Free water supply
-
బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మహారాష్ట్రలో ప్రతి ఇంటికి నీళ్లు
-
తుది గడువు పంద్రాగస్టుకే.. గ్రేటర్ వాసులూ జాగ్రత్త పడండి!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఉచిత నీటిసరఫరా పథకానికి ఆధార్ నంబరును అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు ఈ నెల 15తో ముగియనుంది. మహానగర వ్యాప్తంగా సుమారు 10.80 లక్షల నల్లా కనెక్షన్లుండగా.. ఇప్పటివరకు సుమారు 5.5 లక్షల మంది తమ నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్‌ను జత చేసుకున్నారు. మరో 4.5 లక్షల మంది ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో సదరు వినియోగదారులకు ఏకంగా తొమ్మిది నెలల నీటిబిల్లు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.600 నీటి బిల్లు చెల్లించేవారు ఏకంగా రూ.5,400 ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. వీరే అత్యధికం.. నగరంలో అత్యధికంగా అపార్ట్మెంట్ వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రతీ అపార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్స్ యజమానులు అనుసంధానం చేసుకోవాల్సిందే. ఎవరైతే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారు నీటిబిల్లులు చెల్లించాల్సి వస్తుందని జలమండలి స్పష్టం చేసింది. నగరంలోని మురికి వాడల్లో (స్లమ్స్)ని నల్లా వినియోగదారులకు జలమండలి సిబ్బంది వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. మిగతా గృహ వినియోగదారులు హైదరాబాద్ వాటర్ జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో సంప్రదించి సొంతంగా పూర్తిచేసుకోవడం లేదా సమీప మీ సేవ కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని వాటర్‌బోర్డు స్పష్టం చేసింది. గడువు పెంచినా.. మందగమనమే.. జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఫ్రీ వాటర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులందరూ తమ ఆధార్ నంబరును నల్లా కనెక్షన్‌కు జత చేసుకోవాల్సి ఉంటుంది. మురికివాడలు మినహా ప్రతి నల్లా కనెక్షన్‌కూ నీటిమీటరు తప్పనిసరి చేశారు. మీటరు ఉన్నప్పటికీ అది పనిచేయని స్థితిలో ఉంటే నీటి బిల్లు తథ్యం. ఈ ప్రక్రియకు ఇప్పటివరకు జలమండలి నాలుగుసార్లు గడువును పొడిగించినప్పటికీ పలువురు వినియోగదారులు నిర్లక్ష్యం వీడడంలేదు. అపార్ట్మెంట్ల వినియోగదారుల్లో పలువురు లాక్డౌన్, కోవిడ్ కారణంగా స్వస్థలాలకు వెళ్లడం, కొందరు విదేశాల్లో ఉండడం తదితర కారణాలన్నీ ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోకపోతుండడం గమనార్హం. ఈ నెల 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జలమండలి వర్గాలు వినియోగదారులకు విజ్ఙప్తి చేస్తున్నాయి. ప్రతి నల్లాకూ నీటిమీటరును ఏర్పాటు చేసుకోవడంతో పాటు అది పనిచేసే స్థితిలో ఉందో తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నాయి. -
తాగునీరు ఫ్రీ.. మే లేదా జూన్ నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 142 నగరాలు, పట్టణాల్లో ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికీ నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విష యం తెలిసిందే. రాష్ట్రంలోని మిగిలిన పురపాలికల్లో సైతం ఈ పథకాన్ని భవిష్యత్తులో అమలు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని ఇంటింటికీ నెలకు 20 వేల లీటర్ల లోపు తాగునీటిని ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులతో పాటు విధివిధానాలను సైతం జారీ చేసింది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో గ్రేటర్ వరంగల్, ఖమ్మం సహా తొమ్మిది పురపాలికలకు మలి విడత ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ ఎన్నికలు ముగిశాక జీహెచ్ఎంసీ తరహా.. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశాలున్నట్లు పురపాలక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటికి సంబం ధించిన ఎన్నికల మేని ఫెస్టోలో ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారుల్లో చర్చ జరుగుతోంది. వచ్చే మే లేదా జూన్ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నామ మాత్రమే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో విధంగా నల్లా చార్జీలను వసూలు చేస్తున్నారు. చాలా మున్సిపాలిటీల్లో నెలకు రూ.100 నల్లా చార్జీలు విధిస్తున్నారు. కొన్ని చిన్న పట్టణాల్లో నెలకు రూ.40, రూ.50, రూ.60 మాత్రమే వసూలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పెద్ద మున్సిపాలిటీల్లో రూ.150 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మినహాయిస్తే, రాష్ట్రంలోని 142 పురపాలికల్లో ఏటా రూ.60 కోట్ల నల్లా చార్జీలు వసూలు కావాల్సి ఉండగా, రూ.30 కోట్లలోపే వసూలు అవుతున్నాయి. తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ, మరమ్మతులు, ఇంటింటికి నీటి సరఫరా కోసం ఏటా రూ.600 కోట్లకు పైగా నిధులను పురపాలికలు ఖర్చు చేస్తున్నాయి. నల్లా చార్జీలు, నీటి సరఫరా ఖర్చుకు మధ్య లోటును రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల రూపంలో ఇచ్చే నిధులతో పూడ్చుకుంటున్నాయి. అన్ని పట్టణాల్లో గృహాలకు ఉచిత తాగునీటిని సరఫరా చేస్తే, ఇందుకు సంబంధించిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుండటంతో పురపాలికలకు కొంత వరకు నష్టాలను పూడ్చుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 10 లక్షల గృహాలకు లబ్ధి.. జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని ఇతర పాత 72 పురపాలికల్లో 6 లక్షలకు పైగా అధికారిక నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో మొత్తం పురపాలికల సంఖ్య 142కు పెరిగింది. కొత్త, పాత మున్సిపాలిటీలు కలుపుకొని మొత్తం అధికారిక నల్లాల కనెక్షన్ల సంఖ్య 10 లక్షల వరకు ఉంటుందని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అనుమతి లేని మరో 10 లక్షల అక్రమ నల్లా కనెక్షన్లు పురపాలికల్లో ఉంటాయని అంచనా. వీటిని క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్షేత్ర స్థాయిలో రాజకీయ జోక్యంతో సాధ్యం కావట్లేదు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ఉచిత తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తే 10 లక్షలకు పైగా గృహాలకు లబ్ధి కలుగుతుంది. అనధికార కనెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 20 లక్షలకు పెరగనుందని అధికారులు చెబుతున్నారు. -
ఇక హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్.. అయితే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో నల్లా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మున్సిపల్ పరిపాలన శాఖ తాజాగా (జి.ఓ.ఎం.ఎస్.నెం.211) ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. నగరంలో జలమండలి పరిధిలో ఉచిత నల్లా నీటి సరఫరా పొందే గృహ వినియోగ నల్లాలు 9,84,940 ఉన్నాయి. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.153.65 కోట్ల నల్లా బిల్లుల భారం నుంచి గ్రేటర్ సిటీజనులకు ఉపశమనం కలగనుంది. ఈ పథకం ద్వారా జలమండలి కోల్పోయే రెవెన్యూ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు సర్దుబాటు చేయనుంది. కాగా ఉచిత నీరు పొందే వినియోగదారులు విధిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని.. లేని పక్షంలో కనీసం ఆధార్ నమోదు అయినా చేసుకొని ఉండాలని గెజిట్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. సంబంధిత బోర్డు అధికారులు వినియోగదారుల ఆధార్ నమోదుకు సహకరించాలని సూచించింది. -
ఫ్రీ ట్యాంకర్ కట్!
సాక్షి,సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరానుజీహెచ్‌ఎంసీ డిసెంబర్ 31 నుంచినిలిపివేయనుంది. శివార్లలోని ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్పల్లి,మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా, పటాన్చెరు తదితర సర్కిళ్ల పరిధిలో జీహెచ్ఎంసీ రోజుకు దాదాపు 350 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. జలమండలి ద్వారా ట్యాంకర్లను పంపిస్తూ వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తోంది. గతంలో శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా లైన్లు లేనప్పుడు అమల్లోకి తెచ్చిన ఈ విధానం.. అక్కడ నీటి సరఫరా లైన్లు వచ్చాక కూడా నీటి సరఫరా సదుపాయం లేని కొన్ని ప్రాంతాలు, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు,మురికివాడల్లోని ప్రజల అవసరాలు తీర్చేందుకు కొనసాగిస్తున్నారు. ఖర్చు జీహెచ్ఎంసీ భరిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే, వీటిలో చాలా వరకు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒకరి పేరు చెప్పి, మరొకరికి విక్రయించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఉచిత సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జీహెచ్ఎంసీ, జలమండలి సెప్టెంబర్‌లోనే నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచే ఉచిత ట్యాంకర్లను నిలిపివేయాలనుకున్నా స్థానిక కార్పొరేటర్ల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో, ముందస్తు సమాచారం లేకుండా వెంటనే ఎలా నిలిపివేస్తారనే ప్రశ్నలతో మూడు నెలలు గడువిచ్చి, ఈ నెలాఖరుకు నిలిపివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ జలమండలి ఎండీ దానకిశోర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శివారు ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు వరకు జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. ఎక్కడైనా సరఫరా జరగని ప్రాంతాలుంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా బాధ్యతల్ని సైతం జలమండలే చూసుకుంటుందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ స్పష్టం చేశారు. ‘‘ఉచిత ట్యాంకర్ల పేరిట నిధులను స్థానిక కార్పొరేటర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉచిత ట్యాంకర్ల నీటిని హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు తదితర వ్యాపార సంస్థలకు విక్రయించుకుంటున్నారని, తిరగని ట్రిప్పులకు కూడా బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జలమండలి దాదాపు రూ.1900 కోట్ల భారీ నిధులతో పూర్తి చేసిన ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటైందని, స్లమ్స్, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, సరఫరా లేని ప్రాంతాల పేరిట నెలనెలా నిధులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.’’ -
ఉచిత తాగునీటి సరఫరా ప్రారంబించిన ఎమ్మెల్యే రోజా
-
ఇప్పుడు దేశమంతటా అదే చర్చ
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత నీటి సరఫరా మొదలుపెట్టింది. ఇపుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే చర్చ మొదలైంది. ఢిల్లీలోనే ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఉచితంగా నీరు ఇవ్వరు?అని ఇతర నగరాల ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలలో ఒక కొత్త చైతన్యం తీసుకువచ్చిందని భావిస్తున్నారు. దేశంలోని నగరాలలో ఉచిత నీటి సరఫరా సాధ్యాసాధ్యాలపై కసరత్తు మొదలైంది. హైదరాబాద్‌లో కూడా ఆ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే జలమండలి అధికారులు ఢిల్లీ వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. అయితే ఢిల్లీ, హైదరాబాద్ నగరాల పరిస్థితులను బేరీజు వేస్తూ నివేదిక రూపొందిస్తున్నారు. ఇక్కడ ఉచిత నీటి సరఫరా సాధ్యం కాదని నివేదిక తయారవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ఉచిత నీటి సరఫరా అమలు విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిల్లో 2 లక్షల వరకు పేదల కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 340 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఇందులో 45 శాతం వరకు పంపిణీ వల్ల నష్టాలు ఉన్నాయి. నల్లా కనెక్షన్లు ప్రతీ పేద కుటుంబం నుంచి నెలకు 2 వందల రూపాయల చొప్పున నీటి బిల్లు వసూలు చేస్తున్నారు. ఈ 2 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్లు ఇవ్వడం ద్వారా జలమండలిపై ఏడాదికి పడే భారం 180 నుంచి 2 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఒక వేళ ఉచిత నీరు సరఫరా చేస్తే ఆ నష్టాలను జలమండలి ఎలా పుడ్చుకుంటుందన్నది ప్రశ్న. నష్టాలను ఎలా పూడ్చుకోవాలి, అసలు హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరా సాధ్యమేనా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. జలమండలి నెలవారి ఆదాయ వ్యయాల్లో భారీ వ్యత్యాసం ఉంది. నెలకు 61 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే, ఖర్చు 91 కోట్ల రూపాయలు దాటుతోంది. అయితే ఈ నష్టాలు తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయనేది నిపుణుల సూచన. పేదల ముక్కు పిండి నీటి బిల్లు వసూలు చేస్తున్న జలమండలి బడాబాబుల నుంచి పైసా కూడా వసూలు చేయలేకపోతోంది. ఇలా పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు , షాపింగ్ మాల్స్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ల నుంచి జలమండలికి రావాల్సిన బకాయిల మొత్తం 8 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి 2 వందల కోట్ల వరకు నీటి బిల్లు బకాయిలు ఉన్నాయి. మొత్తంగా వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను జలమండలి వసూలు చేయలేకపోతోంది. ఇదిలా ఉంటే నిజాం కాలంలో వేసిన పైపు లైన్లతోనే నేటికీ నీటి నరఫరా చేస్తున్నారు. అవి పాతబడిపోయిన కారణంగా నీటి వృథా అధికంగా ఉంటోంది. నీటి పంపిణీలో నష్టానికి ఎక్కువ శాతం పైపు లైన్ల డ్యామేజీ వల్లేనని తెలుస్తోంది. నగర వాసులు జిహెచ్‌ఎమ్‌సికి చెల్లిస్తున్న ఆస్తి పన్నులోనే నీటి బిల్లు కూడా చెల్లిస్తున్నారు. దీనిలో 25 శాతం నిధులు జిహెచ్ఎమ్సి నుంచి జలమండలికి రావాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా జిహెచ్ఎమ్సి పైసా కూడా ఇవ్వడం లేదు. జిహెచ్ఎమ్సి ఏడాదికి 12 వందల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేస్తోంది. ఈ లెక్కన 25 శాతం అంటే, సుమారు ఏడాదికి 3 వందల కోట్లు జలమండలికి రావాల్సిన నిధులు రావడం లేదు. మెట్రో వాటర్ బోర్డు నెలకు 50 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తోంది . ఇదే పెద్ద భారంగా మారింది. విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా జలమండలి విద్యుత్ బిల్లులను వాణిజ్య కేటగిరిలో చేర్చడం ద్వారా యూనిట్‌కు 5 రూపాయలకుపైగా చెల్లించాల్సి వస్తోంది. అదే గృహావసరాల కేటగిరిలో చేరిస్తే జలమండలికి నెలకు 25 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి హైదరాబాద్‌లో నీటి పంపిణీ పైప్ లైన్లు - నీటి పన్ను వసూలు - జిహెచ్ఎంసి, జలమండలి మధ్య సహకారం - జలమండలి చెల్లించే విద్యుత్ చార్జీలు... అన్ని అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. వీటన్నిటిని సరిచేస్తే హైదరాబాద్‌లో కూడా ఉచితంగా నీటిని సరఫరా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. s.nagarjuna@sakshi.com -
ఉచిత నీటి సరఫరా హైదరాబాద్‌లోనూ సాధ్యమే