free delivery
-
ఫ్రీ డెలివరీ రోజులు పోయాయి! కస్టమర్లను ఆకట్టుకోవడానికే అదంతా!
ప్రస్తుతం జనం ఆన్లైన్ షాపింగ్‌కు బాగా అలవాటు పడ్డారు. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నీ ఆన్లైన్లోనే కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్రీ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఆ ఫ్రీ డెలివరీ రోజులు పోయాయి. (గూగుల్‌పే యూజర్లకు సర్ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్) ఈ కామర్స్ సంస్థల్లో వాస్తవానికి ఉచిత షిప్పింగ్ వంటివి ఏవీ ఉండవు. ఓ వైపు ఉచిత డెలివరీ అంటూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు డెలివరీ చార్జీలు రాబట్టుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు ఎత్తులు వేస్తున్నాయి. త్వరగా ఉత్పత్తుల డెలివరీ కోసం అదనపు చార్జీలు, ఉచిత డెలివరీ కావాలంటే కనీస కొనుగోలు మొత్తం అధికంగా పెంచడం వంటివి చేస్తున్నాయి. (కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!) ఈ కామర్స్ సంస్థల్లో ఫ్రీ డెలివరీ రోజులు పోయాయని కేంబ్రిడ్జ్ రీటైల్ అడ్వైజర్స్ మేనేజింగ్ పార్టనర్ కెన్ మోరిస్ తెలిపారు. ఉత్పత్తి ద్రవ్యోల్బణం, విపరీతమైన షిప్పింగ్ ఖర్చులు ఈ-కామర్స్ సంస్థలకు ఇబ్బందిగా పరిణమించాయని, మాంద్యం ప్రభావంతో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) -
భోజన ప్రియులకు జోమాటో బంపర్ ఆఫర్..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తన యూజర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. యూజర్ల కోసం కొత్తగా మరో మెంబర్‌షిప్‌ను తొందరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో తన యూజర్ల కోసం ఇప్పటికే జోమాటో ప్రో పేరిట మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జోమాటో ప్రో సభ్యత్వంలో భాగంగా రూ. 200 మెంబర్‌షిప్‌ను తీసుకుంటే ఫుడ్ డెలివరీలపై 30 శాతం వరకు అదనపు తగ్గింపు, రెస్టారెంట్ డైనింగ్‌లో 40 శాతం వరకు తగ్గింపుతో పాటు వేగవంతమైన డెలివరీలను అందిస్తోంది. ఈ మెంబర్షిప్ గడువు 90 రోజులుగా ఉంటుంది. తాజాగా జోమాటో తన యూజర్ల కోసం మరో సరికొత్త మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో ప్రో ప్లస్ పేరిట కొత్త మెంబర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ మెంబర్‌షిప్‌లో భాగంగా అపరిమిత ఫ్రీ డెలివరీలను యూజర్లకు జోమాటో అందించనుంది. అంతేకాకుండా ఎలాంటి సర్జ్ ఛార్జీలు, డిస్టాన్స్ ఛార్జీలు, అన్ని ప్రో మెంబర్షిప్ సేవలను జోమాటో అందించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్లో పేర్కొన్నారు. అయితే ఈ ఆఫర్ కోసం జోమాటో ఒక చిన్న మెలిక పెట్టింది. ఈ మెంబర్షిప్ కోసం జోమాటో యాప్ ఈ రోజు(ఆగస్టు 2) సాయంత్రం ఆరు గంటలకు కొంతమంది యూజర్లకు మాత్రమే ఆహ్వానాన్ని పంపనుంది. ఆహ్వానం వచ్చిన యూజర్లు సదరు అమౌంట్‌ను చెల్లించి జోమాటో ప్రో ప్లస్ మెంబర్షిప్ సేవలను పొందవచ్చును. జోమాటో ప్రో ప్లస్ మెంబర్షిప్ ధరలను ఇంకా ప్రకటించలేదు. జొమాటో 2008 లో ప్రారంభించగా, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కంపెనీ రూ. 8,250 కోట్ల వరకు ఐపీవోను దాఖలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. We have 1.8mn Zomato Pro members as of today. And one of the most requested features from our customers has been “Unlimited Free Deliveries” (something like Amazon Prime). So… in a few hours, we are launching our Limited Edition *Pro Plus* membership for select customers… pic.twitter.com/RtL4ftDBpt — Deepinder Goyal (@deepigoyal) August 2, 2021 -
Gaurav Rai: ఆక్సిజన్ మ్యాన్
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్.. మరో కోణంలో సమాజంలో అడుగంటిన మానవత్వాన్ని తట్టిలేపుతోంది. కరోనా కారణంగా ఎదురవుతోన్న సమస్యలకు ఒకరికొకరు సాయమందించుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్ కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందిస్తూ వందలమంది ప్రాణాలను రక్షిస్తున్నారు. ‘‘కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’. ఈ పరిస్థితిని స్వయంగా అనుభవించిన గౌరవ్.. తనలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదు అని భావించి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ‘ఆక్సిజన్ మ్యాన్ ’గా అందరి మన్ననలను పొందుతున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్న సమయంలో గౌరవ్ కరోనా బారిన పడ్డారు. అప్పుడు అతనికి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడానికి బెడ్ దొరకలేదు. దీంతో గౌవర్ కరోనా పేషంట్లు ఉన్న వార్డులో మెట్ల పక్కన పడుకున్నాడు. పడుకోవడానికి కాస్త స్థలం దొరికినప్పటికీ.. కరోనాతో అతని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు. ఓ ఐదుగంటల తర్వాత గౌరవ్ భార్య నానా తంటాలు పడి ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గౌరవ్ నెమ్మదిగా కోలుకుని బయటపడ్డారు. సిలిండర్ దొరకక తాను పడిన ఇబ్బంది మరొకరు పడకూడదనుకున్న గౌరవ్ ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయాలనుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్న గౌరవ్ రాయ్ అనుకున్న వెంటనే గౌరవ్ దంపతులు తమ సొంత డబ్బులతో వాళ్ల ఇంటి బేస్ మెంట్ లో చిన్న ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రోజు ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి గౌరవ్ తన వ్యాగ్నర్ కారులో తీసుకెళ్లి ఇవ్వడం ప్రారంభించారు. ఫేస్బుక్, ట్విటర్లో ఉన్న గౌరవ్ స్నేహితులు ఆక్సిజన్ బ్యాంక్ గురించి ప్రచారం చేయడంతో అవసరమైన వారందరూ గౌరవ్‌కు కాల్ చేసేవారు. వారికి సిలిండర్లను ఉచితంగా ఇచ్చి, ఆ పేషెంట్ కోలుకున్నాక మళ్లీ వెళ్లి సిలిండర్‌ను వెనక్కు తీసుకొచ్చేవారు. ఈ మొత్తం ప్రక్రియలో గౌరవ్ ఒక్క రూపాయి కూడా తీసుకోక పోవడం విశేషం. ప్రారంభంలో ఆక్సిజన్ బ్యాంక్ పది సిలిండర్లతో ప్రారంభమై నేడు 200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలిసిన కొందరు దాతలు విరాళాల రూపంలో గౌరవ్‌కు సాయం చేస్తున్నారు. తెల్లవారుజామున ఐదుగంటలకే లేచి.. ప్రారంభంలో గౌరవ్ తనుండే అపార్టుమెంటు లో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేవారు. సిలిండర్ కావాలని కాల్స్ పెరగడంతో తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అర్ధరాత్రి వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి ఇప్పటిదాక దాదాపు వేయ్యిమందికి సిలిండర్లను సరఫరా చేశారు. క్రమంగా సిలిండర్ల సంఖ్య పెంచుతూ బిహార్‌లోని 18 జిల్లాల్లోని కరోనా పేషంట్లకు సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. -
జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ ఈ కామర్స్ విభాగం జియోమార్ట్ ద్వారా మరో సునామీ సృష్టించేందుకు మరింత దూకుడుగా సిద్ధమవుతోంది. భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ తాజాగా ఆండ్రాయిడ్, ఐఫోన్వినియోగదారులకోసం కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా జియోమార్ట్ అన్ని ఆర్డర్లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ జూలై15న కంపెనీ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోమార్ట్ ప్రధాన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం లాంచ్ చేసిన జియోమార్ట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని జియో ప్రకటించింది. రిలయన్స్ తన లాయల్టీ ప్రోగ్రామ్ రిలయన్స్ వన్ లేదా రోన్‌ను జియోమార్ట్‌కు కూడా విస్తరించింది. తద్వారా వినియోగదారులు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు, రోన్ పాయింట్లను సంపాదించవచ్చని తెలిపింది. ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ దూసుకుపోతోంది. ఇప్పటికే 10వేలకు పైగా డౌన్లోడ్లను సంపాదించింది. జియోమార్ట్ వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే రోజుకు 2,50,000 ఆర్డర్లు వస్తున్నట్టు జియో వెల్లడించింది. అయితే కొన్ని సమస్యలున్నాయంటూ కొంతమంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. జియోమార్ట్ ఇంతకుముందు750 రూపాయలు అంతకంటే ఎక్కువ ఆర్డర్లకు మాత్రమే ఉచిత డెలివరీని అందిస్తున్న సంగతి గమనార్హం. అమెజాన్ ప్రస్తుతం ఆర్డర్లకు 799 రూపాయలపైన ఉచిత డెలివరీని అందిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ ఇవ్వడానికి కనీస ఆర్డర్ విలువ 600 రూపాయలు. ఉచిత డెలివరీ కావాలంటే 1,200 రూపాయలు విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్రోఫర్స్ 800 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లకు ఉచిత డెలివరీని అందిస్తుంది. పరిచయ ఆఫర్‌గా, జియోమార్ట్‌లో ప్రతి మొదటి ఆర్డర్‌తో కోవిడ్-19 ఎసెన్షియల్ కిట్‌ను అందిస్తామని ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
90 నిముషాల్లో ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ ఆన్లైన్ విక్రయాల్లోకి ప్రవేశించింది. కంపెనీ స్టోర్లున్న నగరం, పట్టణంలో వెబ్, యాప్ ద్వారా ఆర్డరు ఇచ్చిన 90 నిమిషాల్లోనే మొబైల్‌ను ఉచితంగా డెలివరీ చేస్తారు. కస్టమర్ కోరితే ఇంటి వద్దే మొబైల్స్‌ను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 81 నగరాలు, పట్టణాల్లో 225 ఔట్లెట్లు ఉన్నాయి. కర్ణాటకలో కొద్ది రోజుల్లో అడుగు పెట్టనున్నట్టు బిగ్ సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. 17వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించిన సందర్భంగా డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, కైలాష్ లఖ్యానీతో కలిసి సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 మార్చి నాటికి స్టోర్ల సంఖ్య 300లకు చేరుతుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లదాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్టోర్లలో ఇతర ఉపకరణాలు.. మొబైల్స్, యాక్సెసరీస్‌తోపాటు ఎంఐ, టీసీఎల్ కంపెనీల స్మార్ట్ టీవీల విక్రయాలను ప్రారంభించామని బాలు చౌదరి తెలిపారు. ‘ఇతర కంపెనీల స్మార్ట్ టీవీలను సైతం ప్రవేశపెడతాం. ఇంటర్నెట్తో అనుసంధానించే స్మార్ట్ ఉపకరణాల సంఖ్య పెంచుతాం. 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని రూ.12 కోట్ల విలువైన బహుమతులు, రూ.5 కోట్ల విలువైన క్యాష్ పాయింట్లను సైతం ఆఫర్ చేస్తున్నాం. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్ కార్డు ద్వారా ఖచ్చితమైన బహుమతిని కస్టమర్ అందుకోవచ్చు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి బహుమతులు వీటిలో ఉన్నాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది’ అని వివరించారు. 5 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
గర్భిణులకు పోటీలు, విజేతలకు ఉచిత ప్రసవం!
సాక్షి, హైదరాబాద్: మిసెస్ మామ్ రెండో సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 8న నిర్వహించనున్నట్లు డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్లో మంగళవారం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిసెస్ మామ్‌లో పాల్గొనే గర్భిణులకు మాదాపూర్‌లోని స్నాట్ స్పోర్ట్స్‌లో డిసెంబర్ 8న సాయంత్రం గ్రాండ్ ఫినాలే పోటీలు నిర్వహిస్తామన్నారు. మిసెస్ స్మైల్, మిసెస్ ఫ్యాషనిస్టా, మిసెస్ బ్రెయిన్స్, మిసెస్ బ్యూటీఫుల్ హెయిర్, మిసెస్ ఫిట్నెస్ తదితర కేటగిరీల్లో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌లను ఎంపిక చేస్తామన్నారు. విజేతలకు ఉచిత ప్రసవంతో పాటు ఆసక్తికర బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. గర్భిణులు 8897993265 నంబర్‌కు ఫోన్ చేసి డిసెంబర్ 1లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాసంతో పాటు యోగా చేయిస్తామన్నారు. న్యూట్రిషన్లో చిట్కాలు, డెంటల్, హెల్త్ చెకప్స్, గర్భిణులు అందంగా ఎలా తయారు కావచ్చో తెలియజేయడమేగాక సాధారణ ప్రసవం కోసం వారిని సిద్ధం చేస్తామని తెలిపారు. గత ఏడాది 60 మంది మిస్ మామ్ పోటీల్లో పాల్గొనగా 40 మందికి సాధారణ ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. ప్రసవానంతరం వ్యాయమం, బేబీ కేర్, బేబీ మేకప్, మసాజ్, స్నానం, హెల్దీ కుకింగ్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నీలిమా ఆర్య, మన్సీ ఉప్పల, డాక్టర్లు సమంత, శారద, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆదెమ్మ.. అమృత హస్తమేనమ్మా
సాక్షి,కర్ణాటక, బళ్లారి : ఆరోగ్య సేవలు విస్తారంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాన్పుల విషయంలో ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి వెళ్లి అక్కడే ప్రసవించడం సర్వసాధారణమైంది. ఆస్పత్రిలో నూటికి 90 మంది సిజేరియన్ ఆపరేషన్ చేసే ప్రసవం చేస్తున్నారు. అదేమని అడిగిన బాధితులకు బిడ్డ అడ్డం తిరిగిందని లేదా మరేదో సమస్య ఉందని ప్రతి వైద్యులు ఇస్తున్న సమాధానం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుల సహాయం లేకుండా మన పూర్వీకుల నుంచి కొనసాగిస్తున్న సూలగిత్తి పద్ధతిని నేటికీ పల్లెల్లోనే కాదు నగరంలో కూడా కొనసాగిస్తూ ఎందరో గర్భిణులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సుఖమయంగా ప్రసవం చేస్తున్న ఓ సూలగిత్తి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. బళ్లారితో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్నూలు జిల్లా హాలహర్వి ప్రజలు తమ బిడ్డల కాన్పుల కోసం హెచ్.ఆదెమ్మపైనే ఆధారపడ్డారు. అత్యంత సులభంగా కాన్పులు చేయడంలో నేర్పరితనం ఆమె సొంతం. అందుకే ఈమె చేతి గుణంపై ప్రజలకు అపారమైన నమ్మకం. అందుకే ఆదెమ్మ ఎక్కడున్నా మరీ వెతుక్కొని వెళతారు. పూర్వం నుంచి ఎంతో ఆదరణ పూర్వం నుంచి ఇప్పటికీ మారు మూల పల్లెల్లో ఎద్దుల బండిలో ఈమెను ఆధారంగా తీసుకొచ్చే వారు. ప్రస్తుతం కొందరు కారులో ఆమెను తీసుకెళ్తుంటారు. 80 ఏళ్ల ఆదెమ్మ ఇప్పటికీ చెరగని, తరగని ఉత్సాహంతో కాన్పులు చేయడానికి శ్రమిస్తారు. ఇప్పటి వరకు 5 వేలకు పైగా ప్రసవాలు చేసిన ఘనత ఆమెది. కొన్ని కుటుంబాలు మూడు తరాలుగా ఈమె హస్తగుణాన్ని నమ్మారంటే ఈ మహాతల్లికి ఉన్న నైపుణ్యం అర్థమవుతోంది. బళ్లారి తాలూకా హంద్యాళ గ్రామానికి చెందిన ఆదెమ్మకు మాతృమూర్తి పార్వతమ్మే గురువు. పెళ్లి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లోని హాలహర్వికి వెళ్లిన ఆదెమ్మ అక్కడ ఎన్నో కాన్పులు చేశారు. ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయా పని లభించిందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈమె సేవ ఎంతటి ఘనత సాధించిందో అర్థమవుతోంది. అనంతరం ఆ పనికి స్వస్తి చెప్పి కుటుంబంతో స్థిరపడ్డారు. కాన్పు ఎప్పుడవుతుందో చెప్పగల దిట్ట నాడి ఇలా పట్టుకొని కాన్పు ఎప్పుడు అవుతుందో చెప్పడంలో ఈమెకు ఉన్న అనుభవం అపారం. కాన్పు కష్టకరమవుతుందని ఈమె అనుకుంటే తక్షణమే ఆస్పత్రికి తరలిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు లేక ముఖ్యమైన పనిలో ఉన్నా కూడా కాన్పులు చేయడానికి మాత్రం సదా సిద్ధమంటూరు ఆదెమ్మ. పూర్వం మహిళలు చాలా గట్టితనంతో ఉండేవారు. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా సునాయాసంగా ప్రసవాలు జరిగేవి అప్పట్లో. ఇప్పటి మహిళలకు పురిటి నొప్పులను తట్టుకునే ఓర్పు, నేర్పు వారికి లేవని, తన వల్ల ఇప్పటి వరకు ఏ తల్లీబిడ్డ ప్రాణానికి ముప్పు కలగలేదని విశ్వాసంగా చెబుతారు. 2011లో అప్పటి జిల్లా ఇన్చార్జ్, పర్యాటక శాఖా మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి ఈమె సేవలను గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించడం విశేషం. అయినా ఇంతటి ఉత్తమ సమాజ సేవలను అందిస్తున్నా ఈమెకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇతర సౌకర్యాలు కానీ అందకపోవడం విచారకరం. -
ఈ-కామర్స్‌తో ఆప్కోలో రూ. అరకోటి వ్యాపారం!
సాక్షి, హైదరాబాద్: ఆప్కో ఈ-కామర్స్‌కు అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఆన్లైన్ ద్వారా ఇప్పటివరకు రూ. అరకోటి విలువైన వస్త్రాలను విక్రయించామని ఆ సంస్థ ఎండీ గౌరీశంకర్ గురువారం తెలిపారు. ‘షాప్ డాట్ ఆప్కో ఫ్యాబ్రిక్స్ డాట్ కామ్’ ద్వారా 30 శాతం రాయితీతో వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు. దేశీయంగా ఉచిత డెలివరీ సదుపాయం ఉందన్నారు. ఆప్కో వస్త్రాలకు దేశీయంగానే కాకుండా ఏకంగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియాల నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,200 ఆర్డర్స్‌ను డెలివరీ చేశామని వివరించారు. ఆన్లైన్లో ఆప్కో ఉత్పత్తులను లక్షన్నర మంది పరిశీలించారని, ఈ-కామర్స్ పేజీని 5 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. ఎక్కువ మంది చీరాల నిఫ్ట్ డిజైన్‌ను పరిశీలించారన్నారు. కేవలం రూ.30 వేలతో ఏర్పాటు చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో ఆప్కో వస్త్రాలకు మరింత డిమాండ్ పెరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.