ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పేద విద్యార్థులు తమ బతుకును బంగారుమయం చేసుకునేందుకు రూపొందించిన మహత్తర కార్యక్రమం ‘ఉచిత కార్పొరేట్ విద్య’. నిరుపేద పిల్లలకు కార్పొరేట్ విద్యను చేరువ చేయాలనే ఆశయంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం వల్ల పేద, నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు బాటలు వేసుకుంటున్నారు. 2014-15 విద్యా సంవత్సరానికి గానూ 209 మంది విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ఎంపిక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు, వసతి, ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తారు.
అర్హతలు, ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి
జిల్లాకు 209 సీట్లను కేటాయించగా అందులో బాలికలకు 131, బాలురకు 89 సీట్లను ఉన్నాయి. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీలకు 98, ఎస్టీలకు 28, బీసీలకు 54, మైనార్టీలకు 14, బీసీ-సీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం రూ.2 లక్షల వరకూ మినహాయింపు ఉంటుంది. పదో తరగతిలో జీపీఏ 7 పైన వచ్చిన విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు.
దరఖాస్తు చేయడం ఇలా..
సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మరికొన్ని నూతన కళాశాలలను ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు అంతర్జాలంలో ‘ఈ పాస్’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సిఉంటుంది. వెబ్‌సైట్‌ను క్లిక్ చేయగానేకార్పొరేట్ కళాశాలలఅప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారం ఉంటుంది. అందులో విద్యార్థికి సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. వెంటనే సదరు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారం వస్తుంది.
అందులో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పదో తరగతిలో విద్యార్థి సాధించిన గ్రేడ్, కులం, ఉపకులం, తల్లిదండ్రుల వృత్తి, చిరునామా వివరాలను పొందుపరచాలి. రేషన్ కార్డు, ఆధార్ ఈఐడీ, యూఐడీ నంబర్లను జతపరచాలి. ఈ మెయిల్ ఉంటే ఐడీ, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను అందజేయాలి. మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. విద్యార్థి కళాశాలలను సైతం ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు.
పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : కె.సరస్వతి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, ప్రకాశం జిల్లాపేద విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్పొరేట్ విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపిన తర్వాత ఒక కాపీని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలి.
‘కార్పొరేట్ విద్య’తో బతుకు బంగారం
Published Mon, Jun 2 2014 2:29 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement