పేదల విద్యకే ప్రాధాన్యం
‘మీ బాబును కలెక్టర్‌ను చేస్తావా? ఇంజనీర్‌ను చేస్తావా? డాక్టర్‌ను చేస్తావా? ఏం కావాలో చెప్పండి’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి ఒక్కరిని పేరుపేరునా అడిగేవారు.
‘మీ ఇంటి నుంచే కలెక్టర్ కావాలి.. మీ ఇంటి నుంచే డాక్టర్ రావాలి... మీ అబ్బాయే లాయర్ అవ్వాలి... మీ వాడే ఓ కంపెనీకి సీఈవో అవ్వాలి... అప్పుడే ఈ దేశ దారిద్య్రం పోతుంది. అందుకోసం ఎంతకైనా వెనుకాడను. వేల కోట్లు వెచ్చిస్తాను’అని
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చెబుతున్న మాటలివి.
వనం దుర్గాప్రసాద్, ఎలక్షన్ సెల్ : బడుగు బలహీనవర్గాల్లో అక్షర వెలుగులు నింపాలన్న జగన్ ధ్యేయానికి ఇది నిదర్శనమని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారు. అధికారం లేనప్పటికీ పేద విద్యార్థుల కోసం ఫీజుపోరు చేపట్టారు. ఫీజు రీయింబర్‌సమెంటు ఇవ్వాలని ఆమరణ దీక్ష చేశారు.
ఆర్థిక భారం అక్షర జ్ఞానాన్ని దూరం చేయకూడదు. ప్రతిభను ప్రోత్సహించడం పాలకుల బాధ్యత. నూటికి నూరు పైసలూ ఈ విధానాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వీయ అనుభవాల నుంచి పరిశీలించిన అనుభవమది. ఓదార్పు యాత్రలో స్వయంగా తెలుసుకున్న నిజమది. అందుకే వైఎస్ కలలను కొనసాగిస్తూ, బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించాలని సంకల్పించారు. ఈ ఆలోచనలకు ప్రతిరూపమే ‘అమ్మఒడి’. ఎన్నికల హామీల్లో దీన్నే ప్రధానాంశంగా చేర్చారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ‘అమ్మ ఒడి’ ఫైలుపై సంతకం చేస్తానని ప్రకటించారు. అట్టడుగు వర్గాల ప్రయోజనమే పరమార్థంగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఆశలు రేపుతోంది.
‘మీ పిల్లలను బడికి పంపండి. మీ బాధ్యత మేం తీసుకుంటాం’ అని భరోసా ఇస్తున్న జగన్, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని తెలిపారు. ఈ సొమ్మును నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే జమయ్యేలా చూస్తామన్నారు. పదో తరగతి వరకు నెలకు ఒక్కొక్కరికి రూ.500, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులకు రూ.700, అనంతరం పీజీ వరకు నెలకు రూ.1000 అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం.
జగన్ ఆలోచనలే కార్యరూపం దాలిస్తే... కోటిన్నర మంది పిల్లలకు చేయూత లభిస్తుంది. ప్రభుత్వంపై ఏటా రూ.10వేల కోట్ల భారం పడుతుంది. ఇప్పటి వరకూ ఏలిన ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో వెచ్చించలేదు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం రాష్ట్రంలో ఓ సరికొత్త విప్లవం. ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య ఖరీదైన రోజుల్లో పేద వర్గాలకు వైఎస్ అందించిన బ్రహ్మాస్త్రమిది.
యావత్ రాష్ట్ర యువత భవిష్యత్తే ఊహించని మలుపులు తిరిగింది. ఆర్థిక వెనుకబాటు తనం ఉంటే చాలు ఎలాంటి షరతులు లేకుండా ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించేది. వైఎస్ ఉన్నంత కాలం ఈ పథకానికి ఢోకా లేదు. ఆయన తర్వాత సవాలక్ష నిబంధనలు మళ్ళీ పేద విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నాయి.
‘ఇక మీదట ఇలాంటి దుస్థితి ఉండదు. సరస్వతీ పుత్రులెవరూ డబ్బు కోసం వెదుక్కోనక్కర్లేదు. మళ్లీ సువర్ణ యుగాన్ని మీకు అందిస్తా. రీయింబర్స్‌మెంట్‌ను యథావిధిగా అమలు చేస్తాను‘ అని జగన్ భరోసా ఇచ్చారు. ఇప్పుడీ హామీ విద్యార్థి లోకానికి వెన్నుదన్నుగా మారింది.
చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఘర్షణల్లో అసువులు బాసి అనాథలైన వారి పిల్లలు ఇలా ఒకరేమిటి... సమాజపు చిన్న చూపులో దగాపడ్డ ప్రతీ బిడ్డకు దగ్గరుండి అక్షరాలు నేర్పించాలనేది జగన్ ఉన్నత లక్ష్యాల్లో ఒకటి. ఈ దిశగా అవసరమైన నిధులు కేటాయిస్తానని, పథకాలు రూపొందిస్తానని ఆయన అనేక సందర్భాల్లో ప్రకటించారు.
యూనివర్సిటీలు పెంచాలి
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ప్రగతి సాధించాలంటే యూనివర్సిటీల పెంపు తప్పనిసరి. నల్లగొండ జిల్లాలో మరో యూనివర్సిటీ ఏర్పా టు చేయాలి. పారిశ్రామిక ప్రగతికి అన్ని ప్రాంతాల్లో చిన్న, పెద్ద తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ప్రతి మండల కేంద్రంలో మహిళా కళాశాలను ఏర్పాటు చేయాలి. అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ తరహాలో మరో స్వయంప్రతిపత్తి విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
- రాంసింగ్, విద్యార్థి, దేవరకొండ, నల్లగొండ
నిరుద్యోగ భృతి చెల్లించాలి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ నెలకు రూ.రెండువేల నిరుద్యోగ భృతి చెల్లించాలి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో ఉద్యమంలో క్రియాశీల పాత్రపోషించాం. వివిధ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిం టినీ భర్తీ చేయాలి. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలి. గరిష్ట వయోపరిమితిని 40ఏళ్లకు పెంచాలి.
- నిఠలాక్షప్ప, నిరుద్యోగి, పాపన్నపేట, మెదక్
భరోసా ఇచ్చే వారికే ఓటు
పేదలకు పెద్ద చదువులు భారం కాకుండా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నాయకుడు రావాలి. అటువంటి వారికే నా తొలి ఓటు. వైఎస్సే లేకుంటే మాలాంటి నిరుపేదలు ఇంజినీరింగ్, డాక్టర్ విద్యను చదివేవారు కాదు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటోందో.. పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పేద విద్యార్థులు ఎంత చదివినా ప్రభుత్వమే ఫీజులు కడుతుందనే భరోసా ఇచ్చే నాయకుడే మాక్కావాలి.
- జి.నవత, బీటెక్ ఫైనల్ ఇయర్, ఖమ్మం
వైఎస్ ప్రోత్సహించారు
ప్రతీ యువకుడికి ఉపాధి కల్పించాలి. ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. పెద్ద చదువులు చదివిన లక్షలాది మంది ప్రస్తుతం ఉద్యోగాలు లేక చదువులతో సంబంధం లేని చిరుద్యోగాలు చేస్తున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు యువతను ప్రోత్సహిం చారు. మెరుగైన ఉపాధి మార్గాలు చూపించారు. యువతకు చేయూత నిచ్చే అటువంటి నాయకుడు మళ్లీ రావాలి.
-గురిజాల సాయి నిరంజన్ కుమార్, ఇంజినీరింగ్ విద్యార్థి, ఖమ్మం