ప్రైవేట్ బ్యాంక్స్.. టాప్ గన్స్!
రుణాల వృద్ధి, మొండిబాకీల తగ్గుదలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ సంస్థలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ త్రివేది. బ్యాంకింగ్ విభాగంలో ప్రైవేట్ బ్యాంకులు ఆశావహంగా కనిపిస్తున్నాయని, ఫార్మా కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
ఎన్నికలు.. మార్కెట్లపై..
ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దేశీ ఈక్విటీ మార్కెట్ల పనితీరు ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్ఐఐ) రాకతో ప్రస్తుతం ఈ లోటు తీరగలదని అంచనాలు ఉన్నాయి. తొలి రెండు నెలల్లో ఎఫ్ఐఐలు దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వెల్లడయ్యే దాకా స్వల్పకాలిక ఇన్వెస్టర్లు కాస్త నెర్వస్‌గానే ఉండొచ్చు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానంగా కంపెనీల ఆదాయాల అంచనాలు, వాటికి తగ్గట్లుగా షేరు ధరలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి.
ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నట్లు భావిస్తున్నాం. మూలధనం తగినంత స్థాయిలో ఉన్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధికి సంబంధించి ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో ఉండే అవకాశం ఉంది. గత కొన్నాళ్లుగా ఫార్మా రంగం అంతగా రాణించలేకపోయినప్పటికీ .. ప్రస్తుతం ఎకానమీ, ఎగుమతులు పుంజుకుంటున్న నేపథ్యంలో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. మధ్యకాలికంగా చూస్తే ఐటీ రంగం కూడా బాగానే కనిపిస్తోంది. డీల్స్ సంఖ్య పెరుగుతోంది. అమ్మకాలపరంగా ఆటోమొబైల్ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. కానీ వేల్యుయేషన్స్ ప్రస్తుతం బాగా కరెక్షన్కు లోనయ్యాయి. కొన్ని షేర్లు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్నాయి. స్థూల గణాంకాలు చూస్తుంటే ఆర్థిక కార్యకలాపాలు కాస్త తగ్గిన ట్లుగా కనిపిస్తోంది. డిమాండ్‌పరంగా మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్దిష్ట రంగం లేదా స్టాక్‌పైనే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. ఉదాహరణకు రుణ వృద్ధి పుంజుకోవడం, మొండిబాకీలు తగ్గుతుండటం వంటివి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చు. ఇక ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికం సీజనల్‌గా బలహీనంగానే ఉంటుంది. కరెన్సీపరమైన ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు.
ఇక మా నిర్వహణలోని యూటీఐ టీఅండ్ఎల్ ఫండ్ ప్రధానంగా రవాణా, ఆటో, లాజిస్టిక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇటీవలి కాలంలో వాహన రంగం చాలా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఫలితంగా కొనుగోలుదారులపై అధిక భారం మోపాల్సి వస్తోంది. ఇలా కొనుగోలు వ్యయాలు పెరిగిపోతుండటం వల్ల డిమాండ్ మందగించింది. పండుగల సీజన్, ఆ తర్వాత కూడా ఇదే ధోరణి నెలకొంది. వ్యయాలు పెరిగిపోవడం, డిమాండ్ తగ్గడం వంటి అంశాలతో వాహన కంపెనీల లాభాల అంచనాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో వాటి వేల్యుయేషన్స్ సైతం కరెక్షన్కు లోనయ్యాయి. అయితే, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారత మార్కెట్లో వాహనాల వినియోగం ఇంకా పూర్తి స్థాయికి చేరలేదు. పెరుగుతున్న తలసరి ఆదాయాలతో డిమాండ్ కూడా మెరుగుపడవచ్చు. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్ ఉన్న వాహనాలకు అప్‌గ్రేడ్ అవుతుండటంతో.. వాహన కంపెనీలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే ఈ రంగంపై మేం ఆశావహంగా ఉన్నాం. ఆటోమొబైల్, లాజిస్టిక్స్‌లో వృద్ధి అవకాశాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి.
ప్రస్తుత ఈక్విటీ మార్కెట్లపై అంచనాలు..
గడిచిన కొన్ని సంవత్సరాలుగా కంపెనీల వాస్తవ ఆర్థిక పనితీరు .. ఏడాది ప్రారంభంలో వేసే అంచనాలకన్నా తక్కువగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో కొన్ని త్రైమాసికాలుగా ఆదాయాల డౌన్‌గ్రేడ్స్ మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఆదాయాల వృద్ధి కొంత మెరుగుపడుతున్న ట్రెండ్ కనిపిస్తున్నప్పటికీ.. వేల్యుయేషన్స్‌పరంగా సవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ50 తీసుకుంటే దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే సుమారు 18% ప్రీమియంతో ట్రేడవుతోంది. అలాగే మిడ్‌క్యాప్ సూచీలు దాదాపు 8% ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. మొత్తం మీద కంపెనీల ఆదాయాలు మరింతగా మెరుగుపడాలి. ఇవి కాకుండా వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కూడా కొంత మేర భారత మార్కెట్లకు ఊతంగా ఉండగలదని అంచనా.