Free corporate education
-
ఇంటర్ ఉచిత కార్పొరేట్ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఇంటర్మీడియట్లో ఉచిత కార్పొరేట్ విద్యనందిస్తోంది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన పేదలను ఈ పథకం కింద ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. జూన్ 9లోపు ఆన్లైన్ ద్వారా ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్ 13న ప్రకటిస్తారు. జూన్ 14 నుంచి సర్టిఫికెట్లు పరిశీలించి 17లోగా తుది జాబితాను వెల్లడిస్తారు. పలు సంక్షేమ శాఖల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2,262 మందిని ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు. ఏటా రూ. 38 వేల ఫీజు.. ఉచిత ఇంటర్ కార్పొరేట్ విద్య పథకం కింద ఎంపికైన విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.38 వేలు ఖర్చు చేస్తోంది. ఎంపికైన విద్యార్థికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పి స్తుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నందున కాలేజీల ఎంపికను ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేపడుతోంది. అన్ని రకాల మౌలిక వసతులతోపాటు కాలేజీ రికార్డు, ఫలితాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తోంది. ఈ పథకం కింద తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఫీజులు నిర్ధారించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫీజులు పెంచాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరు అర్హులు.. 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 7 జీపీఏ పైబడి స్కోర్ సాధించి, స్థానిక విద్యార్థి అయి ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.1.5 లక్షలు మించరాదు. పూర్తి వివరాలను సంక్షేమ శాఖ అధికారులు ఈపాస్ తెలంగాణ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థి కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు రేషన్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్ తప్పనిసరి. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించాలి. మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా సంక్షేమ అధికారిని నేరుగా సంప్రదించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
పేదల పథకం పడకేసింది
ఇందూరు: ‘దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్న’ చందం గా తయారైంది ఉచిత కార్పొరేట్ విద్యా పథకం పరిస్థితి. దరఖాస్తు లవరకు వచ్చిన ప్రక్రియ కాస్త ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో నిలిచి పోయింది. పేద విద్యార్థులకు మేలు కలిగించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా పథకం కొనసాగేలా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కళాశాలలు మొదలై రెండు నెల లు గడుస్తున్నప్పటికీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సీట్ల భర్తీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అసలే నెల రోజు లు ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకుని నెల రోజులవుతున్నా సీట్ల భర్తీ ఊసెత్తడం లేదు. ఫలితంగా ప్రతిభ గల నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల (ఇంటర్) విద్య ఉచితంగా అందకుండాపోతుందనే భయం పట్టుకుంది. ఫీజులు కట్టి ఉన్నత చదువులు చదవలేని పేద పిల్లలకు ఆసరాగా ఉన్న పథకం ఇక ఉండదేమోననే ప్రచారం జరుగుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సైతం మూసివేయడంతో విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అధికారులకు పాలు పోవడంలేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలలో ఉచిత వసతితోపాటు ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈ ఈ, ఎంసెట్లలో కోచింగ్‌తో కూడిన ఉచిత ఇంటర్ విద్యను అందించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం కొనసాగుతోంది. దీని ద్వారా జిల్లాలోని పేద విద్యా ర్థులకు నాణ్యమైన విద్య అందడమే కాకుండా, వారి కుటంబాలకు ఆర్థిక భారం తగ్గింది. 2014-15 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో శ్రీ కాకతీయ, న్యూ కాకతీయ, శాంకరీ, నిర్మల హృదయ, క్షత్రియ మొత్తం ఐదు జూనియర్ కళాశాలలను ఎంపిక చేశారు. జిల్లాకు 183 సీట్లను కేటాయించిన ప్రభుత్వం, ఎస్సీలకు-75, ఎస్టీలకు 32, బీసీలకు 42, బీసీ(సీ)కి 14, ఈబీసీలకు 10, మైనార్టీలకు 10 సీట్లుగా కేటాయించారు. ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో 8,9,10 తరగతులు ఖచ్చితంగా చదివి ఉండాలి. పదవ తరగతిలో 7.0 గ్రేడ్ మార్కులు దాటి ఉండాలి. ఈ నిబంధనలతో సాంఘిక సంక్షేమాధికారులు జూన్ 24న నోటిఫికేషన్ జారీ చేశారు. నిజానికి దీనిని జూన్ మొదటి వారంలోనే జారీ చేయాలి. కానీ, ఒక నెల ఆలస్యమైంది. ఆలస్యమైనప్పటికీ తొందరగానే సీట్లను భర్తీ చేస్తారనే ఉద్దేశంతో విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. జూన్ 30తో దరఖాస్తుల తేదీ కూడా ముగిసింది. వందల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో సీటుకు 10 నుంచి 15మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. నెల రోజులు గడుస్తున్నా సీట్లను భర్తీ చేయలేదు. మరో మార్గం లేక చదువు‘కొంటున్నారు’ సీట్ల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్ణయానికి రాకపోవడం, ఒక వేళ వచ్చినా విద్యార్థుల ఎంపిక హైదరాబాద్ కమిషనరేట్‌లో జరగుతుందని, తద్వారా ఆలస్యం జరి గి తమ పిల్లలు చదువును నష్టపోతారనే ఉద్దేశంతో పేద కుటుంబాలకు చెందినవారు ఫీజులు చెల్లించి ప్రయివేటు కళాశాలలలో చేరుస్తున్నారు. వసతి, విద్య మొత్తం కలి పి సూమారు రూ.30 నుంచి 35వేల వరకు ఖర్చు అవుతోంది. అదే ఈ పథకం ద్వారా చదవితే డబ్బులు వెచ్చించే పని ఉండేది కాదు. ఇటు మరి కొందరేమో ప్రతిభ కలి గిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ కళాశాలలో చేరుతున్నారు. ఇంకొందరు ఇంకా ఈ పథకంలో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) విభజన కూడా జరిగింది. విద్యార్థుల ఎంపికను సీజీజీవారే చేస్తారు. రాష్ర్టంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇస్తే తప్ప విద్యార్థుల ఎంపిక జరగదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భా విస్తున్నాం. -
‘కార్పొరేట్ విద్య’తో బతుకు బంగారం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పేద విద్యార్థులు తమ బతుకును బంగారుమయం చేసుకునేందుకు రూపొందించిన మహత్తర కార్యక్రమం ‘ఉచిత కార్పొరేట్ విద్య’. నిరుపేద పిల్లలకు కార్పొరేట్ విద్యను చేరువ చేయాలనే ఆశయంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం వల్ల పేద, నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు బాటలు వేసుకుంటున్నారు. 2014-15 విద్యా సంవత్సరానికి గానూ 209 మంది విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ఎంపిక కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు, వసతి, ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తారు. అర్హతలు, ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి జిల్లాకు 209 సీట్లను కేటాయించగా అందులో బాలికలకు 131, బాలురకు 89 సీట్లను ఉన్నాయి. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీలకు 98, ఎస్టీలకు 28, బీసీలకు 54, మైనార్టీలకు 14, బీసీ-సీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం రూ.2 లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది. పదో తరగతిలో జీపీఏ 7 పైన వచ్చిన విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. దరఖాస్తు చేయడం ఇలా.. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మరికొన్ని నూతన కళాశాలలను ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు అంతర్జాలంలో ‘ఈ పాస్’ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సిఉంటుంది. వెబ్‌సైట్‌ను క్లిక్ చేయగానేకార్పొరేట్ కళాశాలలఅప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారం ఉంటుంది. అందులో విద్యార్థికి సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. వెంటనే సదరు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారం వస్తుంది. అందులో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పదో తరగతిలో విద్యార్థి సాధించిన గ్రేడ్, కులం, ఉపకులం, తల్లిదండ్రుల వృత్తి, చిరునామా వివరాలను పొందుపరచాలి. రేషన్ కార్డు, ఆధార్ ఈఐడీ, యూఐడీ నంబర్లను జతపరచాలి. ఈ మెయిల్ ఉంటే ఐడీ, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను అందజేయాలి. మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. విద్యార్థి కళాశాలలను సైతం ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు. పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : కె.సరస్వతి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, ప్రకాశం జిల్లాపేద విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్పొరేట్ విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ఆన్లైన్లో దరఖాస్తు పంపిన తర్వాత ఒక కాపీని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలి.