రోగాల భయం..
►గ్రామాల్లో కలుషిత నీటితో పొంచి ఉన్న ముప్పు
► కానరాని క్లోరినేషన్ పనులు
► పట్టించుకోని అధికారులు
‘మా గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. కానీ అది పని చేయడం లేదు. వర్షాకాలమైనా ఎండకాలమైనా వాగునీటినే తాగుతున్నం. అప్పుడప్పుడు రోగాలు వచ్చినా తప్పడం లేదు. వానలు వచ్చినపుడు మురికిగా ఉన్న వాగునీళ్లే దిక్కు’ అని చింతలమానెపల్లి మండలానికి చెందిన మోర్లె లలిత ఆవేదనగా తెలిపింది. ఈ సమస్య లలిత ఒక్క దానిదే కాదు జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారు.
చింతలమానెపల్లి(సిర్పూర్): వర్షాలు మొదలయ్యాయి. వాగులు పొంగిపారుతున్నా యి. బావుల్లోకి కొత్తనీరు చేరింది. కానీ ప్రభుత్వం క్లోరినేషన్ పనులు చేపట్టకపోవడంతో గత్యంతరం లేక కలుషిత నీటినే తాగాల్సి వస్తోంది. కలుషిత నీరే సకల వ్యాధులకు కారణం. స్వచ్ఛభారత్‌లో భాగంగా నీటి కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ప్ర చారం చేస్తున్నా ఆచరణలో మాత్రం కనిపిం చడం లేదు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పని చేయడం లేదు.
దీంతో సమీపంలోని వాగులు, చెరువుల్లోని నీరు లేదా వ్యవసాయ బావుల నీటినే తాగునీటిగా వాడుతున్నారు. వర్షాకాలంలో సైతం చాలా గ్రామాల ప్రజలు వాగునీటినే తాగుతున్నారు. వాగు నీరు తాగితే ప్రజలకు రోగాలు వ్యాపించే ప్రమాదం అధికంగా ఉంది. అతిసార, రక్తవిరోచనాలు, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రాణాలకు హాని కలిగించే పచ్చ కామెర్ల వ్యాధి నీటి కాలుష్యంతోనే సంభవిస్తుందని వైద్యులు అంటున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
చింతలమానెపల్లి మండలంలోని బాబాసాగర్, రుద్రాపూర్, చిత్తాం, గంగాపూర్, రణవెల్లి కౌటాల మండలంలోని కుంబారి, విర్దండి, సిర్పూర్ మండలంలోని లోనవెల్లి, డోర్‌పెల్లి, పారిగాం, దహెగాం మండలంలోని కొంచవెల్లి, గెర్రె సహా మండలాల్లో చాలా గ్రామాల ప్రజలు తాగునీటికి వాగులపై ఆధార పడుతున్నారు. ఈ గ్రామాలే కాకుండా మండలల్లోని చాలా గ్రామాల్లో మంచినీటికి వాగులే దిక్కు. గ్రామాల్లో తాగునీటికి ఏర్పాటు చేసిన బావులు చాలా వరకూ శిథిలావస్థలో ఉన్నాయి. వినియోగంలో ఉన్న బావుల నుంచి డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు బావుల చుట్టూ నిలుస్తోంది.
జాడలేని ప్రభుత్వ చర్యలు
ఏటా ప్రభుత్వం నీటి కాలుష్యం నివారించడానికి పలు రకాల చర్యలు తీసుకుంటోంది. నీటి కాలుష్యం గుర్తించడానికి ప్రత్యేక కిట్లను పంపిణీ చేస్తోంది. వర్షాలు పడగానే బావుల్లో, చేతిపంపుల్లో క్లోరినేషన్ నివారించాలి, మురుగు కాలువల్లో బయోటెక్ స్ప్రేను పిచి కారీ చేయాలి. కానీ ఈఏడాది ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల సమన్వయలోపంతో నీటి కాలుష్యాన్ని గుర్తించే కిట్లను ఇప్పటివరకు ఉపయోగించిన దాఖలాలు లేదు. గ్రామాల్లో క్లోరినేషన్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ కాని క్లోరిన్ ద్రావణం కాని సరఫరా చేయలేదని అధికారులే తెలియ జేస్తున్నారు.
గతంలో కలుషిత నీటితో జరిగిన సంఘటనలు
కౌటాల మండలంలోని నాగెపల్లి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం కలుషిత నీరు కారణంగా ఊరు మొత్తం డయేరియా బారిన పడి విరోచనాలు వాంతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం 40మందికి పైగా ప్రజలకు కలుషిత నీటి కారణంగా జ్వరాలతో మంచం పట్టారు.చింతలమానెపల్లి మండల కేంద్రంలోని హేటిగూడెంలో మూడు సంవత్సరాల క్రితం నీటి కాలుష్యంతో గ్రామస్తులు జ్వరాల బారినపడ్డారు.