frad
-
‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం
తాను ఒక క్రూజ్‌షిప్ కెప్టెన్ అని చెప్పుకుంటూ జనాల నుంచి ఏకంగా రూ.2.78 కోట్ల సొమ్ము కాజేసిన వ్యక్తికి కేవలం రూ. 36 వేలు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చిన వింత ఉదంతం సంచలనంగా మారింది. ఆ మోసగాని పేరు జాడీ ఆలివర్. అతను చాలామందిని కలిసి, ఎవరికైనా సరే షిప్పులో సెలవులు ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు గుంజేవాడు. సదరు మోసగాడు షిప్పు కెప్టెన్ తరహా దుస్తులు ధరించి తిరుగుతుండేవాడు. అందరికీ నకిలీ ఐడీ కార్డు చూపించి ప్రలోభపెట్టేవాడు. మిర్రర్ యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఆ మోసగాడు నకిలీ అకౌంట్ ద్వారా జనాలకు ఈ మెయిల్స్ పంపించి, తాను కార్నివాల్ పీఎల్సీ ఉద్యోగిని అని చెప్పుకునేవాడు. కోర్టు విచారణ నేపధ్యంలో..మోసగాడు జనానికి ఒక షీటు పంపేవాడని, దానిలో ట్రిప్స్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉంటాయని వెల్లడయ్యింది. ఈవిధంగా అతను సేకరించిన మొత్తాన్ని ఆన్లైన్ జూదానికి వినియోగించేవాడు. ఆన్లైన్ జూదం కోసం రుణాలు కూడా తీసుకునేవాడు. అయితే ఇప్పుడు అతని దగ్గర బాధితులకు ఇచ్చేందుకు కేవలం రూ.36 వేలు మాత్రమే ఉన్నాయి. బాధితులలో చాలామంది తాము దాచుకున్న మొత్తాన్ని ఆలివర్ చేతిలో పెట్టారు. జీవితంలో మరచిపోలేని విధంగా సెలవులను ఆనందంగా గడపుతామనే ఉద్దేశంలో అతనికి డబ్బులు చెల్లించారు. అతని బారిన పడినవారిలో ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్నారు. ఇవాన్స్ అనే ఒక బాధితుడు మాట్లాడుతూ ‘ఆలీవర్ దగ్గర నేను ఎంత సొమ్ము పోగొట్టుకున్నానో చెప్పుకోలేను. ఎందుకంటే ఈ విషయం ఇప్పటికీ నా కుమారునికి చెప్పలేదు. ఇలా డబ్బులు పోగొట్టుకోవడంలో నాదే పూర్తి బాధ్యత’అని అన్నారు. మరో బాధితుడు మార్షల్ గోడాయీ మాట్లాడుతూ‘దీని ప్రభావం నా భార్య ఆరోగ్యం మీద పడింది. గతంలో మేము డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పోగొట్టుకున్న మొత్తం మాకెంతో విలువైనది’ అని అన్నారు. 2018లో బాధితులు ట్రిప్పు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ విషయమై పోలీసులకు తెలిసింది. బాధితులు తమ బ్యాగులతో ఎదురుచూసినప్పటికీ ఎటువంటి షిప్పు రాలేదు. ఆలీవర్ వారికి 2018 జనవరి 1నుంచి 2019 జనవరి 2 వరకూ ట్రిప్పు చేయిస్తానని నమ్మబలికాడు. కాగా అలీవర్ ఒక ప్రాంతంలో భార్యతో ఉంటూ, మరోప్రాంతంలో ప్రియురాలితో కాలం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆలివర్ చేసిన మోసాలు కోర్టులో నిర్థారణ కావడంతో కోర్టు అతనిని దోషిగా ఖరారు చేసింది. జడ్జి రిచర్డ్ విలియమ్స్ నేరస్తునికి ఆరు ఏళ్ల ఒకనెల పాటు జైలుశిక్ష విధించారు. -
‘ఒక తాలీకి మరొకటి ఉచితం’.. ప్రలోభానికిలోనైన మహిళ ఎలా మోసపోయిందంటే...
ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుకోసం మోసగాళ్లు పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు.తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఘరానా మోసం చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రముఖ రెస్టారెంట్‌కు చెందిన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంతలోనే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గత ఏడాది నవంబరు 27న చోటు చేసుకోగా, దీనిపై చాలా ఆలస్యంగా ఈ ఏడాది మే 2న సైబర్ సెల్‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలి పేరు సవితా శర్మ(40)ఆమె ఒక బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన రిపోర్గులో...తనకు గత ఏడాది తన స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చిందని, తరువాత ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక లింకు పంపిందని తెలిపారు. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక పుడ్‌కు సంబంధించిన ఒక ఆఫర్ తనకు అందిందన్నారు. వారు ఇచ్చిన ఫోను నంబరుకు కాల్ చేయగా, ఎవరూ లిఫ్ట్ చేయలేదన్నారు. అయితే కొద్దిసేపటి తరువాత తనకు మరో నంబరు నుంచి ఫోను వచ్చిందన్నారు. ఈ కాల్ చేసిన వ్యక్తి తాము సాగర్ రత్న రెస్టారెంట్ నుంచి ఫోను చేస్తున్నామని ఒక తాలీ(భోజనం) బుక్ చేసుకుంటే మరొక తాలీ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అయితే ఇందుకు ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతూ, దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఆ వ్యక్తి తెలియజేశాడని తెలిపారు. వెంటనే ఆ మహిళ ఆ యాప్ ఇన్స్టాల్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీడ్ చేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికి ఆమెకు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. రెండు సెకెన్ల తరువాత రూ. 50 వేలు డ్రా అయినట్లు మరో మెసేజ్ వచ్చింది. వెంటనే తాను మోసపోయానని గ్రహించి, తన క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించానని బాధితురాలు తెలిపింది. కాగా బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వారు సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధులను సంప్రదించగా, తమకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా ఇటువంటి ఆన్లైన్ వ్యవహారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
బ్లాటర్పై మళ్లీ నిషేధం
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై మళ్లీ నిషేధం విధించారు. జరిమానా కూడా కట్టమన్నారు. తన పరిపాలన దక్షతతో ‘ఫిఫా’ను ఆర్థిక పరిపుష్టి చేసిన బ్లాటర్ అదే సమయంలో స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకునే పనిలో ఆర్థిక అవకతవకలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై విమర్శలు వెలువెత్తడంతో దర్యాప్తు చేసిన ‘ఫిఫా’ ఎథిక్స్ కమిటీ అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు నిజమేనని తేల్చింది. దీంతో గతంలోనే ఆరేళ్ల నిషేధం విధించారు. ఇదింకా ముగియనే లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో గత నిషేధం పూర్తవుతుంది. దీనికి ఏడు నెలల ముందే 85 ఏళ్ల మాజీ అధ్యక్షుడిపై మరో దఫా నిషేధాన్ని విధిస్తున్నట్లు ‘ఫిఫా’ బుధవారం ప్రకటించింది. అలాగే 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్ (రూ. 7 కోట్ల 75 లక్షలు) జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్లో బ్లాటర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇటీవలే కాస్త కుదుటపడి కోమా నుంచి బయటపడినప్పటికీ నిషేధం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ అవకతవకల్లో భాగమైన ‘ఫిఫా’ మాజీ కార్యదర్శి వాల్కేపై 2025 అక్టోబర్ వరకు నిషేధం ఉంది. ఆయనపై ఏకంగా పదేళ్ల నిషేధం విధించారు. -
అవకతవకలకు పాల్పడిన నలుగురిపై కేసు
కట్టంగూర్ (నకిరేకల్) : భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఆన్లైన్ ఎంట్రీలో అవకతవకలకు పాల్పడిన నలుగురిపై కట్టంగూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ రంజిత్ వివరాలు వెల్లడించారు. మార్చి 26, 2018న తహసీల్దార్ తిరందాసు వెంకటేశం ఆన్లైన్ ఎంట్రీలో కంప్యూటర్ ఆపరేటర్ విజయ్ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా కొత్త విజయ్ ద్వారా ఆన్లైన్ పాస్వర్డ్ తెలుసుకున్న అయిటిపాముల వీఆర్ఏ కొండ్ర చిన యాదయ్య రసూల్‌గూడేనికి చెందిన ముక్కెర సైదులు అలియాస్ ప్రభుకు తెలిపాడు. దీంతో సైదులు తన తండ్రి, తాతల పేర్ల మీద ఉన్న భూమి ఆన్లైన్లో రాలేదని, ఎలాగైనా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అయిటిపాముల సర్పంచ్ భర్త పెద్ది సుక్కయ్యకు పాస్వర్డ్ చెప్పాడు. దీంతో సైదులుకు చెందిన సెల్ఫోన్లో సైదులు తండ్రి పేరుతో పాటు మరికొందరికి చెందిన భూముల సర్వే నంబర్లు ఆన్లైన్ ఎంట్రీ చేశారు. బుధవారం ముక్కెర సైదులు, వీఆర్ఏ కోండ్ర చినయాదయ్యను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. కాగా పెద్ది సుక్కయ్య, కొత్త విజయ్‌లు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
పీఎన్బీ స్కాం..17 చోట్ల సోదాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం ముంబైలోని 17 చోట్ల సోదాలు నిర్వహించారు. షెల్ కంపెనీలతో సంబంధం ఉన్న నాలుగు బడా సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీలకు 120 షెల్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు సెర్చ్ ఆపరేషన్‌లో బయటపడింది. వీటిలో79 కంపెనీలకు మెహుల్ చోక్సీ, 41 షెల్ కంపెనీలకు నీరవ్ మోదీ యజమానులుగా ఉన్నట్లు తేలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని ఈ షెల్ కంపెనీలకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నీరమ్ మోదీ, మెహుల్ చోక్సీ, వారి కుటుంబసభ్యులు ఈ సంవత్సరం జనవరి నెలలో దేశం విడిచి పారిపోయిన సంగతి తెల్సిందే. ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఇద్దరు మాజీ బ్యాంకు ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నసంగతి తెల్సిందే. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకునకు రూ.11,300 కోట్ల రుణాలు ఎగవేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణానికి తెరలేపాడు. -
శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు
- పెళ్లికి నిరాకరించిన మోసగాడు - రూ.40వేలు పరిహారం ఇవ్వాలని పెద్దల తీర్పు - అబార్షన్ చేయించిన తల్లిదండ్రులు - అనారోగ్యంతో రెండు నెలల తరువాత మృతి - 12 మందిపై కేసు కల్లూరురూరల్(సత్తుపల్లి): ఖమ్మం జిల్లాలోని ఓ గిరిజన వికలాంగ బాలికను గర్భవతిని చేసి, పెళ్లికి నిరాకరించిన మోసగాడిని ఆ గ్రామ పెద్దలు వదిలేశారు. బదులుగా, ఆమె శీలానికి వెల (నష్ట పరిహారం) నిర్ణయించారు. ఆమెకు తల్లిదండ్రులు అబార్షన్ చేయించారు. రెండు నెలల తరువాత ఆమె మృతిచెందింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజర గ్రామానికి చెందిన వికలాంగురాలు వాంకుడోత్ రాణి(15)కి, అదే గ్రామానికి చెందిన మూడు చెన్న కేశవులు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. కొన్నాళ్ల తరువాత ఆమె గర్భందాల్చింది. ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దల ద్వారా పంచాయతీ పెట్టించారు. రాణిని చెన్నకేశవులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీనికి అతడి తల్లిదండ్రులు నిరాకరించి, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డారు. బాలిక కుటుంబానికి రూ.40వేలు చెల్లించేలా ఇరు కుటుంబాల మధ్య గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. అబార్షన్.. మృతి బాలికను మోసగాడైన చెన్నకేశవుల తల్లి మూడు లచ్చి, ఖమ్మం తీసుకెళ్లి అబార్షన్ చేయించింది. నిరుపేదలైన బాలిక తల్లిదండ్రులు వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఆమె ఆరోగ్యం క్షీణించి, ఖమ్మం ఆస్పత్రిలో మృతిచెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో 12మందిపై కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్ కేసు నమోదు చేశారు. అబార్షన్ చేసిన ఆసుపత్రి వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.