సీఈవో జీతంలో కోత
ఫ్రెంచ్ కార్ మేకర్ రెనాల్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ సీఈవో కార్లోస్ ఘోసన్ జీతంలో 20 శాతం కోత విధిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలోతెలియజేసింది. గతంలో షేర్ హోల్డర్స్ చేసిన తిరుగుబాటు, ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో దిగి వచ్చిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన జీతంలో 20 శాతం వేరియబుల్ భాగాన్ని కట్ చేస్తున్నట్టు రెనాల్ట్ తెలిపింది. కార్లెస్ పే పరిశ్రమలోని ఇతర సహచరులతో సమానంగా ఉందని కౌన్సల్ వివరించింది.
2015 ఏప్రిల్ నాటి వాటాదారుల సమావేశంలో సీఈవో భారీ జీతం ఆఫర్ ను వ్యతిరేకించింది. దాదాపు8 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన పే ప్యాకేజీని తిరస్కరిస్తూ ఆటోమొబైల్ దిగ్గజం వాటాదారులు ఓట్ చేశారు. కానీ వాటాదారుల అభ్యంతరాలను పట్టించుకోని సంస్థ బోర్డ్ ఆయన జీతాన్ని యథాతధంగా అమలు చేసింది. దీంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఈ కంపెనీలో 5 శాతం వాటాలను కలిగివున్న ఫ్రెంచ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలంటూ బోర్డుకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొద్ది వారాల్లో సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకోక పోతే తాము చట్టాన్ని చేయాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి ఇమ్మాన్యు యేల్ మ్యాక్రాన్ పార్లమెంట్ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది ఇలా ఉంటే కంపెనీకి చెందిన ఫౌండేషన్ కు తన జీతంలో సంవత్సరానికి ఒక మిలియన్ యూరోల విరాళంగా ఇవ్వనున్నట్టు ఘోసన్ ప్రకటించడం విశేషం
కాగా గత ఏడాది రెనాల్ట్ బలమైన ఫలితాలు చూపించింది. దాదాపు 50 శాతం వృద్ధితో గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఫ్రాన్స్ కు చెందిన టాప్ కంపెనీలు సాధారణ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదంలో ఉంటే.. మేనేజ్ మెంట్ స్థాయి, సీనియర్ ఉద్యోగులకు చెలిస్తున్న భారీ వేతనాలపై బలమైన విమర్శలు ఎదుర్కొంటున్నాయి. సనోఫీ, ప్యుగోట్-సిట్రోయెన్ ఆల్స్టామ్ సహా ఫ్రాన్స్ టాప్ సంస్థలు ఈ కోవలోకి వస్తాయి.