వారికీ కల్యాణలక్ష్మి వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: అగ్రకులాల్లోని పేదలకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ.. జీవో 5 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం కన్నా తక్కువ ఉన్న ఈబీసీలకు కల్యాణ లక్ష్మి వర్తిస్తుందన్నారు.
అయితే ఈబీసీ ధ్రువీకరణ ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం వల్ల తెలంగాణలో ఎక్కువ జనాభా ఉన్న రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, వెలమ కులాల్లోని పేదలకు కల్యాణలక్ష్మికి నోచుకోవడం లేదన్నారు. జీవో 231 ప్రకారం 13 కులాలకే ఈబీసీ ధ్రువపత్రాలు ఇస్తున్నారని, రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాలకు ఇవ్వడం లేదన్నారు. జీవో 5 ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న అగ్రకులాలకు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.