Freestyle wrestling
-
World Wrestling Championships 2022: భళా బజరంగ్...
బెల్గ్రేడ్ (సెర్బియా): అందివచ్చిన పతకావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ఆదివారం జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు. వాజ్జెన్తో జరిగిన మ్యాచ్‌లో ఒకదశలో బజరంగ్ 1–4తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. అనంతరం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో బజరంగ్ 11–9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. రివెరాతో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే బజరంగ్ 0–6తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న ఈ హరియాణా రెజ్లర్ ఆరు పాయింట్లు గెలిచి తొలి భాగం ముగిసేసరికి 6–6తో సమంగా నిలిచాడు. రెండో భాగం ఆరంభంలో బజరంగ్ మళ్లీ మూడు పాయింట్లు కోల్పోయి 6–9తో మళ్లీ వెనుకబడ్డాడు. అయినా ఆందోళన చెందని బజరంగ్ ఉడుంపట్టుతో మెరిసి 2, 2 పాయింట్లు సాధించి 10–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో ప్యూర్టోరికో రెజ్లర్ రివ్యూకు వెళ్లడం, దానిని అతను కోల్పోవడంతో భారత రెజ్లర్‌కు అదనంగా మరో పాయింట్ లభించింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో క్యూబా రెజ్లర్ అలెజాంద్రో వాల్డెస్తో పోటీపడుతున్న సమయంలో బజరంగ్ తలకు గాయమైంది. అయినా కట్టు కట్టుకొని ఆడిన బజరంగ్ తొలి రౌండ్లో 5–4తో వాల్డెస్ను ఓడించాడు. ఆ తర్వాత తలకు గాయంతోనే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లలో పోటీపడి చివరకు కాంస్య పతకం సాధించాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. -
World Wrestling Championships: కాంస్యం రేసులో బజరంగ్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో భారత స్టార్ రెజర్ల్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బజరంగ్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 0–10తో జాన్ మైకేల్ డియాకొమిహాలిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్ ప్రిక్వా ర్టర్ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)పై గెలుపొందాడు. బజరంగ్‌ను ఓడించిన జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బజరంగ్‌కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా), వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో బజరంగ్ తలపడతాడు. ఈ బౌట్లో బజరంగ్ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్ యూనస్ అలీఅక్బర్ (ఇరాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సాగర్ 0–6తో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది. -
World Wrestling Championships: నవీన్‌కు నిరాశ
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్ 70 కేజీల విభాగంలో నవీన్ త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. ఎర్నాజర్ అక్మతలియెవ్ (కిర్గిజిస్తాన్)తో శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్లో నవీన్ 1–4 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్ ఆరంభంలో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన నవీన్ ఆ తర్వాత రెండు పాయింట్లు సమర్పించుకున్నాడు. రెండో రౌండ్లో మరో రెండు పాయింట్లు కోల్పోయిన నవీన్ తేరుకోలేకపోయాడు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో పోటీపడిన నవీన్ స్వర్ణ పతకం సాధించాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 70 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లో 1–6తో తైషి నరుకుని (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తైషి నరుకుని ఫైనల్ చేరుకోవడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం నవీన్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో నవీన్ 11–3తో సిర్బాజ్ తల్గాట్ (కజకిస్తాన్)పై నెగ్గిన నవీన్‌కు రెండో రౌండ్లో ఇలియాస్ బెక్బులతోవ్ (ఉజ్బెకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. దాంతో నవీన్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. అనూహ్య ఫలితం... మరోవైపు భారత్‌కు కచ్చితంగా పతకం అందిస్తాడని ఆశించిన స్టార్ రెజ్లర్ రవి కుమార్ రిక్త హస్తాలతో స్వదేశానికి రానున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం రష్యాలో ప్రత్యేక శిక్షణ పొందిన రవి కుమార్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్లో 10–0తో మరియన్ కొవాక్స్ (రొమేనియా)పై గెలిచిన రవి ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–10తో గులామ్జాన్ అబ్దులయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలోఓడిపోయాడు. అబ్దులయెవ్ ఫైనల్ చేరుకొని ఉంటే ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం రవి కుమార్‌కు కనీసం కాంస్యం కోసం పోటీపడేందుకు మరో అవకాశం లభించేది. కానీ అబ్దులయెవ్ క్వార్టర్ ఫైనల్లో 2–13తో జెలీమ్ఖాన్ అబకరోవ్ (అల్బేనియా) చేతిలో ఓడిపోవడంతో రవి పతకం ఆశలు ఆవిరయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన రవి గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు. 2020, 2021, 2022 ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన రవి ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకం గెలిచాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. 74 కేజీల విభాగంలో సాగర్ జగ్లాన్ క్వార్టర్ ఫైనల్లో 0–5తో కైల్ డగ్లస్ డేక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. కైల్ ఫైనల్ చేరుకోవడంతో సాగర్ నేడు కాంస్య పతకం కోసం బరిలో నిలిచాడు. రెండు బౌట్లలో సాగర్ గెలిస్తే అతనికి కాంస్యం లభిస్తుంది. -
రవి దహియా కొత్త చరిత్ర
ఉలాన్బాటర్ (మంగోలియా): భారత రెజ్లర్ రవి కుమార్ దహియా కొత్త చరిత్ర లిఖించాడు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో 24 ఏళ్ల రవి దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన తొలి భారతీయ రెజ్లర్‌గానూ ఘనత వహించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్ కల్జాన్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు. శనివారం ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓవరాల్‌గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు), గౌరవ్ బలియాన్ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్ కాంస్య పతకాలు గెలిచారు. -
జై బజరంగ్ భళి...
శీతాకాలం... తెల్లవారుజాము 2 గంటలకు ఎముకలు కొరికే చలిలో... ఓ 11 ఏళ్ల బాలుడు ఇంట్లో దిండ్లను వరుస పెట్టి దుప్పటి కప్పి తాను పడుకున్నట్లు చేసి అఖాడాకు వెళ్లేవాడు. ఉదయం అమ్మ అడిగితే 4 గంటల తర్వాతే వెళ్లానని చెప్పేవాడు. తనయుడు ఎప్పుడు వెళ్లాడో తల్లికి తెలుసు! అయినా కొడుకు ఆసక్తికి అడ్డుచెప్పకూడదని ఆ మాతృమూర్తి నిర్ణయించుకుంది. అక్కడ సీన్ కట్ చేసి టోక్యోలో చూస్తే ఆ బాలుడు బజరంగ్ పూనియా అయ్యాడు. రెజ్లింగ్ బరిలో కాంస్యం గెలిచాడు. టోక్యో: ‘పసిడి’ పతకానికి దూరమైనా... తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ 8–0తో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. తద్వారా 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో నియాజ్బెకోవ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హాజీ అలియెవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో లెగ్ డిఫెన్స్ బలహీనత, కౌంటర్ ఎటాక్‌లో తడబడి పాయింట్లు చేజార్చుకున్న బజరంగ్ ఈ బౌట్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. నియాజ్‌బెకోవ్‌కు ఏదశలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. దాంతో నియాజ్బెకోవ్ చివరకు ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఓటమి చవిచూశాడు. హరియాణకు చెందిన 27 ఏళ్ల బజరంగ్ తన కెరీర్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు (రజతం, 2 కాంస్యాలు), ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), ఆసియా క్రీడల్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం), కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం) సాధించాడు. బజరంగ్ బాహువుల్లోనో లేదంటే పిడికిలిలోనో రెజ్లింగ్ లేదు. అతని రక్తంలోనే మల్లయుద్ధం వుంది. ఎందుకంటే తన తండ్రి, సోదరుడు కూడా దంగల్ వీరులే! ఈ కుస్తీపట్లే నరనరాన జీర్ణించుకున్న బజరంగ్ తాజాగా ఒలింపిక్ పతకం పట్టాడు. అన్నట్లు ఇతనికి ఒలింపిక్ పతకం కొత్తేమో కానీ ఈ నంబర్‌వన్ (65 కేజీల కేటగిరీ) రెజ్లర్ ఖాతాలో ప్రపంచ, ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గేమ్స్ స్వర్ణాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు సిసలు సత్తాచాటాల్సిన చోట స్వర్ణ, రజతాలు చేజార్చుకున్నాడేమో కానీ పతకం లేకుండా ఉత్తచేతులతో రాలేదు. కాంస్యం పోరు లో విజేయుడిగా నిలిచాడు. 34 కేజీల బరువుతో 60 కేజీల విభాగంలో... మచ్రోలి గ్రామంలో 2008లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు బజరంగ్ వెళ్లాడు. కానీ 34 కిలోల బరువున్న అతన్ని 60 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు నిర్వాహకులు నిరాకరించారు. ఎలాగోలా అతని అన్న హరిందర్ నచ్చచెప్పడంతో ఆర్గనైజర్లు అంగీకరించారు. అపుడు దంగల్‌లో దిగిన బజరంగ్ తనకంటే ఎక్కువ బరువున్న రెజ్లర్ ఓడించడం అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కుర్రాడి బాహువు బలం తెలిసిన కోచ్ ఆర్య వీరేందర్ మల్లయుద్ధంలో బజరంగ్ పూనియాను తీర్చిదిద్దాడు. అదే ఏడాది తండ్రి బల్వాన్ సింగ్ తనయుడిని ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో చేర్పించాడు. అక్కడ అందరు మేటి రెజ్లర్లే ఉండటంతో వారితో తలపడిన బజరంగ్ రెండేళ్లకే ఆసియా క్యాడెట్ చాంపియన్ అయ్యాడు. మరుసటి ఏడాది (2011) దాన్ని నిలబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి ఇక వెనుదిరిగి చూడకుండా ఇంటాబయటా పతకాల పట్టు పట్టేవాడు. 2018లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను సాధించిన రజతం బజరంగ్‌ను ఒలింపిక్ మెడలిస్ట్‌ల జాబితాలో చేర్చింది. యోగేశ్వర్ దత్ కిటుకులు... ఛత్రశాల్ స్టేడియం చేసిన మేలు, మెరుగైన తీరు అంతా ఇంతా కాదు. అక్కడ ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాహచర్యం... బజరంగ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం... అంతర్జాతీయ పోటీల్లో అసాధారణ రెజ్లర్‌గా, పతకాల విజేతగా నిలబెట్టాయి. యోగేశ్వర్ రాజకీయాల్లోకి వెళ్లాక భారత రెజ్లింగ్ సమాఖ్య బజరంగ్‌కు వ్యక్తిగత కోచ్‌గా జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ను నియమించింది. ఇతని వల్ల విదేశీ రెజ్లర్లతో చేసిన ప్రాక్టీస్ బజరంగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ పతక విజేతగా మార్చింది. తల్లి ప్రోత్సాహం... బజరంగ్ తల్లి ఓంప్యారీకి 11 ఏళ్ల తనయుడి అడుగులు ఎటువైపో తెలుసు. అందుకే తెల్లారుజామునే వెళ్తున్నా... ఉదయం లేచాక అబద్ధం చెబుతున్నా... మిన్నకుండిపోయింది. అయితే ఒక విషయం మాత్రం మాతృమూర్తి గట్టిగా చెప్పేది. ‘ఓడినంత మాత్రాన ఏడవొద్దు. ప్రత్యర్థుల ముందు పలుచనవ్వొద్దు. ఓటములను గెలిచేందుకు మెట్లుగా మలచుకోవాలి’ అని! ఈ మాట బాగా వంటబట్టించుకున్న బజరంగ్ చదువులో వెనుకబడినా... దంగల్‌లో మట్టికరిచినా... ఎప్పుడు కన్నీరు కార్చలేదు. అమ్మ అన్నట్లే ప్రతి ఓటమిని గెలుపు మలుపుగా చేసుకున్నాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింహాబలుళ్లను ఓడించే శక్తి తన తల్లి మాటల ద్వారానే సంపాదించుకున్నాడు. -
Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మూడో ఒలింపిక్ పతకం సాధించాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి టోర్నమెంట్ అయిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ టోర్నీ మే 6 నుంచి 9 వరకు బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతుంది. ► 74 కేజీల విభాగంలో భారత్ తరఫున ఆసియా మాజీ చాంపియన్ అమిత్ ధన్కర్ బరిలోకి దిగనున్నాడు. మార్చి 16న నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ టోర్నీకి పూర్తిస్థాయి ఫిట్నెస్ లేని కారణంగా సుశీల్ కుమార్ దూరంగా ఉన్నాడు. ఆ ట్రయల్స్ టోర్నీలో 74 కేజీల విభాగంలో సందీప్ సింగ్ మాన్ విజేతగా నిలువగా... అమిత్ ధన్కర్ రన్నరప్‌గా నిలిచాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల ప్రకారం ఒలింపిక్ బెర్త్ సాధించిన రెజ్లరే ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీకి సుశీల్ ఎంపిక కాకపోవడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 37 ఏళ్ల సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం (66 కేజీలు), 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం (66 కేజీలు) సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సుశీల్‌కు పోటీపడే అవకాశం రాలేదు. ‘ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. జట్టు ఎంపిక గురించి నేను డబ్ల్యూఎఫ్ఐతో ఇంకా మాట్లాడలేదు. త్వరలోనే ఈ విషయంపై వారితో చర్చిస్తాను’ అని సుశీల్ వ్యాఖ్యానించాడు. ► ట్రయల్స్ టోర్నీ విజేతగా నిలిచిన సందీప్ సింగ్‌ను కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి, ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేశారు. అయితే ఈ రెండు టోర్నీలలో సందీప్ సింగ్ విఫలమయ్యాడు. దాంతో వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం సందీప్ సింగ్‌ను పక్కనబెట్టి సెలక్షన్ టోర్నీ రన్నరప్ అమిత్ ధనకర్‌కు ఎంపిక చేశారు. ►వాస్తవానికి వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భావించింది. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా శిక్షణ శిబిరాలు మూతబడ్డాయి. దాంతో ట్రయల్స్ లేకుండానే తొలి ట్రయల్స్ టోర్నీ ఆధారంగా అమిత్‌కు అవకాశం ఇచ్చారు. ►74 కేజీల విభాగంలో మరో స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ట్రయల్స్ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోవడంతో అతను కూడా టోక్యో ఒలింపిక్స్ అవకాశాలు కోల్పోయాడు. ►ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఇప్పటికే మూడు ఒలింపిక్ బెర్త్‌లు (రవి–57 కేజలు; బజరంగ్–65 కేజీలు; దీపక్ పూనియా–86 కేజీలు) ఖరారయ్యాయి. మరో మూడు బెర్త్‌లు (74 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) మిగిలి ఉన్నాయి. 97 కేజీల విభాగంలో సత్యవర్త్... 125 కేజీల విభాగంలో సుమిత్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ లో పోటీపడనున్నారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు ఖాయమవుతాయి. ►వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత గ్రీకో రోమన్ పురుషుల జట్టును కూడా ప్రకటించారు. సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ కుమార్ (130 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ►మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు ఒలింపిక్ బెర్త్‌ల కోసం సీమా (50 కేజీలు)... నిషా (68 కేజీలు)... పూజా (76 కేజీలు) పోటీపడతారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ క్లీన్‌స్వీప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ పోటీల్లోని గ్రీకో రోమన్ కేటగిరిలో అందుబాటులో ఉన్న ఏడు స్వర్ణ పతకాలనూ సొంతం చేసుకొని టీమ్ చాంపియన్‌షిప్‌ను సాధించారు. గౌరవ్ శర్మ (55 కేజీలు), రవీందర్ సింగ్ (60 కేజీలు), ఆనంద్ (66 కేజీలు), రాజ్బీర్ చికారా (74 కేజీలు), మనోజ్ (84 కేజీలు), హర్దీప్ (96 కేజీలు), నవీన్ (120 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ భారత్‌కు టీమ్ టైటిల్ దక్కింది. ఓవరాల్‌గా భారత్‌కు 38 పతకాలు వచ్చాయి.