అబ్దుల్ కలాం(కెరమెరి) టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి రానుంది. అబ్దుల్ కలాం కూడా టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రేంసాగర్‌రావు చేరికపై చర్చ..
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరాలనే కేసీఆర్ ఆహ్వానాన్ని ఆయన అప్పట్లో తిరస్కరించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆయన్ను చేర్చుకోవడానికి టీఆర్ఎస్ జిల్లా ముఖ్యనేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ
చెన్నూర్/కోటపల్లి : చెన్నూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సుల్తాన్ అహ్మద్, ఆయన కుమారుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్ అహ్మద్, వైస్ చైర్మన్ మోతిలాల్దేవుడాతోపాటు పలువురు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు టీఆర్ఎస్లో చేరిన వారిలో కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.
తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, పార్లమెంటరీ సెక్రెటరీ కోవ లక్ష్మి, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్‌కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఉన్నారు. కాగా, సుల్తాన్ అహ్మద్ సుమారు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఏఐసీసీ సభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
అధికార పార్టీలోకి ‘అరిగెల’
ఆసిఫాబాద్ : టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు, వాంకిడి జెడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం ఆసిఫాబాద్, వాంకిడి, తూర్పు జిల్లాలోని ఆయన అనుచరగణం ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ తరలి వెళ్లారు. ఆసిఫాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు అరిగెల మల్లికార్జున్‌యాదవ్, వాంకిడి ఎంపీపీ దుర్గం ఆర్తిక, మండల పార్టీ అధ్యక్షుడు వనపర్తి సదాశివ్, ఉపాధ్యక్షుడు గొల్ల, సుమారు వంద మంది టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్‌కు తరలిన నాయకులు
బాసర : బాసర గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరిలో సీనియర్ నాయకులు నర్సురీ సుదర్శన్‌రావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు లక్ష్మణ్‌రావు, బాలారాజ్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గెంటేల శ్యాం, లాల్మియా, వార్డు సభ్యులు కృష్ణ, మోహిన్, నాయకులు జ్ఞానీ పటేల్, గోవింద్,నర్సింగ్ రావు, సంతోష్ తదితరులున్నారు.