
కుళాయి
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత నీటి సరఫరా మొదలుపెట్టింది. ఇపుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే చర్చ మొదలైంది. ఢిల్లీలోనే ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఉచితంగా నీరు ఇవ్వరు?అని ఇతర నగరాల ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలలో ఒక కొత్త చైతన్యం తీసుకువచ్చిందని భావిస్తున్నారు. దేశంలోని నగరాలలో ఉచిత నీటి సరఫరా సాధ్యాసాధ్యాలపై కసరత్తు మొదలైంది. హైదరాబాద్‌లో కూడా ఆ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే జలమండలి అధికారులు ఢిల్లీ వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. అయితే ఢిల్లీ, హైదరాబాద్ నగరాల పరిస్థితులను బేరీజు వేస్తూ నివేదిక రూపొందిస్తున్నారు. ఇక్కడ ఉచిత నీటి సరఫరా సాధ్యం కాదని నివేదిక తయారవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ నగరంలో ఉచిత నీటి సరఫరా అమలు విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిల్లో 2 లక్షల వరకు పేదల కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 340 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఇందులో 45 శాతం వరకు పంపిణీ వల్ల నష్టాలు ఉన్నాయి. నల్లా కనెక్షన్లు ప్రతీ పేద కుటుంబం నుంచి నెలకు 2 వందల రూపాయల చొప్పున నీటి బిల్లు వసూలు చేస్తున్నారు. ఈ 2 లక్షల కుటుంబాలకు ఉచితంగా నీళ్లు ఇవ్వడం ద్వారా జలమండలిపై ఏడాదికి పడే భారం 180 నుంచి 2 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఒక వేళ ఉచిత నీరు సరఫరా చేస్తే ఆ నష్టాలను జలమండలి ఎలా పుడ్చుకుంటుందన్నది ప్రశ్న. నష్టాలను ఎలా పూడ్చుకోవాలి, అసలు హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరా సాధ్యమేనా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
జలమండలి నెలవారి ఆదాయ వ్యయాల్లో భారీ వ్యత్యాసం ఉంది. నెలకు 61 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే, ఖర్చు 91 కోట్ల రూపాయలు దాటుతోంది. అయితే ఈ నష్టాలు తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయనేది నిపుణుల సూచన. పేదల ముక్కు పిండి నీటి బిల్లు వసూలు చేస్తున్న జలమండలి బడాబాబుల నుంచి పైసా కూడా వసూలు చేయలేకపోతోంది. ఇలా పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు , షాపింగ్ మాల్స్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ల నుంచి జలమండలికి రావాల్సిన బకాయిల మొత్తం 8 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి 2 వందల కోట్ల వరకు నీటి బిల్లు బకాయిలు ఉన్నాయి. మొత్తంగా వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను జలమండలి వసూలు చేయలేకపోతోంది.
ఇదిలా ఉంటే నిజాం కాలంలో వేసిన పైపు లైన్లతోనే నేటికీ నీటి నరఫరా చేస్తున్నారు. అవి పాతబడిపోయిన కారణంగా నీటి వృథా అధికంగా ఉంటోంది. నీటి పంపిణీలో నష్టానికి ఎక్కువ శాతం పైపు లైన్ల డ్యామేజీ వల్లేనని తెలుస్తోంది. నగర వాసులు జిహెచ్‌ఎమ్‌సికి చెల్లిస్తున్న ఆస్తి పన్నులోనే నీటి బిల్లు కూడా చెల్లిస్తున్నారు. దీనిలో 25 శాతం నిధులు జిహెచ్‌ఎమ్‌సి నుంచి జలమండలికి రావాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా జిహెచ్‌ఎమ్‌సి పైసా కూడా ఇవ్వడం లేదు. జిహెచ్‌ఎమ్‌సి ఏడాదికి 12 వందల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేస్తోంది. ఈ లెక్కన 25 శాతం అంటే, సుమారు ఏడాదికి 3 వందల కోట్లు జలమండలికి రావాల్సిన నిధులు రావడం లేదు. మెట్రో వాటర్ బోర్డు నెలకు 50 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తోంది . ఇదే పెద్ద భారంగా మారింది. విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా జలమండలి విద్యుత్ బిల్లులను వాణిజ్య కేటగిరిలో చేర్చడం ద్వారా యూనిట్‌కు 5 రూపాయలకుపైగా చెల్లించాల్సి వస్తోంది. అదే గృహావసరాల కేటగిరిలో చేరిస్తే జలమండలికి నెలకు 25 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది.
వాస్తవానికి హైదరాబాద్లో నీటి పంపిణీ పైప్ లైన్లు - నీటి పన్ను వసూలు - జిహెచ్ఎంసి, జలమండలి మధ్య సహకారం - జలమండలి చెల్లించే విద్యుత్ చార్జీలు... అన్ని అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. వీటన్నిటిని సరిచేస్తే హైదరాబాద్లో కూడా ఉచితంగా నీటిని సరఫరా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
s.nagarjuna@sakshi.com