freshwater scheme
-
రోగాల భయం..
►గ్రామాల్లో కలుషిత నీటితో పొంచి ఉన్న ముప్పు ► కానరాని క్లోరినేషన్ పనులు ► పట్టించుకోని అధికారులు ‘మా గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. కానీ అది పని చేయడం లేదు. వర్షాకాలమైనా ఎండకాలమైనా వాగునీటినే తాగుతున్నం. అప్పుడప్పుడు రోగాలు వచ్చినా తప్పడం లేదు. వానలు వచ్చినపుడు మురికిగా ఉన్న వాగునీళ్లే దిక్కు’ అని చింతలమానెపల్లి మండలానికి చెందిన మోర్లె లలిత ఆవేదనగా తెలిపింది. ఈ సమస్య లలిత ఒక్క దానిదే కాదు జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారు. చింతలమానెపల్లి(సిర్పూర్): వర్షాలు మొదలయ్యాయి. వాగులు పొంగిపారుతున్నా యి. బావుల్లోకి కొత్తనీరు చేరింది. కానీ ప్రభుత్వం క్లోరినేషన్ పనులు చేపట్టకపోవడంతో గత్యంతరం లేక కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. కలుషిత నీరే సకల వ్యాధులకు కారణం. స్వచ్ఛభారత్‌లో భాగంగా నీటి కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ప్ర చారం చేస్తున్నా ఆచరణలో మాత్రం కనిపిం చడం లేదు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పని చేయడం లేదు. దీంతో సమీపంలోని వాగులు, చెరువుల్లోని నీరు లేదా వ్యవసాయ బావుల నీటినే తాగునీటిగా వాడుతున్నారు. వర్షాకాలంలో సైతం చాలా గ్రామాల ప్రజలు వాగునీటినే తాగుతున్నారు. వాగు నీరు తాగితే ప్రజలకు రోగాలు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉంది. అతిసార, రక్తవిరోచనాలు, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రాణాలకు హాని కలిగించే పచ్చ కామెర్ల వ్యాధి నీటి కాలుష్యంతోనే సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. చింతలమానెపల్లి మండలంలోని బాబాసాగర్, రుద్రాపూర్, చిత్తాం, గంగాపూర్, రణవెల్లి కౌటాల మండలంలోని కుంబారి, విర్దండి, సిర్పూర్ మండలంలోని లోనవెల్లి, డోర్‌పెల్లి, పారిగాం, దహెగాం మండలంలోని కొంచవెల్లి, గెర్రె సహా మండలాల్లో చాలా గ్రామాల ప్రజలు తాగునీటికి వాగులపై ఆధార పడుతున్నారు. ఈ గ్రామాలే కాకుండా మండలల్లోని చాలా గ్రామాల్లో మంచినీటికి వాగులే దిక్కు. గ్రామాల్లో తాగునీటికి ఏర్పాటు చేసిన బావులు చాలా వరకూ శిథిలావస్థలో ఉన్నాయి. వినియోగంలో ఉన్న బావుల నుంచి డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు బావుల చుట్టూ నిలుస్తోంది. జాడలేని ప్రభుత్వ చర్యలు ఏటా ప్రభుత్వం నీటి కాలుష్యం నివారించడానికి పలు రకాల చర్యలు తీసుకుంటోంది. నీటి కాలుష్యం గుర్తించడానికి ప్రత్యేక కిట్లను పంపిణీ చేస్తోంది. వర్షాలు పడగానే బావుల్లో, చేతిపంపుల్లో క్లోరినేషన్ నివారించాలి, మురుగు కాలువల్లో బయోటెక్ స్ప్రేను పిచి కారీ చేయాలి. కానీ ఈఏడాది ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల సమన్వయలోపంతో నీటి కాలుష్యాన్ని గుర్తించే కిట్లను ఇప్పటివరకు ఉపయోగించిన దాఖలాలు లేదు. గ్రామాల్లో క్లోరినేషన్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ కాని క్లోరిన్ ద్రావణం కాని సరఫరా చేయలేదని అధికారులే తెలియ జేస్తున్నారు. గతంలో కలుషిత నీటితో జరిగిన సంఘటనలు కౌటాల మండలంలోని నాగెపల్లి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం కలుషిత నీరు కారణంగా ఊరు మొత్తం డయేరియా బారిన పడి విరోచనాలు వాంతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం 40మందికి పైగా ప్రజలకు కలుషిత నీటి కారణంగా జ్వరాలతో మంచం పట్టారు.చింతలమానెపల్లి మండల కేంద్రంలోని హేటిగూడెంలో మూడు సంవత్సరాల క్రితం నీటి కాలుష్యంతో గ్రామస్తులు జ్వరాల బారినపడ్డారు. -
రూ.కోట్లు వెచ్చించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు
► సత్యసాయి నీటి కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ట్యాంకులు నిరుపయోగం ► 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎన్పీకుంట వాసులు ఎన్పీకుంట : మండలంలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించి సత్యసాయి మంచినీటి పథకం రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. దాహార్తి నివారణతో పాటు ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. రక్షిత మంచినీరు గ్రామీణులకు అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందించడానికి 1998లో రూ.7.33 కోట్ల వ్యయంతో ఎన్పీకుంట, గాండ్లపెంట, కదిరి రూరల్ మండలాలతో కలిపి 105 గ్రామాలకు సత్యసాయి నీటి పథకం ద్వారా నీరు అందించడానికి అప్పటి ఎమ్మెల్యే జొన్నా సూర్యనారాయణ పథకాన్ని ప్రారంభించారు. కదిరి నుంచి ఎన్పీకుంట వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి 2 కిలోమీటర్ల పరిధిలో ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ఫ్లోరైడ్ రహిత నీటిని అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అయితే పథకం ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మండల ప్రజలకు సత్యసాయి నీరు అందడంలేదు. ప్రతి ఏటా వేసవిలో గ్రామాల్లో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశాలల్లో మాత్రం త్వరలోనే సత్యసాయి నీటి సరఫరా కోసం సర్వే చేస్తున్నామని ప్రజా ప్రతినిధులకు అధికారులు భరోసా ఇచ్చారే కానీ ఇంతవరకు పనులు జరగలేదు. ఏర్పాటు చేసిన పైపులూ చోరీకి గురి.. నీటి సరఫరా సంగతి పక్కన బెడితే, పలుచోట్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయగా, వాటిలో కొన్నిచోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. వాటి స్థానంలో కొత్త పైపులు అమర్చలేదు. సత్యసాయి నీటి కోసం గ్రామాల్లో నిర్మించిన మంచినీటి ట్యాంకులు సైతం దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మండలంలోని వెలిచెలమల, వడ్డిపల్లి, పడమర నడిమిపల్లి, గౌకనపేట, తాటిమానుగుంత, బందారుచెట్లపల్లి, దిగువపల్లి, ఎన్.పీకుంట, టీఎన్పల్లి, జౌకల, మండెంవారిపల్లి, మర్రికొమ్మదిన్నె తదితర గ్రామాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉందని గుర్తించిన అధికారులు ఫిల్టర్ నీటిని అందించడానికి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అన్ని గ్రామాలకు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తాం అన్ని గ్రామాలకు నీటిని అందించాలంటే సంపు సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. అంతేకాకుండా పైప్‌లైన్‌లో సైతం సక్రమంగా నీటిని పంపు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉండాలనే ఉద్దేశ్యంతో సర్వే చేస్తున్నాం. అందుకు ఈ ఎడాది రూ,1.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి. - ఉమామహేశ్వరి. (ఆర్డబ్యుఎస్జెఈ) -
ఎవరికోసం ఈ వా(ట)ర్?
తాళ్లూరు, న్యూస్‌లైన్: ఆర్డబ్ల్యూఎస్.. విద్యుత్ శాఖ మధ్య సమన్వయ లోపం 31 గ్రామాలకు నీరు లేకుండా చేస్తోంది. దివంగత నేత వైఎస్ సహకారంతో రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద *9 కోట్లతో మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. దీని ద్వారా తాళ్లూరు మండలంలోని 26 గ్రామాలతో పాటు దర్శి మండలంలోని నాలుగు, ముండ్లమూరు మండలంలోని ఓ గ్రామానికి పైప్లైన్లు నిర్మించారు. 2012 ఏప్రిల్ నుంచి ప్రాజెక్టు ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. అయితే నీటి పథకానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఉప్పలపాడు సబ్‌స్టేషన్ ఏఈ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఐదు రోజులుగా నీటి సరఫరా జరగక జనం తిప్పలు పడుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ కొండయ్యను వివరణ కోరగా విద్యుత్ శాఖ.. అధిక మొత్తంలో బిల్లులు వేస్తోందని ఆరోపించారు. పథకానికి 70 హెచ్‌పీ మోటార్లను మాత్రమే ఏర్పాటు చేశామని.. దీనికి నెలకు *70 వేల లోపు మాత్రమే బిల్లు రావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే నెలకు * 2లక్షల వరకు బిల్లు వస్తోందని తెలిపారు. బిల్లులు కట్టాలని ఒత్తిడి తెస్తూ.. కనెక్షన్ తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బడ్జెట్ మంజూరయిన సమయంలో మాత్రమే బిల్లులు చెల్లించగలమన్నారు. తాగు నీటి పథకాలకు విద్యుత్ తొలగించకూడదని కలెక్టర్ ఆదేశాలున్నప్పటికీ నిబంధనలు అతిక్రమించడం విడ్డూరంగా ఉందన్నారు. హార్స్ పవర్‌ను బట్టి బిల్లులు వేయాలే తప్ప.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం పద్ధతి కాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదే విషయంపై విద్యుత్ అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా వారు స్పందించలేదు.