తాళ్లూరు, న్యూస్‌లైన్: ఆర్‌డబ్ల్యూఎస్.. విద్యుత్ శాఖ మధ్య సమన్వయ లోపం 31 గ్రామాలకు నీరు లేకుండా చేస్తోంది. దివంగత నేత వైఎస్ సహకారంతో రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద *9 కోట్లతో మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. దీని ద్వారా తాళ్లూరు మండలంలోని 26 గ్రామాలతో పాటు దర్శి మండలంలోని నాలుగు, ముండ్లమూరు మండలంలోని ఓ గ్రామానికి పైప్‌లైన్లు నిర్మించారు. 2012 ఏప్రిల్ నుంచి ప్రాజెక్టు ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. అయితే నీటి పథకానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఉప్పలపాడు సబ్‌స్టేషన్ ఏఈ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
దీంతో ఐదు రోజులుగా నీటి సరఫరా జరగక జనం తిప్పలు పడుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కొండయ్యను వివరణ కోరగా విద్యుత్ శాఖ.. అధిక మొత్తంలో బిల్లులు వేస్తోందని ఆరోపించారు. పథకానికి 70 హెచ్‌పీ మోటార్లను మాత్రమే ఏర్పాటు చేశామని.. దీనికి నెలకు *70 వేల లోపు మాత్రమే బిల్లు రావాల్సి ఉంటుందని చెప్పారు. అయితే నెలకు * 2లక్షల వరకు బిల్లు వస్తోందని తెలిపారు. బిల్లులు కట్టాలని ఒత్తిడి తెస్తూ.. కనెక్షన్ తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బడ్జెట్ మంజూరయిన సమయంలో మాత్రమే బిల్లులు చెల్లించగలమన్నారు. తాగు నీటి పథకాలకు విద్యుత్ తొలగించకూడదని కలెక్టర్ ఆదేశాలున్నప్పటికీ నిబంధనలు అతిక్రమించడం విడ్డూరంగా ఉందన్నారు. హార్స్ పవర్‌ను బట్టి బిల్లులు వేయాలే తప్ప.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం పద్ధతి కాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదే విషయంపై విద్యుత్ అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా వారు స్పందించలేదు.
ఎవరికోసం ఈ వా(ట)ర్?
Published Sat, Jan 4 2014 1:57 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
Advertisement
Advertisement