బెల్‌గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో భారత స్టార్ రెజర్ల్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బజరంగ్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 0–10తో జాన్ మైకేల్ డియాకొమిహాలిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్ ప్రిక్వా ర్టర్ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)పై గెలుపొందాడు.
బజరంగ్‌ను ఓడించిన జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బజరంగ్‌కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్‌జెన్ తెవాన్యన్ (అర్మేనియా), వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్’ తొలి రౌండ్‌లో బజరంగ్ తలపడతాడు. ఈ బౌట్‌లో బజరంగ్ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు.
మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్ యూనస్ అలీఅక్బర్ (ఇరాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్‌లో సాగర్ 0–6తో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్ (61 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment