'ఫ్రీడం 251 మొబైల్స్ పథకం మోసం'
న్యూఢిల్లీ: ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ పథకం మోసమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్ తివారీ ఆరోపించారు. బీజేపీ పాలనలో ఈ పథకం పేరిట పెద్ద కుంభకోణం జరగబోతుందని శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం మేకిన్ ఇండియా పేరిట మేకిన్ ఫ్రాడ్‌కు పాల్పడుతుందని జీరో అవర్ లో ప్రమోద్ తివారీ ధ్వజమెత్తారు. ఫ్రీడం ఫోన్ ఆవిష్కరణలో బీజేపీ నేతలు పాల్గొనడాన్ని తప్పుబట్టారు. 'ఇప్పటికే ఆరు కోట్ల బుకింగ్స్ జరిగాయి. వీటి ద్వారా కొన్ని కోట్ల రూపాయాలు సేకరించారు. ఈ మొబైల్ తయారికీ రూ.1400 లు వ్యయం అవుతుందని స్వయాన కంపెనీ డైరక్టరే చెబుతున్నారు. ఇవే ఫీచర్స్ ఉన్న స్మార్ట్ఫోన్లను బహిరంగ మార్కెట్లో రూ.20 వేలు నుంచి 30 వేలకు విక్రయిస్తుంటే స్మార్ట్‌ఫోన్ ను రూ.251 లకే ఎలా ఇస్తారు' అని సర్కార్‌ను ప్రశ్నించారు. ధరల విషయంలో రింగింగ్ బెల్స్ సంస్థ లేదా మిగిలిన సంస్థలు మోసం చేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని తివారీ డిమాండ్ చేశారు.