న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యం, విపరీత ధోరణితో వ్యవహరించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే సంజాయిషీ కోరుతూ ఆమెతో పాటు మరో రెజ్లర్ సోనమ్ మాలిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టోక్యో విశ్వక్రీడల్లో వినేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడింది. హంగేరి శిక్షణకు వెళ్లిన ఆమె అక్కడి నుంచే నేరుగా టోక్యోకు వచ్చింది. కానీ భారత జట్టు క్రీడాకారులు బస చేసిన క్రీడా గ్రామంలో ఉండకుండా వెలుపల తన హంగేరి కోచ్, సహాయకులతో బస చేసింది. భారత ఇతర మహిళా రెజ్లర్లు సోనమ్, సీమా, అన్షు భారత్ నుంచి టోక్యోకు రావడంతో వారి నుంచి తనకు కరోనా సోకే ప్రమాదం ఉండవచ్చని భావిస్తూ వినేశ్ వారితో కలిసి ఉండేందుకు, కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నిరాకరించింది.
ఒలింపిక్స్ రెజ్లింగ్ బౌట్‌లలో టీమిండియా అధికారిక ‘శివ్ నరేశ్’ టీమ్ జెర్సీలను కాదని వినేశ్ నైకీ జెర్సీలను ధరించి బరిలోకి దిగింది. ఆమె విపరీత పోకడ, క్రమశిక్షణ రాహిత్యం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కఠిన చర్యలు చేపట్టింది. ‘ఫొగాట్ తన ప్రవర్తనతో తీవ్రస్థాయిలో క్రమశిక్షణను ఉల్లంఘించింది. అందుకే తాత్కాలిక నిషేధం విధించాం. ఇపుడామె ఎలాంటి రెజ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీల్లేదు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు కూడా పంపాం. సంజాయిషీ ఇచ్చేందుకు ఈ నెల 16లోగా గడువిచ్చాం’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment