
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో నల్లా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మున్సిపల్ పరిపాలన శాఖ తాజాగా (జి.ఓ.ఎం.ఎస్.నెం.211) ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. నగరంలో జలమండలి పరిధిలో ఉచిత నల్లా నీటి సరఫరా పొందే గృహ వినియోగ నల్లాలు 9,84,940 ఉన్నాయి. ఉచిత సరఫరా ద్వారా ఏటా రూ.153.65 కోట్ల నల్లా బిల్లుల భారం నుంచి గ్రేటర్ సిటీజనులకు ఉపశమనం కలగనుంది. ఈ పథకం ద్వారా జలమండలి కోల్పోయే రెవెన్యూ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు సర్దుబాటు చేయనుంది. కాగా ఉచిత నీరు పొందే వినియోగదారులు విధిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని.. లేని పక్షంలో కనీసం ఆధార్ నమోదు అయినా చేసుకొని ఉండాలని గెజిట్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. సంబంధిత బోర్డు అధికారులు వినియోగదారుల ఆధార్ నమోదుకు సహకరించాలని సూచించింది.