నలుగురు ఉగ్రవాదులు అరెస్టు
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో అమర్నాథ్ యాత్రికులపై దాడికి తెగబడిన ఉగ్రమూకను భద్రతాబలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గురువారం అదుపులోకి తీసుకున్నాయి.
అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబూ ఇస్మాయిల్ (35) కోసం భద్రతాదళాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన ఇస్మాయిల్ వేటలో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్కు చెందిన దాదాపు 250 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి నలుగురు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక, ఉగ్రదాడి సూత్రధారి అయిన లష్కరే తోయిబా కమాండర్ ఇస్మాయిల్‌ను పట్టుకోవడానికి అతను దాగి ఉన్నాడని భావిస్తున్న ప్రాంతంలోని 50 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను వినియోగస్తున్నారు. నలుగురు ఈ ఉగ్రదాడిలో పాల్గొని ఉంటారని ఇందులో ఇద్దరు పాకిస్తాన్ జాతీయులను విచారణ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.