Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి | Wrestler Sushil Kumar left out of Olympic qualifier | Sakshi
Sakshi News home page

Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి

Published Fri, Apr 23 2021 5:10 AM | Last Updated on Fri, Apr 23 2021 10:10 AM

Wrestler Sushil Kumar left out of Olympic qualifier - Sakshi

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు, స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ మూడో ఒలింపిక్‌ పతకం సాధించాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి టోర్నమెంట్‌ అయిన వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ జట్టును గురువారం ప్రకటించారు. ఈ టోర్నీ మే 6 నుంచి 9 వరకు బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతుంది.  

► 74 కేజీల విభాగంలో భారత్‌ తరఫున ఆసియా మాజీ చాంపియన్‌ అమిత్‌ ధన్‌కర్‌ బరిలోకి దిగనున్నాడు. మార్చి 16న నిర్వహించిన సెలక్షన్‌ ట్రయల్స్‌ టోర్నీకి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ లేని కారణంగా సుశీల్‌ కుమార్‌ దూరంగా ఉన్నాడు. ఆ ట్రయల్స్‌ టోర్నీలో 74 కేజీల విభాగంలో సందీప్‌ సింగ్‌ మాన్‌ విజేతగా నిలువగా... అమిత్‌ ధన్‌కర్‌ రన్నరప్‌గా నిలిచాడు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిబంధనల ప్రకారం ఒలింపిక్‌ బెర్త్‌ సాధించిన రెజ్లరే ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు.

చివరి క్వాలిఫయింగ్‌ టోర్నీకి సుశీల్‌ ఎంపిక కాకపోవడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 37 ఏళ్ల సుశీల్‌ కుమార్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం (66 కేజీలు), 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం (66 కేజీలు) సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సుశీల్‌కు పోటీపడే అవకాశం రాలేదు. ‘ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. జట్టు ఎంపిక గురించి నేను డబ్ల్యూఎఫ్‌ఐతో ఇంకా మాట్లాడలేదు. త్వరలోనే ఈ విషయంపై వారితో చర్చిస్తాను’ అని సుశీల్‌ వ్యాఖ్యానించాడు.  

► ట్రయల్స్‌ టోర్నీ విజేతగా నిలిచిన సందీప్‌ సింగ్‌ను కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి, ఆసియా చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపిక చేశారు. అయితే ఈ రెండు టోర్నీలలో సందీప్‌ సింగ్‌ విఫలమయ్యాడు. దాంతో వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ కోసం సందీప్‌ సింగ్‌ను పక్కనబెట్టి సెలక్షన్‌ టోర్నీ రన్నరప్‌ అమిత్‌ ధనకర్‌కు ఎంపిక చేశారు.  

►వాస్తవానికి వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ కోసం మళ్లీ ట్రయల్స్‌ నిర్వహించాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) భావించింది. అయితే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా శిక్షణ శిబిరాలు మూతబడ్డాయి. దాంతో ట్రయల్స్‌ లేకుండానే తొలి ట్రయల్స్‌ టోర్నీ ఆధారంగా అమిత్‌కు అవకాశం ఇచ్చారు.  

►74 కేజీల విభాగంలో మరో స్టార్‌ రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ ట్రయల్స్‌ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోవడంతో అతను కూడా టోక్యో ఒలింపిక్స్‌ అవకాశాలు కోల్పోయాడు.  

►ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌కు ఇప్పటికే మూడు ఒలింపిక్‌ బెర్త్‌లు (రవి–57 కేజలు; బజరంగ్‌–65 కేజీలు; దీపక్‌ పూనియా–86 కేజీలు) ఖరారయ్యాయి. మరో మూడు బెర్త్‌లు (74 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) మిగిలి ఉన్నాయి. 97 కేజీల విభాగంలో సత్యవర్త్‌... 125 కేజీల విభాగంలో సుమిత్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ లో పోటీపడనున్నారు. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన వారికి ఒలింపిక్‌ బెర్త్‌లు ఖాయమవుతాయి.  

►వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత గ్రీకో రోమన్‌ పురుషుల జట్టును కూడా ప్రకటించారు. సచిన్‌ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (77 కేజీలు), సునీల్‌ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్‌ కుమార్‌ (130 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.   

►మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో మూడు ఒలింపిక్‌ బెర్త్‌ల కోసం సీమా (50 కేజీలు)... నిషా (68 కేజీలు)... పూజా (76 కేజీలు) పోటీపడతారు. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన వారికి ఒలింపిక్‌ బెర్త్‌లు లభిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement