పరిహారం కోసం రైతుల ధర్నా
గని గ్రామంలో సోలార్ పనుల అడ్డగింత
పోలీసులతో వాగ్వాదం
గని(గడివేముల): మండల పరిధిలోని గని గ్రామ పొలిమేరలో జరుగుతున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్కు పనులను రైతులు మంగళవారం అడ్డుకున్నారు. నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఎలాంటి పనులు సాగనివ్వమని బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతులు పెద్దఎత్తున బైఠాయించడంతో పోలసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతుల, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా బాధిత రైతులు ప్రశ్నించారు. గని గ్రామ పొలిమేరలో దాదాపు 3 వేల ఎకరాలు ఈ సోలార్ పార్కు నిర్మాణం కొరకు భూములు అవసరం ఉందని, ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వేలు నిర్వహించారని చెప్పారు. పనులు మాత్రం వేగవంతం చేస్తున్నారని, పరిహారం చెల్లింపును పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాఫ్ట్ బ్యాంకు ఎనర్జీ రెండు కంపెనీల ద్వారా పనులు చేయిస్తున్నారని, 200 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పనులను మహేంద్ర కంపెనీ, 150 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన పనులను స్టేర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ నిర్వహిస్తుందని రైతులు వివరించారు. కంపెనీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ వద్ద డబ్బు డిపాజిట్ చేశామని చెప్పడం అన్యాయమని, పరిహారం చెల్లిస్తేనే పనులు సాగనిస్తామని తేల్చి చెప్పారు. 346.84 ఎకరాల డీకేటీ పట్టా సాగు భూములు ఉన్నాయని, 1347.66 ఎకరాల డీకేటీ భూములను బీడు భూములుగా రెవెన్యూ అధికారులు రికార్డుల్లో చూపుతున్నారని, 435.90 ఎకరాల సొంత పట్టా భూములు ఉన్నాయని, అందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలతో పెండింగ్‌లో ఉన్న 268 మంది రైతులలో ఈనెల 21వ తేదీ 64 మంది రైతులు ఆధారాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద విచారణలో పాల్గొనాలని నోటీసులను అందిస్తున్నామని గడివేముల తహసీల్దార్ రామసుబ్బయ్య రైతులకు వివరించారు. సాగు, బీడు భూముల రైతులతోపాటు ఏడో విడత భూ పంపిణీ లబ్ధి పొందిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని బాధితులు డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ రామసుబ్బయ్య మాట్లాడుతూ బీడు భూముల రైతులు కోర్టుకు వెళ్లారని, కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు. ఉన్నతాధికారులు నిర్ణయిస్తారన్నారు. ప్రస్తుతం రైతులు సంయమనం పాటించి కాస్త గడువు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, నందివర్గం ఎస్ఐ, గడివేముల పోలీస్ సిబ్బంది, ఆర్ఐ శ్రావణ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది, వీఆర్ఓలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.