సాక్షి, హైదరాబాద్: మాస్కు ధరించకుండా గ్రామాల్లో తిరిగితే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు అధికారం కట్టబెడుతూ మంగళవారం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పనిచేసే చోట్ల, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా కనిపిస్తే ఫైన్ వసూలు చేయాలని స్పష్టంచేశారు.
అలాగే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ పాలకవర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా పల్లెప్రగతి మాదిరి కార్యక్రమాలను తాజాగా నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, శానిటేషన్ కమిటీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. వానాకాలానికి ముందు, తర్వాత పక్కా, కచ్చా మురుగు కాల్వల్లో పూడికతీత తీయాలని, ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలను మొరంతో కప్పేయాలని సుల్తానియా సూచించారు.
ప్రతి ఇంట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఉండేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీలదేనని స్పష్టంచేశారు. రక్షిత నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పది రోజులకోసారి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు మాధ్యమాల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment