బెల్‌గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్ 70 కేజీల విభాగంలో నవీన్ త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. ఎర్నాజర్ అక్మతలియెవ్ (కిర్గిజిస్తాన్)తో శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్‌లో నవీన్ 1–4 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్ ఆరంభంలో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన నవీన్ ఆ తర్వాత రెండు పాయింట్లు సమర్పించుకున్నాడు. రెండో రౌండ్‌లో మరో రెండు పాయింట్లు కోల్పోయిన నవీన్ తేరుకోలేకపోయాడు.
ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో పోటీపడిన నవీన్ స్వర్ణ పతకం సాధించాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 70 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్‌లో 1–6తో తైషి నరుకుని (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తైషి నరుకుని ఫైనల్ చేరుకోవడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం నవీన్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి రౌండ్‌లో నవీన్ 11–3తో సిర్బాజ్ తల్గాట్ (కజకిస్తాన్)పై నెగ్గిన నవీన్‌కు రెండో రౌండ్‌లో ఇలియాస్ బెక్బులతోవ్ (ఉజ్బెకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. దాంతో నవీన్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు.
అనూహ్య ఫలితం...
మరోవైపు భారత్‌కు కచ్చితంగా పతకం అందిస్తాడని ఆశించిన స్టార్ రెజ్లర్ రవి కుమార్ రిక్త హస్తాలతో స్వదేశానికి రానున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం రష్యాలో ప్రత్యేక శిక్షణ పొందిన రవి కుమార్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో 10–0తో మరియన్ కొవాక్స్ (రొమేనియా)పై గెలిచిన రవి ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–10తో గులామ్‌జాన్ అబ్దులయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలోఓడిపోయాడు. అబ్దులయెవ్ ఫైనల్ చేరుకొని ఉంటే ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం రవి కుమార్‌కు కనీసం కాంస్యం కోసం పోటీపడేందుకు మరో అవకాశం లభించేది. కానీ అబ్దులయెవ్ క్వార్టర్ ఫైనల్లో 2–13తో జెలీమ్‌ఖాన్ అబకరోవ్ (అల్బేనియా) చేతిలో ఓడిపోవడంతో రవి పతకం ఆశలు ఆవిరయ్యాయి.
2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన రవి గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు. 2020, 2021, 2022 ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన రవి ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకం గెలిచాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. 74 కేజీల విభాగంలో సాగర్ జగ్లాన్ క్వార్టర్ ఫైనల్లో 0–5తో కైల్ డగ్లస్ డేక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. కైల్ ఫైనల్ చేరుకోవడంతో సాగర్ నేడు కాంస్య పతకం కోసం బరిలో నిలిచాడు. రెండు బౌట్‌లలో సాగర్ గెలిస్తే అతనికి కాంస్యం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment