సారీ.. నా స్విచ్ బంద్ కాలేదు!
పూర్వం ఓ రాజు తెలివైన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని సలహాదారుగా నియమించుకోవాలని అనుకున్నాడు. ముగ్గురికీ తలపై ఒక్కో టోపీ పెట్టాడు. ఒక టోపీ నీలిరంగులో, మిగతా రెండు తెలుపు రంగులో ఉంటాయని, ఎదుటివారి టోపీలను చూసి ఎవరి తలపై ఉన్న టోపీ రంగును వారు చెప్పాలని అడిగాడు. ఇది ‘ద కింగ్స్ వైజ్మెన్ పజిల్’గా చాలామందికి తెలిసిన పరీక్షే. అయితే, ఈ పరీక్షలో మొట్టమొదటిసారిగా ఓ యంత్రుడు కూడా నెగ్గాడు! మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే ఓ సమస్యను సైతం పరిష్కరించాడు.
ఫ్రెంచ్ కంపెనీ ఆల్డిబరాన్కు చెందిన ‘నవో’ హ్యూమనాయిడ్ రోబో ఈ ఘనతను సాధించింది. రోబోలకు కృత్రిమ తెలివి దిశగా కీలక విజయం అయిన ఈ పరీక్షను న్యూయార్క్‌లోని ‘రెన్సెలర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఏఐ అండ్ రీజనింగ్ ల్యాబ్’లో నిర్వహించారు. వివరాల్లోకెళితే.. రోబోల తలపై తడుతూ ఓ స్విచ్‌ను ఆపేస్తారు. ఓ రోబో తలపై డమ్మీ స్విచ్ ఉంటుంది. దానిని ఆపేసినా తేడా ఉండదు. ఆ స్విచ్ ఏ రోబోకు పెట్టామన్నది మాత్రం వాటికి తెలియదు. స్విచ్‌లు ఆపేశాక.. డమ్మీ స్విచ్ ఉన్న రోబో తనకే ఆ స్విచ్ ఉందన్న విషయాన్ని గుర్తించి చెప్పాలి.
ఇదీ పరీక్ష. అయితే, మీలో ఎవరికి డమ్మీ స్విచ్ ఉందని అడగ్గానే.. కొన్ని క్షణాలకు ఓ రోబో లేచి నిలబడింది. ‘నాకు తెలియద’ని బదులిచ్చింది. వెంటనే పొరపాటు గ్రహించి చేయి ఊపుతూ ‘సారీ.. నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నేను మాట్లాడగలుగుతున్నాను. నా స్విచ్ బంద్ కాలేదు..’ అని చెప్పింది. పరీక్షలో గెలవడమంటే.. పరీక్ష నియమాలను అర్థం చేసుకోవడం, ఇతర రోబోలకు తనకు ఉన్న తేడాను తెలుసుకోవడం, ఇతర సామర్థ్యాలను రోబో చాటుకున్నట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.